17
1 “నా ప్రాణం నీరసించిపోయింది. నా రోజులు అయిపొయ్యాయి. సమాధి నాకోసం నోరు తెరచివుంది.2 ✽ఎగతాళి చేసేవాళ్ళు నా చుట్టు చేరారు. విరోధ భావాలు నేను గమనిస్తూనే ఉన్నాను.
3 ✽దేవా, నాకు నీవే స్వయంగా జామీను ఉంటానని మాట ఇవ్వు. నాకు నీవు గాక మరెవ్వరు జామీను ఉంటారు?
4 నీవు వీరి హృదయాలను మూసివేసి, జ్ఞానం రాకుండా చేశావు. కాబట్టి నీవు వారిని పైచేయి కానివ్వవు.
5 దోపిడీ సొమ్ముకోసం స్నేహితులను నిందించేవాడికి తన పిల్లల కండ్లు చీకిపోవడమే జరుగుతుంది.
6 ✝దేవుడు నన్ను ప్రజల మధ్య సామెతగా చేశాడు. నలుగురు నా ముఖం మీద ఉమ్మివేస్తారు.
7 ✝శోకంచేత నా కంటిచూపు మందగించింది. నా అవయవాలన్నీ నీడలైపొయ్యాయి.
8 ✽నిజాయితీపరులకు ఇది ఆశ్చర్యజనకం. అమాయకులు దైవభక్తి లేని వాళ్ళను చూచి ఆందోళన చెందుతారు.
9 అయినా, న్యాయవంతులు తమ బ్రతుకుతీరును అనుసరిస్తూనే ఉంటారు. శుద్ధ హస్తాలున్నవారి బలం అంతకంతకూ ఎక్కువ అవుతుంది.
10 ✽ఇప్పుడు మీరంతా మరో సారి నా మీదికి రండి! మీలో జ్ఞాని ఒక్కడూ కూడా నాకు కనబడడు!
11 నా రోజులు గతించాయి. నా ఆశయాలు అంతరించాయి. నా హృదయాభిలాషలు భంగం అయ్యాయి.
12 అయితే ఈ మనుషులు రాత్రినేమో పగలంటారు. చీకటి కమ్ముకొంటే, వెలుగు సమీపం అయిందంటారు.
13 ఒకవేళ మృత్యు లోకమే నా ఇల్లు కావాలని నేను ఆశిస్తాను అనుకోండి. చీకటిలో నా పరుపు పరుచుకొంటాను అనుకోండి.
14 గోరీని చూచి ‘నీవే నా తండ్రివి’ అనీ, పురుగులతో ‘నీవే నా తల్లివి. నా సోదరివి’ అనీ అంటాననుకోండి.
15 అలాంటప్పుడు నా ఆశాభావం ఏమైనట్టు? దానిని ఎవరు చూడగలరు?
16 అది నాతోపాటు మృత్యులోకం కటకటాల దగ్గరికి దిగిపోతుందా? అది నాతో కూడా మట్టిపాలవుతుందా?