12
1 అప్పుడు యోబు ఈ విధంగా జవాబు చెప్పాడు:2 ✽“మీరే నిజంగా లోకమంతట్లోకీ మనుషులా! జ్ఞానమంతా మీతోనే అంతరించిపోతుందా!
3 మీలాగే నాకూ మనసు ఉంది. నేను మీకేమి తీసిపోను. ఇలాంటి విషయాలు తెలియనివాడెవడు?
4 ✽నేను చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. అలాంటి నేను నా స్నేహితుల దృష్టిలో నవ్వుల పాలయ్యాను. న్యాయంగా, నిర్దోషంగా బ్రతికే నా గతి నగుబాట్లయింది.
5 ✽క్షేమంగా బ్రతికే మనుషులు దుర్దశలో ఉన్నవారిని తృణీకరిస్తారు. కాలు జారి పడినవారికి ఈ తృణీకారం తప్పదు.
6 ✽బందిపోటు దొంగల డేరాలు క్షేమంగానే ఉంటాయి. దేవునికి కోపం రేపేవాళ్ళు నిర్భయంగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు తమ చేతి బలమే దేవుడు.
7 ✽ఇప్పుడు మృగాలను అడగండి. అవి మీకు బోధిస్తాయి. గాలిలో ఎగిరే పక్షులను అడిగితే, అవే చెప్తాయి.
8 భూమి విషయం ఆలోచిస్తే, అదే మీకు నేర్పుతుంది. సముద్రంలోని చేపలు మీకు ఉపదేశం చేస్తాయి.
9 యెహోవా తన చేతితో వీటన్నిటినీ సృజించాడని గ్రహించలేనివాడెవడు?
10 సజీవమైన ప్రతి దాని ప్రాణం ఆయన చేతిలో ఉంది. ప్రతి మనిషి ఊపిరి ఆయన వశంలో ఉంది.
11 నాలుకకు రుచి తెలుసు. అలాగే మాటలు ఎలాంటివో చెవి పరిశీలించి గుర్తిస్తుంది.
12 వృద్ధులకు జ్ఞానం ఉండాలి గదా. దీర్ఘాయువు వల్ల వివేకం కలగాలి గదా.
13 ✽అయితే దేవునికి జ్ఞానమూ, బలప్రభావాలూ ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి.
14 ఇదిగో ఆయన పడగొట్టాడంటే ఎవరూ దాన్ని మళ్ళీ కట్టలేరు. ఆయన మనిషిని ఖైదులో మూసివేస్తే ఎవరూ తెరవలేరు.
15 చూడండి. ఆయన జలాలను ఆపివేస్తే అవి ఇంకిపోవలసిందే. వాటిని కట్టునుంచి విడిచిపెడితే జలప్రవాహం భూమిని ముంచెత్తుతుంది.
16 బలమూ, జ్ఞానమూ ఆయనవి. మోసగాళ్ళు, మోసపొయ్యేవాళ్ళు ఆయన అధీనంలోనే ఉన్నారు.
17 సలహాదారులను నగ్నంగా చేసి, బందీలుగా వెళ్ళిపోయేలా చేస్తాడు. న్యాయాధిపతులు తెలివి తక్కువవారని రుజువు చేస్తాడాయన.
18 రాజుల అధికారాన్ని ఆయన సడలిస్తాడు. వారి నడుములను సంకెళ్లతో బంధిస్తాడు.
19 యాజులను నగ్నంగా చేసి, బందీలుగా వెళ్ళిపోయేలా చేస్తాడు. స్థిరంగా పాతుకుపోయిన వాళ్ళను ఆయన కూలదోస్తాడు.
20 వాగ్ధాటి గల వాళ్ళను నోరాడకుండా చేస్తాడు. పెద్దల తెలివిని తొలగిస్తాడు.
21 అధిపతులను ఆయన ధిక్కరిస్తాడు. బలాఢ్యుల్ని బలహీనుల్ని చేస్తాడు.
22 చీకట్లోని లోతైన విషయాలను ఆయన వెలికి తీస్తాడు. చావు నీడను వెలుగులోకి తెస్తాడు.
23 జనాలను గొప్ప చేస్తాడు, ధ్వంసం కూడా చేస్తాడు. వారి పొలిమేరలను విశాలం చేస్తాడు. వారిని తీసుకుపోతాడు కూడా.
24 లోక ప్రజల నాయకుల వివేకాన్ని తొలగించివేస్తాడు. దారి కానరాని ఎడారిలో వాళ్ళు తిరుగులాడేలా చేస్తాడు.
25 వాళ్ళు వెలుగు లేనివారై చీకట్లో తడుముకొంటూ ఉంటారు. వాళ్ళు మత్తుగా ఉన్న వాళ్ళలాగా తూలేట్టు చేస్తాడాయన.