15
1 అప్పుడు తేమానువాడు ఎలీఫజు ఇలా బదులు చెప్పాడు: 2 “తెలివైనవాడు గాలిమాటలు పలుకుతాడా? తన హృదయంనిండా వడగాడ్పు ఉంచుకొని మాట్లాడతాడా?
3 వ్యర్థ పదాలు ప్రయోగించి వాదిస్తాడా? ఏమీ ప్రయోజనం లేని ప్రసంగాలు చేస్తాడా?
4 నీవు అలా చేయడం మాత్రమే గాక, భయభక్తుల భావాన్ని కొట్టివేస్తున్నావు. దైవ ధ్యానాన్ని ఆటంక పరుస్తున్నావు.
5 నీ నోరు ఏం అనాలో నీ అపరాధం నేర్పుతూవుంది. కపటంగా మాట్లాడటానికి తీర్మానించుకున్నావు.
6 నేను కాదు, నీ నోరే నీవు దోషివని ప్రకటిస్తుంది. నీకు వ్యతిరేకంగా నీ పెదవులే సాక్ష్యం పలుకుతున్నాయి.
7 మనిషిగా పుట్టిన మొదటివాడివి నువ్వేనా? కొండలకంటే ముందే నీవు జన్మించావా?
8 నువ్వు దేవుని సమాలోచనలో పాల్గొన్నావా? జ్ఞానమంతా నీ సొత్తేనా?
9 మాకు తెలియనిది నీకు తెలిసినది ఏమిటి? మాకు అర్థం కానిది నీకు అర్థమైనదేమిటి?
10 మా మధ్య తల నెరసిన వయోవృద్ధులున్నారు. నీ తండ్రికంటే వారు వయసులో పెద్ద.
11 దేవుని ఓదార్పు నీకు తేలిక అనిపిస్తుందా? ఆయన నీతో పలికిన మృదువైన భాషలు నీకు పట్టవు గదూ?
12 నీ హృదయం నిన్ను ఎందుకిలా ఉద్రేకపరుస్తూవుంది? నీ కళ్ళు ఎందుకలా ఎర్రబారాయి?
13 దేవుని మీద నీవెందుకలా కోపగించినట్టు? నీ నోటిమీదుగా అలాంటి మాటలు రానిస్తావెందుకు?
14 నిష్కళంకుడై ఉండడానికి మనిషి ఏపాటి వాడు? నిర్దోషి కావడానికి స్త్రీ గర్భవాసాన పుట్టినవాడు ఎంతటివాడు?
15 దేవుడు తన పవిత్ర దూతలను కూడా నమ్మడు. ఆకాశ ప్రదేశాలు ఆయన దృష్టిలో శుద్ధం కావు.
16 అలాంటప్పుడు మనుషులు మరీ కల్మషం! వాళ్ళు నీచులు, భ్రష్టులు, నీళ్ళు త్రాగినట్టే అన్యాయాన్ని చేసేవారు.
17 నేను చెప్పేది విను. నేను నీకో సంగతి తెలియజేస్తాను. నేను స్వయంగా చూచినదే చెపుతాను.
18 జ్ఞానులు తమ పూర్వీకుల దగ్గరనుంచి సంపాదించి, ఏమీ దాచుకోకుండా చెప్పిన ఉపదేశం నీకు చెపుతాను.
19 వాళ్ళకు మాత్రమే ఈ భూమి ధారాదత్తం చేయబడింది. అప్పుడు వాళ్ళ మధ్య పరాయి వాళ్ళు లేరు.
20 దుర్మార్గుడు బ్రతికినన్నాళ్ళు వేదనల పాలవుతాడు. దౌర్జన్యపరుడికి నియమించబడ్డ ఏళ్ళన్నిట్లో అతడికి బాధలు తప్పవు.
21 అతడి చెవులలో భయంకరమైన ధ్వనులు మ్రోగుతాయి. శాంతియుతమైన కాలంలో వినాశకారులు అతడిమీదికి వచ్చి పడతారు.
22 చీకట్లోనుంచి తిరిగి వస్తాడనే నమ్మకం వాడికి ఉండదు. అతడు ఖడ్గానికి గురి అవుతాడు.
23 ‘ఆహారం ఎక్కడ దొరుకుతుందబ్బా!’ అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. చీకటి రోజు దగ్గరపడ్డట్టు వాడికి తెలుసు.
24 కడగండ్లు, వేదన వాణ్ణి భయకంపితుణ్ణి చేస్తాయి. యుద్ధసన్నద్ధుడైన రాజులుగా వచ్చి పట్టుకుంటాయి.
25 ఎందుకని? అతడు దేవునికి విరోధంగా చెయ్యి చాపుతున్నాడు. అమిత శక్తిగలవాణ్ణి ధిక్కరిస్తాడు.
26 మెడ వంగని వైఖరితో, తన దిట్టమైన డాలుతో దేవుని మీదికి విజృంభిస్తాడు.
27 అతడి ముఖం బాగా కొవ్వు దేలివుంది. అతడి నడుము చుట్టూరా కొవ్వు ఎక్కువైంది.
28 అయినా, అతడు పాడుపడ్డ పట్టణాల్లో నివాసం ఉంటాడు. ఉండకూడని ఇండ్లలో ఉంటాడు. శిథిలమైపోతున్న కొంపల్లో ఉంటాడు.
29 వాడు భాగ్యవంతుడుగా ఎంతోకాలం ఉండబోడు. వాడి ధనం నిలవదు. అతడి భూమి పంటతో బరువెక్కి నేలకు వంగదు.
30 అతడు చీకటిని తప్పించుకుపోలేడు. మంటలు వాడి లేత మొక్కల్ని దహించివేస్తాయి. దేవుని ఊపిరికి వాడు కొట్టుకుపోతాడు.
31 వాడు వ్యర్థమైన దానిని నమ్ముకోకుండా ఉంటాడు గాక! వాడు మోసపోయినవాడు. వ్యర్థం అనేదే అతడి ప్రతిఫలం.
32 వాడి కాలం పూర్తి కాకమునుపే అదంతా జరుగుతుంది. వాడి కొమ్మ వాడిపోతుంది.
33 వాడు పిందెలు రాలిన ద్రాక్ష చెట్టులాగా ఉంటాడు. పూత రాలిన ఆలీవ్ చెట్టులాగా ఉంటాడు.
34 దైవభక్తి లేని వాళ్ళ గుంపు నిర్జీవమవుతుంది. లంచగొండి డేరాలను అగ్ని భస్మీపటలం చేస్తుంది.
35 కీడు వాళ్ళ కడుపులో ఉంటుంది. చెడుగును వాళ్ళు కంటారు. వాళ్ళ అంతరంగంలో వంచన ఏర్పడుతుంది.