20
1 అప్పుడు నయమాతువాడు జోఫరు ఈ విధంగా జవాబు చెప్పాడు: 2 “నా ఆతురతను బట్టి నా ఆలోచనలు నన్ను జవాబిచ్చేలా బలవంతం చేస్తున్నాయి.3 ✽నన్ను అవమానించే నింద నేను వినవలసివచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురికొలుపుతూ ఉంది.
4 ✽అనాది కాలంనుంచీ, మనిషిని భూమిమీద ఉంచడం జరిగినప్పటినుంచీ ఎలా ఉందో నీకు తెలియదూ?
5 దుర్మార్గుల ఆనందధ్వనులు ఉండేది కాసేపే! దైవభక్తి లేని ప్రజల సంతోషం క్షణికం!
6 వాళ్ళ గొప్పతనం ఆకాశాన్నంటేటంత ఎత్తుకు లేవవచ్చు. వాళ్ళు మేఘాలంత ఎత్తు తలలెత్తుకు తిరగవచ్చు.
7 కానీ వాళ్ళ మలంలాగే వాళ్ళు ఎన్నటికీ లేకుండా గతించిపోతారు. అంతకుముందు వాళ్ళను చూచిన వారు ‘వాళ్ళేరీ?’ అని అడుగుతారు.
8 కలలాగా ఎగిరిపోతారు వాళ్ళు. మళ్ళీ కనబడరు. రాత్రి స్వప్నంగా వాళ్ళను చెదరగొట్టడం జరుగుతుంది.
9 వాళ్ళను చూచిన కన్ను ఇంకా వాళ్ళను చూడదు. వాళ్ళ స్థలంలో వాళ్ళు మళ్ళీ కనిపించరు.
10 వాళ్ళ పిల్లలు దరిద్రుల దగ్గర అడుక్కుంటారు. చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చేస్తారు.
11 వాళ్ళ ఎముకల్లో యువ బలం నిండి ఉన్నా, అదంతా మట్టిలో వాళ్ళతోపాటే పడుకుంటుంది.
12 చెడుగు వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. నాలుక క్రింద దాన్ని మాటు పెట్టుకునే వాళ్ళు, 13 దాన్ని పదిలం చేసుకునే వాళ్ళు. దాన్ని ఒక పట్టాన పోనియ్యరు. నోట్లోనే దాన్ని అట్టిపెట్టుకునేవాళ్ళు.
14 అయితే వాళ్ళ కడుపులో తిన్నదంతా పాసిపోతుంది. వాళ్ళలో అదంతా నాగుపాము విషంగా మారుతుంది.
15 ఐశ్వర్యాన్ని దిగమింగేశారు గాని అదంతా బయటికి కక్కేస్తారు. కడుపులో ఇమడకుండా దాన్ని దేవుడే కక్కిస్తాడు.
16 వాళ్ళు కట్లపాము విషం లోపలికి పీల్చుకునే వాళ్ళు. పాము కోరలు వాళ్ళను చంపేస్తాయి.
17 వాగులై, నదులై పారే తేనె మీగడలను ఇక చూచి సంతోషించరు.
18 వాళ్ళు శ్రమించి సంపాదించుకున్నది కాస్తా అనుభవించకుండానే తిరిగి ఇచ్చివేయాలి. తాము సంపాదించిన ఆస్తిని బట్టి వాళ్ళకు సంతోషం కలగదు.
19 దరిద్రుల మీద దౌర్జన్యం చేసి వదిలిపెట్టే వాళ్ళు, తాము కట్టని ఇండ్లను బలాత్కారంగా ఆక్రమించేవాళ్ళు. వాటిని కట్టి ముగించరు.
20 వాళ్ళ పేరాశకు విరామమంటూ లేదు. తమకు ప్రీతిపాత్రమైన వాటితో తమను విపత్తునుంచి తప్పించుకోలేరు.
21 వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అంచేత వాళ్ళ అభివృద్థి కొనసాగదు.
22 వాళ్ళకు సమృద్ధి కలిగిన రోజులోనే వాళ్ళు ఇబ్బంది పాలవుతారు. దుర్దశలో ఉన్నవారంతా వాళ్ళ మీద చెయ్యి చేసుకుంటారు.
23 వాళ్ళు కడుపు నింపుకుంటుండగా దేవుడు తన తీవ్ర కోపాన్ని వాళ్ళ మీద కుమ్మరిస్తాడు. వాళ్ళు తింటూ ఉండగానే అలా చేస్తాడు.
24 ఇనుప ఆయుధం బారినుండి తప్పించుకుపోవాలని చూస్తారు. కంచు వింటినుంచి వెలువడ్డ బాణం వాళ్ళలోగుండా దూసుకుపోతుంది.
25 అది శరీరాన్ని చీల్చేస్తుంది. అందులో గుండా చొచ్చుకుపోతుంది. అది బయటికి తీస్తే పైత్య రసం కారుతుంది. మృత్యు భయం వాళ్ళను ఆవరిస్తుంది.
26 వాళ్ళు కూడబెట్టుకొన్నవి చీకటిమయం అవుతాయి. ఎవరూ ఊదని మంటలు రాజుకుని వాళ్ళను మింగివేస్తాయి. వాళ్ళ డేరాలో మిగిలిన దాన్ని నాశనం చేస్తాయి.
27 వాళ్ళ అపరాధాన్ని ఆకాశం బట్టబయలు చేస్తుంది. భూమి వాళ్ళ మీదికి ఎగబడుతుంది.
28 వాళ్ళ ఇంటి సంపద అంతర్ధానమై పోతుంది. దేవుని ఆగ్రహ దినాన అదంతా వరదపాలైపోతుంది.
29 దేవుని దగ్గరనుంచి చెడ్డవాళ్ళకు దొరికేది ఇదే! దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే!