10
1 ✽ “నా బ్రతుకంటే నాకే వెగటు ఏర్పడింది. నేను స్వేచ్ఛగా విలపిస్తాను. నా ప్రాణం చేదెక్కిపోయింది. గనుక నేను మాట్లాడుతాను.2 ✽నేను దేవునితోనే చెప్పుకుంటాను – నా మీద నేరం మోపకు. నీకు నాతో ఎందుకీ వివాదం? నాకు చెప్పు.
3 ✽ నీవు ఇలా క్రూరంగా వ్యవహరించడం నీకు ఇష్టమా? నీ చేతిపనినే నీవు త్రోసిపుచ్చడం, దుర్మార్గుల ఆలోచనలను ఆమోదించడం నీకేమైనా బావుందా?
4 ✽నీ కండ్లు మనుషులకున్న మామూలు కండ్లా? మనుషుల్లాగే నీవూ ఆలోచిస్తావా?
5 నీ రోజులు మనిషి రోజులలాంటివా? నీ సంవత్సరాలు మనుషుల జీవిత కాలంలాంటివా?
6 నా అపరాధంకోసం గాలిస్తున్నావెందుకు? నా తప్పిదాన్ని ఎందుకిలా పరిశీలిస్తావు?
7 నేను దుర్మార్గుణ్ణి కానని నీకు తెలుసు గదా? నీ చేతిలోనుంచి నన్ను విడిపించగలవాడెవడూ లేడని కూడా నీకు తెలుసు.
8 ✝నీవు నీ సొంత చేతులతోనే నా అవయవాలను నిర్మించావు. నాకు సమగ్ర స్వరూప కల్పన చేశావు. ఇప్పుడు నీవు నన్ను మ్రింగివేస్తున్నావు.
9 నేను బంకమన్నులాంటివాణ్ణి. నన్ను నీవు ఇలా సృజించావని తలచుకో! ఇప్పుడు మళ్ళీ నన్ను మట్టిపాలు చేస్తావా?
10 పాలు పోసినట్లు నన్ను పోశావు గదా! నన్ను తోడుబెట్టి పెరుగు చేశావు గదా.
11 నన్ను మాంసంతో, చర్మంతో కప్పివేశావు. నన్ను ఎముకలతో, నరాలతో రూపొందించావు.
12 ✽నాకు జీవప్రధానం చేశావు. నామీద అనుగ్రహం చూపావు. సంరక్షణ వహించి నా ఊపిరిని కాపాడావు.
13 అయినా నీ హృదయంలో ఈ రహస్య ఉద్దేశం ఉంది – నీ మనసులో ఉండేది నాకు తెలుసు –
14 నేను దోషం చేస్తే, నీవు దాన్ని పసికట్టాలని ఉన్నావు. నా అపరాధానికి నన్ను శిక్షించాలని ఉన్నావు. నేను నిర్దోషినని తీర్పు చెప్పవు.
15 నేను దుర్మార్గుణ్ణి అయితే నాకు బాధ తప్పదు. నేను న్యాయవంతుణ్ణయితే కూడా నా తల ఎత్తుకోలేను. అవమానం నా మీదికి ముంచుకువచ్చింది. నా దుర్దశ నాకు బాగా తెలుసు.
16 ఒకవేళ నేను తల ఎత్తుకు తిరిగినా, సింహంలాగా నా వెంటపడి తరుముతావు. నీ మహా బలాన్ని నా మీద మళ్ళీ ప్రయోగిస్తావు.
17 ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా కొత్త సాక్ష్యాలు పలికిస్తావు. ఎప్పుడూ నా మీద నీ ఆగ్రహం హెచ్చిస్తూ ఉంటావు. నా మీదికి సేన వెంబడి సేన వచ్చినట్టుంది.
18 ✝మాతృ గర్భంలోనుంచి నన్నెందుకు బయటికి రప్పించావు? అప్పుడే, ఎవరి కన్నూ నా మీద పడకుండానే నేను చచ్చి ఉండవలసింది.
19 అలాగైతే నాకు ఉనికి అనేదే లేకుండా పొయ్యేది. తల్లి గర్భంలో నుంచి తిన్నగా సమాధికి పోయివుండేవాణ్ణి.
20 ✝నేను బ్రతికే రోజులు కొద్ది – నేను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను.
21 ✽అది చీకటి లోకం. ఆ లోకమంతా చావునీడలే!
22 అక్కడ దట్టమైన చీకటి, నడిరేయిలాంటి అంధకారం, చావునీడలు, క్రమభంగం. అక్కడ వెలుగే చీకటిగా ఉంది. నేను అక్కడికి వెళ్ళేముందు కాసేపు సంతోషం కలిగేలా నన్ను విడిచి పెట్టు. నా జోలికి రాకు.