13
1 ✽“ఇదిగో వినండి. ఇదంతా నా కంటికి కనబడింది. నా చెవి దాన్ని విన్నది. గుర్తించింది కూడా.2 మీకు తెలిసినది నాకూ తెలుసు. నేను మీకేమీ తీసిపోను.
3 అయినా, నేను అమిత శక్తిగలవానితోనే మాట్లాడాలని ఉన్నాను. దేవునితోనే తర్కించాలని ఉన్నాను.
4 మీరు అబద్ధాలు కల్పిస్తారు. మీరంతా ఎందుకూ కొరగాని వైద్యులు.
5 మీరు బొత్తిగా మాట్లాడకుండా ఉంటే మంచిది. అది మీ పట్ల జ్ఞానమనిపించుకుంటుంది.
6 ✽ఇప్పుడు నా వివాదం వినండి. నా పెదవుల మీదుగా వెలువడే తర్కం ఆలకించండి.
7 దేవుని పక్షంగా మీరు అన్యాయంగా మాట్లాడుతారా? ఆయన తరఫున వంచన మాటలు పలకవచ్చా?
8 ఆయన పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తారా? దేవుని తరఫున వాదిస్తారా మీరు?
9 ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమమా? మనుషులను మోసగించినట్టు ఆయనను మోసపుచ్చగలరా?
10 మీరు రహస్యంగా పక్షపాతం వహిస్తే, ఆయన మిమ్మల్ని ఖండించితీరుతాడు.
11 అలాంటప్పుడు ఆయన ప్రభావం మీకు బీతి పుట్టించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా?
12 మీరు పలికే లోకోక్తులు బూడిదలాంటి సామెతలు. మీ బలమైన వాదాలు మట్టిగోడల్లాంటివి.
13 ✽ఇక ఊరుకోండి! నన్ను శాంతంగా ఉండిపోనియ్యండి. నేను మాట్లాడుతాను. నా మీదికి ఏది వస్తే అది వస్తుంది.
14 నా శరీరంలో నాకే ఎర ఎందుకు కావాలి? నా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని మాట్లాడుతాను.
15 ఇదిగో వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయనవైపు ఆశాభావంతో ఎదురుచూస్తాను. ఆయన ఎదుటే నా మార్గం సరైనదని రుజువు చేసితీరతాను.
16 దీనివల్ల నాకు విడుదల కలుగుతుంది కూడా. ఎలాగంటే భక్తిలేనివాడు దేవుని ఎదుటికి రావడానికి సాహసించడు.
17 వినండి, నా మాటలు శ్రద్ధతో ఆలకించండి. నేను చెప్పేది మీ చెవుల్లో మారు మ్రోగాలి.
18 చూడండి, నా వ్యాజ్యెం సిద్ధం చేసుకొన్నాను. నేను నిర్దోషినని వెల్లడి అవుతుందని నాకు తెలుసు.
19 నాతో వ్యాజ్యెమాడి గెలవగలవాడెవడు? ఒకవేళ ఎవడైనా ఉంటే నేను మౌనంగా చచ్చి ఊరుకుంటాను.
20 ✽దేవా, నేను రెండు మనవులు మాత్రమే చేస్తున్నాను. వాటిని తిరస్కరించవద్దు. అప్పుడు నీ ముఖం చూడకుండా నేను దాక్కోను.
21 నీ బరువైన చెయ్యి నామీదనుంచి తీసివెయ్యి. నీగురించిన బీతి నన్ను భయపెట్టనియ్యకు.
22 అప్పుడు నన్ను పిలువు. నేను జవాబిస్తాను. పోనీ, నేను పిలుస్తాను, నీవు పలుకు.
23 ✽నా అపరాధాలెన్ని? నా పాపాలెన్ని? నా అతిక్రమం, నా పాపం ఏమిటో నాకు తెలుపు.
24 నీ ముఖం ఎందుకు చాటు చేసుకొన్నావు? నన్ను నీ శత్రువుగా ఎంచుతున్నావెందుకు?
25 అటూ ఇటూ కొట్టుకుపోతున్న ఆకును భయపెట్టేస్తావా? ఎండు చెత్త వెంటబడుతావా?
26 ✽నీవు నాకు కఠిన శిక్ష విధించావు. బాల్యంలో నేను చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేస్తున్నావు.
27 నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడత అంతా నీవు బాగా చూస్తున్నావు. నా అడుగులకు నీవు స్వయంగా గిరి గీచావు.
28 ఇలా మనిషి కుళ్ళిపోతున్నదానిలాగా కృశించిపోతాడు. చిమ్మెటలు కొట్టిన వస్త్రంలాగా ఉంటాడు.