23
1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: 2 “ఈ రోజున కూడా నేను దుఃఖంతో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. నా మూలుగుల మీద బరువైన చెయ్యి పడింది.
3 ఆయన నాకు ఎక్కడ కనిపిస్తాడో నాకు తెలిస్తే బాగుండేది! ఆయన నివాస స్థానానికి చేరాలని ఉంది నాకు!
4 అప్పుడు ఆయన ఎదుటే నా ఫిర్యాదు చెప్పుకొంటాను. వాదోపవాదాలు నా నోటినిండా ఉంటాయి.
5 నాకు జవాబుగా ఆయన ఏ మాటలు పలుకుతాడో తెలుసుకొంటాను. ఆయన చెప్పబోయేది ఏమిటో నేను చూచుకొంటాను.
6 ఆయన తన మహా బలసామర్థ్యాలను ప్రయోగించి నాతో వాదిస్తాడంటారా? అలా చెయ్యడాయన. ఆయన నా మాటలు శ్రద్ధతో వింటాడు.
7 అక్కడ యథార్థపరుడు ఆయన ఎదుట చెప్పుకోగలడు. అప్పుడు నా న్యాయమూర్తి నాకు ఏమీ శిక్ష విధించడు.
8 కాని, నేను తూర్పుకు వెళ్ళినా ఆయన అక్కడ లేడు. పడమటికి వెళ్ళినా అక్కడా ఆయన దొరకడు.
9 ఉత్తరాన ఆయన పని చేస్తూవుంటే, అక్కడ కూడా ఆయనను చూడలేకపోతున్నాను. ఆయన దక్షిణం వైపుగా తిరిగితే కూడా ఆయన నాకు కనబడడు.
10 అయినా, నేను నడిచే త్రోవ ఆయనకు తెలుసు. ఆయన పెట్టిన పరీక్షలో నుంచి నేను బంగారంలాగా బయటికి వస్తాను.
11 నా పాదాలు ఆయన అడుగుజాడల్లోనే నడిచాయి. ఆయన మార్గాన్నే అనుసరించాను. వైదొలగినవాణ్ణి కాను.
12 ఆయన పెదవులమీదినుంచి వచ్చిన ఆజ్ఞను నేను విడిచిపెట్టలేదు. ఆయన నోటి మాటలు నా సొంత అభిప్రాయాలకంటే విలువైనవని భావించాను.
13 అయితే ఏం? ఆయన చపలచిత్తుడు కాడు. ఆయన మనసు త్రిప్పగలవాడెవడు? ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడు.
14 ఆయన నా పట్ల ఏది విధించాడో అదే ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇలాంటివెన్నో నిర్వహిస్తాడు.
15 అందుచేత ఆయన ఎదుట భయాందోళన పడుతున్నాను. నేనిది ఆలోచిస్తే, హడలిపోతున్నాను.
16 నా హృదయం క్రుంగిపోయింది – దీనికి దేవుడే కారణం! అమిత శక్తిమంతుని మూలంగానే నాకీ భయాందోళన!
17 అంధకారం నా ముందరే ఉంది. నా ముఖాన్ని కటిక చీకటి కమ్ముకుంది. అయినా, నేను మౌనం వహించలేదు.