21
1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: 2 “నేను చెప్పేది శ్రద్ధతో వినండి. మీరు నన్ను ఓదార్చడానికి బదులు ఇలా వింటే చాలు!
3 నేను మాట్లాడుతాను. ఓర్చుకోండి. నేను మాట్లాడిన తరువాత నన్ను వేళాకోళం చేస్తే చెయ్యండి.
4 నేను మనుషుల మీద ఫిర్యాదు చేయడం లేదు. నేనెందుకు ఆతురపడకూడదు?
5 నావైపు చూచి ఆశ్చర్యపడండి. నోటిమీద చెయ్యి పెట్టుకోండి.
6 ఈ విషయాన్ని గురించి తలంచుకొంటేనే నేను హడలిపోతాను. నా శరీరం వణకుతుంది.
7 దుర్మార్గులు ఇంకా బ్రతుకుతూ ఉంటారెందుకని? ముసలివాళ్ళయి బలప్రభావాల అభివృద్ధి చెందుతారెందుకు?
8 వాళ్ళ ఎదుటనే, వాళ్ళ చుట్టూ వాళ్ళ సంతానం సుస్థిరమవుతుంది. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది.
9 వాళ్ళ కుటుంబాలు నిర్భయంగా, సురక్షితంగా ఉన్నాయి. దేవుని శిక్షాదండం వాళ్ళ మీదికి రావడం లేదు.
10 వాళ్ళ పశువులు దాటితే తప్పనిసరిగా చూలు కలుగుతుంది. ఈసుకుపోకుండా ఆవులు సులభంగా ఈనుతాయి.
11 వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయలుదేరుతారు. వాళ్ళ చిన్నవారు ఎగిరి కుప్పి గంతులు వేస్తారు.
12 వాళ్ళు కంజరి, తంతి వాద్యం వాయిస్తూ స్వరమెత్తి పాడతారు. పిల్లనగ్రోవి మోగిస్తూ ఆనందిస్తారు.
13 వాళ్ళ రోజులు సుఖంగా గడుపుతారు. ఒక్క క్షణంలోనే మృత్యులోకంలోకి దిగిపోతారు.
14 అయినా వాళ్ళు దేవునితో ‘మా దగ్గరనుంచి వెళ్ళిపో! నీ విధానాల గురించి తెలుసుకోవడానికి మాకు ఆశ లేదు’ అంటారు.
15 ‘మనం సేవ చేయడానికి అమిత శక్తిమంతుడు ఏపాటివాడు? ఆయనను వేడుకుంటే మాకేమి లాభం చేకూరుతుంది?’ అంటారు.
16 కాని, వాళ్ళ అభివృధ్ధి వాళ్ళ చేతిలో లేదు. దుర్మార్గుల ఆలోచనలే నాకు దూరమవుతాయి గాక!
17 దుర్మార్గుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళకు విపత్తులు రావడం, కోపకారణంగా దేవుడు వేదనలు కలిగించడం తరచుగా జరుగుతుందా?
18 గాలికి వాళ్ళు గడ్డి పరకలు కావడం, తుఫానులకు చెత్తలాగా వాళ్ళు కొట్టుకుపోవడం అరుదు గదా? ఆగ్రహంతో దేవుడు వాళ్ళను వేదనపాలు చేయడమూ అరుదు.
19 మనిషికి రావలసిన దోష శిక్షను దేవుడు అతడి పిల్లల మీద రప్పిస్తాడు అంటారు. కాని, చేసినవారు అది అనుభవించేలా దేవుడు ఆ మనిషికే ప్రతిఫలమివ్వాలి.
20 అతడి నాశనాన్ని అతడే స్వయంగా చూడాలి. అమిత శక్తిమంతుని ప్రచండ కోపాన్ని అతడే పానం చేయాలి.
21 తన జీవితంలో మాసాల సంఖ్య ముగిసిన తరువాత తన ఇంటి విషయం అతడికి ఏం శ్రద్ధ ఉంటుంది?
22 ఎవడైనా దేవునికి జ్ఞానోపదేశం చేయగలడా? ఆయన మహనీయులకు తీర్పరి గదా?
23 ఒక వ్యక్తి బాగా బలిష్ఠుడై ఉండి క్షేమంగా ఉంటూ, చీకూ, చింతా లేకుండా బ్రతుకుతూ చనిపోతాడు.
24 అతడి కుండనిండా పాలు ఉంటాయి. అతడి ఎముకల్లో సత్తువ బాగా ఉంటుంది.
25 ఇంకో మనిషి మంచిది ఏదీ ఎప్పుడూ అనుభవించకుండా మనోవేదనతో చస్తాడు.
26 ఇద్దరూ ఒకే పంక్తిలో మట్టిలో పడుకొంటారు. ఇద్దరినీ పురుగులు ఆవరిస్తాయి.
27 మీ తలంపులు నాకు తెలుసు, నాకు వ్యతిరేకంగా మీరు పన్నే దురాలోచనలూ తెలుసు.
28 ‘ఉన్నత వంశీయుల గృహం ఎక్కడుంది? దుర్మార్గులు నివసించిన గుడారాలు ఎక్కడున్నాయి?’ అని మీరు అడుగుతున్నారు గదూ?
29 అయితే ప్రయాణాలు చేసేవారిని మీరు అడగకపొయ్యారా? వారు చెప్పే సంగతులు మీకు అర్థం కాలేదా?
30 ఏమిటంటే, విపత్తు వచ్చిన రోజు దుర్మార్గులు తప్పించుకొంటారు. ఆగ్రహ దినాన వాళ్ళు దాని నుంచి తీసుకుపోబడతారు.
31 వాళ్ళ ముఖంమీదే వాళ్ళ విధానాన్ని ఎవరు ఖండిస్తారు? వాళ్ళు చేసిన దానికి ఎవరు ప్రతీకారం చేస్తారు?
32 వాళ్ళను సమాధికి తెస్తారు. సమాధి మీద జాగ్రత్తగా కావలి కాస్తారు కూడా.
33 పల్లంలోని మంటి గెడ్డలు వాళ్ళకు సుఖంగా ఉంటాయి. మనుషులంతా వాళ్ళ వెంటబడిపోతారు. అసంఖ్యాకులు వాళ్ళకు ముందుగా అలాగే పొయ్యారు.
34 కాబట్టి, మీరు చెప్పే జవాబులు నమ్మతగ్గవి కావు. నన్ను గాలి మాటలతో ఏ విధంగా ఓదార్చగలరు?