22
1 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు ఈ విధంగా జవాబిచ్చాడు: 2 ✽“మనిషివల్ల దేవునికి ఏమైన ప్రయోజనం ఉంటుందా! తెలివి గల మనిషికే దానివల్ల ప్రయోజనం ఉంటుంది.3 నీవు న్యాయంగా ప్రవర్తించేవాడివైతే, అది అమిత శక్తిమంతుడికి విలువైందా? నీ విధానాలు నిర్దోషం కావడం వల్ల ఆయనకేమైన లాభం కలుగుతుందా?
4 ✽ఆయన పట్ల భయభక్తులున్నాయని ఆయన నిన్ను ఖండిస్తాడా? నిన్ను తీర్పులోకి తెస్తాడా?
5 నీ చెడుగు గొప్పది కాదా? నీ అక్రమాలు అపారమైనవి కావా?
6 ఏమీ ఇవ్వకుండానే నీ సాటి మానవుల దగ్గర నీవు తాకట్టు తీసుకొన్నావు. బట్టలు అసలే లేనివాళ్ళ దగ్గరనుంచి బట్టలు లాక్కున్నావు.
7 అలసిపోయిన వాళ్ళకు నీళ్ళిచ్చావు కావు. ఆకలిగా ఉన్నవాళ్ళకు ఆహారం పెట్టలేదు.
8 ‘బలవంతుడిదే భూమి, ఘనత వహించినవాడే అందులో ఉండాలి’ అనుకున్నావు.
9 వితంతువులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేని పిల్లలను అణగద్రొక్కావు.
10 అందుచేతే నీ చుట్టూ ఉరులు ఒడ్డివున్నాయి. హఠాత్తుగా భయం నీకు పట్టుకుంది.
11 అందుచేతే దేన్నీ చూడలేనంత చీకట్లు నిన్ను కమ్ముకొన్నాయి. నిన్ను ముంచివేసే వరదలు నీ మీదుగా పొర్లిపారాయి.
12 దేవుడు ఆకాశమంత ఎత్తున ఉన్నాడు గదా! నక్షత్రాలు ఎంత ఎత్తున ఉన్నాయో చూడు. అవి ఎంతో పైన ఉన్నాయి!
13 అయినా, ‘దేవునికేం తెలుసు? కటిక చీకటి గుండా చూచి, తీర్పు చెప్పగలడా?’ అనుకుంటున్నావు నీవు.
14 ‘దట్టమైన మేఘాలు ఆయన చుట్టూ ఉన్నాయి. ఆయన చూడడు. ఆకాశం అంచుల్లో ఆయన తిరుగుతున్నాడు. ఇది నీ తలంపు!’
15 ✽దుర్మార్గులు నడిచిన పాత మార్గం నీవు అవలంబిస్తావా?
16 వాళ్ళు తమ గడువు తీరకముందే నాశనమైపొయ్యారు. వాళ్ళ పునాదులు వరదల్లో కొట్టుకుపొయ్యాయి!
17 దేవుడు వాళ్ళ నివాసాలు మంచివాటితో నింపినా ‘మా దగ్గర నుంచి వెళ్ళిపో! అమిత శక్తిమంతుడు మమ్మలనేమీ చెయ్యడు లే’ అని వాళ్ళు దేవునితో అంటారు.
18 దుర్మార్గుల ఆలోచనలే నాకు దూరమైపోతాయి గాక!
19 న్యాయవంతులు వాళ్ళ కోసం చూచి ఆనందిస్తారు; అమాయకులు వాళ్ళను చూచి ఎగతాళి చేస్తారు.
20 ‘మన పగవాళ్ళు తప్పనిసరిగా నాశనమైపొయ్యారు. వాళ్ళసిరి సంపదలు నిప్పుతో తగలబడిపొయ్యాయి’ అని చెప్పుకొంటారు.
21 ✽దేవునితో సహవాసం చేసి చూడు. నీకు శాంతి కలుగుతుంది. ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది.
22 ఆయన నోటినుంచి వెలువడే ఉపదేశం స్వీకరించు. నీ మనసులో ఆయన వాక్కులు ఉంచుకో.
23 అమిత శక్తిమంతునివైపు నీవు తిరిగితే, నీవు మళ్ళీ అభివృద్ధి పొంది సుస్థిరం అవుతావు. నీ నివాసంలో అన్యాయాన్ని దూరంగా తొలగించాలి.
24 నీ బంగారాన్ని మట్టిలో పడెయ్యి! ఓఫీర్ కనకాన్ని ఏటిలో ఉన్న రాళ్ళ కింద పారెయ్యి!
25 అప్పుడు అమిత శక్తిమంతుడు తానే నీకు బంగారం అవుతాడు. నీకు అంతు లేనంత వెండి అవుతాడు.
26 అప్పుడు అమిత శక్తిమంతుని మూలంగా నీకు ఆనందం కలుగుతుంది. నీవు దేవునివైపు ముఖం ఎత్తగలుగుతావు.
27 అప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. నీ మ్రొక్కుబళ్ళను నీవు చెల్లిస్తావు.
28 నీ నిర్ణయాలు నెరవేరుతాయి. నీ దారిమీద వెలుగు ప్రకాశిస్తుంది.
29 నిన్ను పడద్రోయడం జరిగితే ‘లేస్తాను!’ అంటావు. వినయం గలవారిని దేవుడు రక్షిస్తాడు.
30 నిరపరాధి కాని వ్యక్తిని కూడా ఆయన విముక్తుణ్ణి చేస్తాడు. అలాంటి వ్యక్తికి నీ నిర్దోషత్వం కారణంగా విడుదల చేకూరుతుంది.