19
1 ✽అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు: 2 “నన్ను మీరిలా ఎంతకాలం వేధిస్తారు? ఎంత కాలం మాటలచేత చితగ్గొట్టివేస్తారు?3 మీరు నన్ను పది సార్లు ఆడిపోసుకొన్నారు. నన్నిలా బాధిస్తూ ఉంటే, మీకు సిగ్గు అనిపించదూ!
4 ✽నాదే తప్పయితే, నా తప్పు నాకే ఉంటుంది.
5 నాకంటే మిమ్మల్ని మీరు గొప్ప చేసుకొని, నామీద మోపిన నింద రుజువు చేయాలని ఉంటే, 6 ✽ఒక సంగతి తెలుసుకోండి – దేవుడు నన్ను తారుమారు చేశాడు. తన వలలో నన్ను చిక్కించుకొన్నాడు.
7 నాపట్ల దౌర్జన్యం జరుగుతూ ఉందని నేను మొరపెట్టినా జవాబు రావడం లేదు. సహాయంకోసం ప్రాధేయపడినా నాకు న్యాయం చేకూరడం లేదు.
8 ✽నా మార్గం చుట్టూ దేవుడు కంచె వేశాడు. దీన్ని నేను దాటలేను. నా దారి అంతా చీకటిమయం చేశాడు.
9 నా గౌరవమంతా ఆయన హరించివేశాడు. నా తలమీది నుంచి కిరీటం తొలగించాడు.
10 అన్ని వైపుల నుంచీ ఆయన నన్ను దెబ్బ తీశాడు. నేను నాశనమయ్యాను. నా ఆశాభావాన్ని చెట్టులాగా వేళ్ళతో పెళ్ళగించివేశాడు.
11 ఆయన కోపాగ్ని నా మీద రగులుకొంది. నన్ను శత్రువుల్లో ఒకడుగా లెక్క కట్టివేశాడు.
12 ఆయన సైన్యాలు కూడి వచ్చాయి. వాళ్ళు నా చుట్టూరా ముట్టడి దిబ్బలు వేశారు. నా డేరా చుట్టూ దిగారు.
13 నా తోబుట్టువులనే ఆయన నాకు దూరం చేశాడు. నాకు పరిచయం ఉన్నవాళ్ళు నాకు పూర్తిగా పరాయివారు అయిపొయ్యారు.
14 నా బంధువులే నాకు ముఖం తప్పించారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపొయ్యారు.
15 మా ఇంట్లో దాసదాసీ జనం నన్ను పరాయి వాణ్ణిగా భావిస్తారు. వారి దృష్టికి నేను పూర్తిగా విదేశీయుణ్ణి!
16 నేను నా సేవకుణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను నోరు తెరచి వాణ్ణి ప్రాధేయపడవలసివచ్చింది.
17 నా ఊపిరి కూడా నా భార్యకు అసహ్యమైపోయింది. నా తోబుట్టువులకే నా వాసన అంటే పడకుండా పోయింది.
18 చిన్న పిల్లలు కూడా నన్ను తృణీకరిస్తున్నారు. నేను కనబడితే చాలు, వారు నన్ను తిట్టిపోస్తారు.
19 నా సన్నిహిత స్నేహితులందరూ నన్ను ఏవగించు కొంటున్నారు. నేను ప్రేమించినవారు నాకు ఎదురు తిరిగారు.
20 నా ఎముకలు చర్మానికీ, మాంసానికీ అంటుకుపోయాయి. నా పండ్ల చిగుళ్ళ మీది చర్మం మాత్రమే మిగిలివుంది.
21 ✽నా మీద జాలి చూపండి, నా స్నేహితులారా! జాలి చూపండి. దేవుని చేయి నన్ను దెబ్బ తీసింది.
22 దేవునిలాగే మీరు నన్నెందుకిలా హింసిస్తారు? నా శరీర మాంసం నాశనమైనదంటే, అది మీకు చాలదా?
23 ✽నా మాటలు లిఖితమైవుంటే ఎంత బావుండేది! ఇవన్నీ ఓ పుస్తకంలో రాసి పెట్టివుంటే ఎంత మంచిది!
24 నా మాటలు సదాకాలం నిలిచివుండేలా శిలాక్షరాలై, ఇనుప గంటంతో చెక్కబడి, సీసం కరిగించిపోసివుంటే ఎంత బావుండేది!
25 నాకు తెలుసు✽. నా విమోచకుడు సజీవుడు. తుదకు ఆయన భూమిమీద నిలబెడతాడు.
26 ఈ విధంగా నా చర్మం చీకి చివికిపోయాక, నా శరీరంతోనే నేను దేవుణ్ణి చూస్తాను.
27 నేను స్వయంగా చూస్తాను. మరెవరో కాదు, నేనే నా సొంత కళ్ళతో ఆయనను చూస్తాను. నా హృదయం నాలో సన్నగిల్లుతూ ఉంది.
28 ✽నాలోనే దీనికంతటికీ మూలకారణం ఉందని ‘ఎలా ఇతణ్ణి హింసిద్దామా?’ అనుకొంటూ ఉంటే 29 మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుని ఆగ్రహం ఖడ్గాన్ని పంపి దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉందని మీరు తెలుసుకొంటారు.