9
1 అప్పుడు యోబు ఈవిధంగా జవాబిచ్చాడు:
2 “నీవన్నది నిజమే అని నాకు తెలుసు – దేవుని దృష్టిలో మనిషి ఎలా న్యాయవంతుడు కాగలడు?
3 మనిషి ఆయనతో వివాదం పెట్టుకోవాలంటే దేవుడు వేసే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అతడు జవాబు చెప్పలేడు.
4 దేవునిది వివేక హృదయం. ఆయన మహా బలాఢ్యుడు. ఆయనను ధిక్కరించి దెబ్బ తిననివాడెవ్వడు?
5 పర్వతాలను వాటికి తెలియకుండానే తొలగించి వేస్తాడాయన. కోపంతో వాటిని బోర్ల తోస్తాడాయన.
6 భూమిని కూడా దాని స్థానం నుంచి కదిలించివేస్తాడు. దాని స్తంభాలను ఊపివేస్తాడు.
7 ఆయన ఆజ్ఞ జారీ చేశాడంటే పొద్దు పొడవదు. ఆయన నక్షత్రాలను కనబడకుండా చేస్తాడు.
8 ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలంగా పరచేవాడు, సముద్రం అలలను అణగదొక్కేవాడు.
9 స్వాతి, మృగశీర్షం, కృత్తిక నక్షత్రాలను ఆయనే సృజించాడు. దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే చేశాడు.
10 ఎవరికీ గోచరం కాని విషయాలను ఆయన చేస్తున్నాడు. లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తున్నాడాయన.
11 అడుగో, ఆయన నా ప్రక్కగానే నడుస్తూ ఉంటే నేనాయనను చూడలేకపోతున్నాను. నా దగ్గరగానే ఆయన పోతూవుంటే నేను గమనించలేకపోతున్నాను.
12 ఆయన తీసుకుపోతూవుంటే ఆయనను వెనక్కు ఎవరు తీసుకురాగలరు? ‘నీవు చేస్తున్నదేమిటి?’ అని ఎవరు ఆయనను అడగగలరు?
13 దేవుని కోపం ఒక పట్టాన ఉపశమించదు. రాహాబుకు సహాయం చేసినవాళ్ళు ఆయనకు లొంగిపోయారు.
14 ఇలాంటి దేవునితో వాదించడానికి నేను ఎంతటివాణ్ణి? ఆయనతో మాట్లాడడానికి సరైన మాటలు ఎన్నుకోగలిగినంత వాణ్ణా నేను?
15 నేను న్యాయవంతుణ్ణి అనుకోండి, అయినా ఆయనకు జవాబు చెప్పలేను. తీర్పులో కరుణ చూపమని ఆయనను వేడుకోవలసివస్తుంది.
16 నేను ఆయనను పిలిస్తే, ఒకవేళ ఆయన జవాబిచ్చినా ఆయన నా మాటలు వింటాడని నాకు నమ్మకం లేదు.
17 ఆయన నన్ను తుఫాను చేత నలగ్గొట్టేవాడు. నిష్కారణంగా నా గాయాలను ఎక్కువ చేసేవాడు.
18 ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదైన పదార్థాలు నాకు బాగా తినిపిస్తాడు.
19 బలవంతుల శక్తిని గురించి ప్రశ్న ఉత్పన్నమైతే ‘నేనే ఉన్నాను’ అంటాడాయన. న్యాయాన్ని గురించి ప్రశ్నిస్తే ‘న్యాయ స్థానానికి నన్ను ఎవరు పిలుస్తారు?’ అంటాడు.
20 నేను నేరస్తుణ్ణి కాకపోయినా నా మాటలే నా మీద నేరారోపణ చేయవచ్చు. నేను నిర్దోషినైనా వక్రబుద్ధిగలవాణ్ణి అని నా గురించి నా నోరు ప్రకటిస్తుంది.
21 నేను నిర్దోషినే, అయినా నా మీద నాకే లక్ష్యం లేదు. నా బ్రతుకంటే నాకు లెక్కేలేదు.
22 అంతా ఒక్కటే. అందుకే ‘నిర్దోషులను గానీ దుర్మార్గులను గానీ దేవుడు నాశనం చేస్తాడ’ని నేనంటున్నాను.
23 అకస్మాత్తుగా నాశనం సంభవిస్తే దేవుడు నిరపరాధుల దురవస్థను చూచి నవ్వుతాడు.
24 భూలోకం దుర్మార్గుల వశంలో ఉంది. న్యాయాధిపతుల కండ్లకు గంతకట్టాడాయన. ఆయన కాకపోతే, ఇంకెవరు చేశారు?
25 పరుగెత్తేవాడికంటే వేగంగా నా రోజులు గతిస్తున్నాయి, మంచి అంటూ ఏమీ లేకుండా అవి త్వరగా దొర్లిపోతున్నాయి.
26 రెల్లుతో నిర్మించబడ్డ పడవలాగా, గరుడ పక్షి ఎరను చూచి, గభాలున దానిపై వాలినట్లు నా రోజులు దాటిపోతున్నాయి.
27 నా మూలుగును మరచిపోతాననీ, ముఖం తీరును మార్చుకొని సంతోషంగా ఉంటాననీ నేనసలు అనుకొంటే గదా!
28 నా బాధలన్నిటికీ నేను భయపడుతున్నాను. నేను నిరపరాధినని నీవు చెప్పబోవడం లేదని నాకు తెలుసు.
29 నేనే దుర్మార్గుణ్ణి అని నిర్ణయం అయింది గదా! అయితే ఎందుకు నాకీ వృథా ప్రయాస?
30 నేను మంచునీళ్ళతో కడుగుకొన్నా గానీ, సబ్బుతో చేతులు తోముకొన్నా గానీ 31 నీవు నన్ను గుంటలో ముంచుతావు. అప్పుడు నా సొంత బట్టలే నన్ను చూచి అసహ్యించుకుంటాయి!
32 ఆయనకు జవాబివ్వడానికి దేవుడు నాలాగా మనిషి కాడు. మేమిద్దరం కలిసి, న్యాయస్థానానికి వెళ్ళలేము.
33 మా ఇద్దరి మీద చెయ్యి ఉంచగలిగిన మధ్యవర్తి మాకు లేడు.
34 ఆయన తన శిక్షాదండం నా మీదనుంచి తొలగించాలి. ఆయన భయంకరమైన చర్యలు నన్ను భయకంపితుణ్ణి చేయకుండా చూడాలి.
35 అప్పుడు నేను నిర్భయంగా ఆయనతో మాట్లాడుతాను. కాని ఇప్పుడు నేనలా మాట్లాడలేను.