14
1 ✽“స్త్రీ గర్భవాసాన పుట్టిన మనిషి ఆయుష్షు స్వల్పం. అతడికి ఎప్పుడూ కడగండ్లే.2 పువ్వులాగా వికసిస్తాడు, త్వరలో వాడిపోతాడు. పారిపోయే నీడలాగా గతించిపోతాడు.
3 దేవా, ఇలాంటివాడి మీద చూపు నిలుపుతావా? తీర్పు తీర్చడానికి నన్ను నీ ఎదుటికి రప్పిస్తావా?
4 ✽అశుద్ధమైన దానిలో నుంచి శుద్ధమైనదానిని పుట్టించ గలవాడెవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు.
5 ✽మనిషి బ్రతకవలసిన రోజులు ఎన్నో నీవు నియమించావు. అతడు ఎన్ని నెలలు బ్రతుకుతాడో నీకు తెలుసు. అతడి ఆయువుకు సరిహద్దు నిర్ణయించావు. దానిని అతడు దాటలేడు.
6 గనుక అతడి వైపు నుంచి నీ దృష్టి తిప్పుకో, జీతగాడిలాగా ఆ కాలమంతా అతడు పూర్తి చేసేవరకు వాణ్ణి వదలిపెట్టు.
7 ✽చెట్టు విషయం ఆశాభావం ఉంది. దాన్ని నరికివేస్తే మళ్ళీ చిగురిస్తుంది. అది తప్పక పిలకలు వేస్తుంది.
8 దాని వేళ్ళు భూమిలో పాతగిలిపోతే, దాని మ్రాను మట్టిలో కూరుకుపోయి చస్తే, 9 నీటి వాసన తగిలిందంటే చాలు – అది చిగురిస్తుంది. లేత మొక్కలాగా అది కొమ్మలు తొడుగుతుంది.
10 అయితే మనిషి చస్తాడు. చాచుకొని అలాగే పడివుంటాడు. మనిషి ప్రాణం విడిచాక, అతడు ఎక్కడున్నట్టు?
11 సముద్రంనుంచి నీళ్ళు ఆవిరి అయిపోతాయి. వాగుల్లో నీళ్ళు తగ్గిపోయి, ఇంకిపోతాయి.
12 అలాగే మనుషులు చనిపోయి తిరిగి లేవరు. ఆకాశం లేకుండా పోయేవరకు మేలుకోరు. ఎవరూ వారిని నిద్ర లేపరు.
13 ✽నీవు నన్ను మృత్యులోకంలో దాచి వేస్తే ఎంత బావుండేది! నీ కోపాగ్ని చల్లారేవరకు నన్ను మరుగు చేస్తే ఎంతో బావుండేది గదా! నీవు నాకు ఓ గడువు పెట్టి, ఆ తరువాతే నన్ను తలచుకొంటే బావుండేది.
14 మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? అలాగైతే నా పోరాటం జరిగే రోజులన్నీ ఆ మార్పు నాకు కలిగేవరకు నేను ఆశాభావంతో ఎదురు చూడగలిగి ఉంటాను.
15 అప్పుడు నీవు పిలుస్తావు. నేను మారు పలుకుతాను. నీవు చేతులతో చేసిన పనిపట్ల నీకు ఆసక్తి ఉంటుంది.
16 ✽ఇప్పుడు నా అడుగులను నీవు లెక్క వేస్తున్నావు. నీవు నా పాపాలు బాగా గమనించడం లేదా?
17 నా అతిక్రమాలు సంచిలో పెట్టి మూసివేశావు. నా అపరాధాలు భధ్రంగా ఉంచావు.
18 పడిపోయిన పర్వతం కూడా అలాగే ముక్క చెక్కలై పోతుంది. కొండ శిల తన చోటునుంచి పడిపోతుంది.
19 నీళ్ళు రాళ్ళను అరగదీస్తాయి. ప్రవాహాలు పొర్లి పారి, భూమిపై మట్టి కొట్టుకుపోతుంది. ఆవిధంగానే నీవు మనిషి ఆశాభావాన్ని భగ్నం చేస్తావు.
20 నీవు మనుషులను ఎప్పటికీ అణచివేస్తావు. కనుక వారు అంతరించిపోతారు. నీవు వారికి వికార ముఖం కలిగించి వారిని పారదోలుతావు.
21 వారి పిల్లలు ఘనత వహించినా ఆ సంగతి వారికి తెలియదు. దీనస్థితి అనుభవించినా వారికది తెలియదు.
22 తమ సొంత శరీరంలో ఉన్న బాధ మాత్రమే అనుభవిస్తారు. తమ విషయమే శోకిస్తారు.