18
1 అప్పుడు షూహియావాడు బిల్దదు ఇలా బదులు చెప్పాడు: 2 “ఎంతకాలం నువ్విలా మాటలకోసం వేటాడుతావు? ఆలోచన చెయ్యి. అప్పుడు మేము మాట్లాడుతాం.3 ✽నీవెందుకు మమ్మల్ని మృగాలుగా, తెలివితక్కువ వాళ్ళుగా చూస్తున్నావు?
4 ✽కోపంచేత నిన్ను నువ్వే చీల్చుకుంటున్నావు. నీ కోసమని భూమి అంతా పాడైపోవాలా? నీకోసమై కొండ తన స్థానం తప్పాలా?
5 ✽దుర్మార్గుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ నిప్పుమంట మండడం మానేస్తుంది.
6 వాళ్ళ డేరాలో వెలుగే చీకటి అవుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
7 వాళ్ళ బలమైన అడుగులు వాళ్ళను ఇరుకు త్రోవలోకి తెస్తాయి. వాళ్ళ సొంత పోకడలు వాళ్ళను పడలాగుతాయి.
8 వాళ్ళ పాదాలే వాళ్ళను వలలోకి నడిపిస్తాయి. వాళ్ళు దానిమీద నడుస్తారు.
9 బోను వాళ్ళ మడిమను పట్టుకుంటుంది. ఉచ్చులో చిక్కుకుంటారు.
10 ఉరి వాళ్ళ కోసం నేలమీద పరచివుంది. వాళ్ళను పట్టుకునేందుకు దారిలోనే ఉచ్చు బిగించివుంది.
11 అన్ని వైపుల నుంచీ భయం కొలిపే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. అడుగడుగునా అవి వాళ్ళను వెంటాడుతాయి.
12 వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి విపత్తు కాచుకుని ఉంటుంది.
13 అది వాళ్ళ శరీరాన్ని తినేస్తుంది. వాళ్ళ అవయవాలను మరణకరమైన రోగం తినేస్తుంది.
14 వాళ్ళు డేరాలో నిర్భయంగా ఉంటే అక్కడనుంచి వాళ్ళను పెరికివేయడం జరుగుతుంది. వాళ్ళు భయంకరుడైన రాజు దగ్గరికి ఖైదీగా తరలిపోవాలి.
15 వాళ్ళకు కాని ఇతరులు వాళ్ళ గుడారంలో కాపురం ఉంటారు. వాళ్ళ నివాసం మీద గంధకం చల్లడం జరుగుతుంది.
16 వాళ్ళ వేళ్ళు క్రిందివి, క్రిందే వాడిపోతాయి. పైవి పైననే వాళ్ళ కొమ్మలు ఎండిపోతాయి.
17 భూమిమీద వాళ్ళ జ్ఞాపకం తుడిచి పెట్టుకుపోతుంది. భూతలం మీద వాళ్ళ పేరెక్కడా నిలవదు.
18 వాళ్ళను వెలుగులోనుంచి చీకట్లోకి తరిమివేస్తారు. భూమిమీద నుంచి వాళ్ళను తన్ని తరిమేస్తారు.
19 వాళ్ళకు స్వప్రజల్లో సంతానం, వంశం ఉండవు. వాళ్ళ నివాసాల్లో ఒకడూ తప్పించుకు వచ్చినవాడు ఉండడు.
20 వాళ్ళకు పట్టే గతిని చూచి పశ్చిమ దేశస్థులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్న వాళ్ళకు భయభ్రాంతులు కలుగుతాయి.
21 అన్యాయస్థుల కొంపలకు, దేవుణ్ణి ఎరగని వాళ్ళ స్థలానికి ఇదే గతి పడుతుంది.