11
1 ✽అప్పుడు నయమాతువాడైన జోఫరు ఈ విధంగా మాట్లాడాడు:2 “ఈ విస్తారమైన మాటలకు జవాబు చెప్పకపోతే ఎలా? వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా?
3 నీవు నీ వృథా ప్రలాపాలతో మనుషుల నోళ్ళు మూయగలవా? నీవు ఇలా ఎగతాళి చేస్తే నిన్ను ఎవరూ మందలించకూడదా?
4 ✽నీవు దేవునితో అంటున్నావు గదా, ‘నా సిద్ధాంతంలో ఏ తప్పూ లేదు. నీ దృష్టిలో నేను పవిత్రుణ్ణి’ అని.
5 ✽దేవుడే నీతో మాట్లాడితే ఎంత బావుండేది!
6 ✽ఆయనే జ్ఞాన రహస్యాలు నీకు తెలియజేయవలసిందే! అప్పుడు జ్ఞానం నీ ఆలోచనకంటే ఎంతో ఎక్కువనీ, నీ దోషాలలో కొన్నిటిని దేవుడు తలచుకోవడం లేదనీ గ్రహించి ఉండేవాడివి.
7 ✽దేవుని రహస్య సత్యాలను పరిశీలించి తెలుసుకోగలవా? అమిత శక్తిగలవాని పరిపూర్ణతను పరిశోధించి అర్థం చేసుకోగలవా?
8 అది ఆకాశాలంత ఎత్తయినది. ఏం చేయగలవు? మృత్యులోకం కంటే లోతు. నీవేం తెలుసుకోగలవు?
9 దాని కొలత భూమి పొడవుకంటే ఎక్కువ, సముద్రం కంటే విశాలం.
10 ఆయన పక్కగా వెళ్ళిపోతూ ఎవరినైనా బంధిస్తాడనుకో, ఆయన తీర్పు విచారణ జరిగిస్తాడనుకో – ఆయనకు ఎదురు చెప్పగలవాడెవడు?
11 ✽పనికిమాలిన వాళ్ళెవరో ఆయనకు తెలుసు. చెడుగును తేరి చూడకుండానే ఆయన పసిగట్టగలడు.
12 ✽ఒకవేళ అడవి గాడిద పిల్ల మనిషిగా పుట్టగలిగితే తెలివి తక్కువవాడికి తెలివి రావచ్చు!
13 ✽✽నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకో! దేవుని వైపు నీ చేతులు చాపు.
14 నీ చేతిలో చెడుగు ఉంటే, దాన్ని దూరంగా పారెయ్యి! నీ నివాసంలో అన్యాయాన్ని ఉండనియ్యకు!
15 ఈ విధంగా చేస్తే, తప్పకుండా నిష్కళంకుడివై నిర్భయంగా స్థిరంగా ఉండగలుగుతావు.
16 తప్పకుండా నీ దుర్దశ నీవు మరిచిపోగలుగుతావు. దాటిపోయిన పారు నీళ్ళను జ్ఞాపకం చేసుకొన్నట్లు మాత్రమే నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు.
17 అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం ఎండకంటే ప్రకాశమానమవుతుంది. చీకటి కమ్మినా అది ఉదయంలాగే కనిపిస్తుంది.
18 నీకప్పుడు ఆశాభావం కలిగి, ధైర్యం పుంజుకుంటావు. నీ ఇంట్లో కలయ చూచి సురక్షితంగా విశ్రమిస్తావు.
19 నీవు పడుకునేటప్పుడు ఎవరి భయం నీకుండదు. అనేకులు నీ చెక్కిళ్ళ నిమురుతారు.
20 ✽దుర్మార్గుల కనుచూపు మందగిస్తుంది. ఆశ్రయమంటూ వాళ్ళకు లేకపోతుంది. వాళ్ళ ఆశాభావం పోతున్న ప్రాణంలాంటిది.