16
1 ✽అందుకు యోబు ఇలా అన్నాడు: 2 “ఇలాంటి మాటలు బోలెడన్ని ఇంతకుముందు విన్నాను. మీరు ఓదార్చేవారు కాదు. బాధ పెట్టేవారే.3 ఈ గాలిమాటలు ఎప్పుడూ అయిపోవా? నీవిలా జవాబిచ్చేందుకు నీకేం పట్టింది?
4 నా గతే మీకు పట్టివుంటే, నేనూ మీలాగా మాట్లాడ గలిగేవాణ్ణి. మీ మీద మాటలు కల్పిస్తూ, తల పంకిస్తూ, మీ వైపు చూడగలిగివుండేవాణ్ణి.
5 కానీ మీరు నా స్థితిలో ఉంటే మిమ్మల్ని ధైర్యపరచివుండే వాణ్ణి. నా పెదవులనుంచి వచ్చే ఆదరణ వాక్కులు ఓదార్చివుండేవి. 6 పోనీ, ఇప్పుడు నేనెంత మాట్లాడినా, నా శోకం ఏమీ తక్కువ కాదు. మాట్లాడకపోయినా కూడా బాధ నివారణ కాదు.
7 ✝దేవుడు నాకు ఆయాసం కలిగించాడు. దేవా, నా కుటుంబాన్ని నీవు లయం చేశావు.
8 నాకు ఒళ్ళంతా ముడతలు పట్టేలా చేశావు. బక్క చిక్కిన బడుగు దేహం నాకే ఎదురు తిరిగి నా ముఖాన్నే నా మీద వ్యతిరేక సాక్ష్యం ఇస్తుంది.
9 ✝దేవుని ఆగ్రహం నాతో యుద్ధం చేసింది. నన్ను నిలువునా చీల్చివేసింది. పండ్లు కొరుకుతూ ఆయన నా మీద పడ్డాడు. నాకు పగవాడై తన కళ్ళు ఎర్ర చేసి నా వైపు చూస్తూ ఉన్నాడు.
10 ✽మనుషులు నన్ను ఎత్తి పొడవడానికి నోరు తెరచారు. వాళ్ళ తిట్లు నాకు చెంప దెబ్బలలాంటివి. వాళ్ళు ఒకటై, నాకు వ్యతిరేకంగా సమకూడారు.
11 ✽దేవుడు నన్ను అన్యాయస్థులకు అప్పగించాడు. దుర్మార్గుల చేతిలో నన్ను పడద్రోశాడు.
12 నాకు హాయిగానే ఉండేది. అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేశాడు. నా మెడ పట్టుకొని, నన్ను అల్లాడించాడు. నన్ను తుత్తునియలుగా చేశాడు. ఆయన నన్ను గురిగా పెట్టుకొన్నాడు.
13 ✝నలు దిక్కులనుంచి తన బాణాలు వేస్తున్నాడు. ఆయన నా తుంట్లను పొడుస్తున్నాడు. జాలి చూపడమే లేదు. నాలో ఉన్న పైత్యాన్ని నేల మీద కక్కించాడు.
14 దెబ్బ మీద దెబ్బ కొట్టి నన్ను విరుస్తున్నాడు. యుద్ధవీరుడులాగా పరుగెత్తి వచ్చి, నా మీద పడ్డాడు.
15 ✽నా చర్మానికి గోనెపట్ట వేసి కుట్టుకొన్నాను. నా నెత్తిమీద ధూళి పోసుకొన్నాను.
16 ✽నేను ఎవరికీ హాని చెయ్యలేదు. నా ప్రార్థన శుద్ధం.
17 అయినా ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడివుంది. నా కంటిరెప్పల మీద చావునీడలు పడుతున్నాయి.
18 ✽భూమీ! నా రక్తాన్ని నీవు కప్పిపుచ్చకు! నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి!
19 ✽ఇప్పటికీ నా సాక్షి పరలోకంలో ఉన్నాడు, నాపక్షాన వాదించేవాడు ఆకాశంలో ఉన్నాడు.
20 నా స్నేహితులు నన్ను ఎగతాళి పట్టిస్తున్నారు. నా కళ్ళ నుంచి, దేవుని ఎదుట, కన్నీళ్ళు ధారగా కారుతున్నాయి.
21 మనిషి కోసం ఒక వ్యక్తి దేవునితో వాదించాలనీ, మనిషికోసం తన స్నేహితులతో వాదించాలనీ నా అభిలాష.
22 ✝ఇంకా కొద్ది సంవత్సరాలు గడిచాక, తిరిగి రాలేని దారిన నేను వెళ్ళిపోతాను.