8
1 ✽అప్పుడు షూహియావాడైన బిల్దదు ఇలా అన్నాడు:2 “ఎంతసేపు నీవిలా మాట్లాడుతావు? నీ నోటి మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.
3 ✽దేవుడు న్యాయాన్ని తారుమారు చేస్తాడా? అమిత శక్తిగల వాడు ధర్మాన్ని పెడదోవ పట్టిస్తాడా?
4 ✽నీ కొడుకులు దేవునికి విరోధంగా దోషం చేసి ఉండవచ్చు. దేవుడు వాళ్ళ తిరుగుబాటుకు తగ్గ శిక్షకు వాళ్ళను అప్పగించాడేమో!
5 ✽ నీవు దేవుని వైపు చూస్తే, దయ చూపమని అమిత శక్తిగల వాణ్ణి ప్రాధేయపడితే, 6 ✽నువ్వు శుద్ధుడివై నిజాయితీ పరుడివైతే ఆయన తప్పకుండా నీ విషయం శ్రద్ధ తీసుకుంటాడు. నీ నిర్దోషత్వానికి తగినట్టుగా ఆయన నిన్ను పూర్వమున్న క్షేమస్థితికి తెస్తాడు.
7 నీ స్థితి ఆరంభంలో కొంచెమైనా అది చివరికి గొప్పదే అవుతుంది.
8 ✽గత తరాల సంగతులు విచారించు. వాళ్ళ పూర్వీకులు పరిశోధించి నేర్చుకొన్న వాటిని తరచిచూడు.
9 మనం నిన్నటి మనుషులం, మనకు ఏమీ తెలియదు. ఈ భూమిమీద మన రోజులు నీడలాంటివి.
10 వాళ్ళు నీకు ఉపదేశం చేయరా? నీతో మాట్లాడరా? వాళ్ళ మాటలు హృదయంలోనుంచి వచ్చినవి కావా?
11 ✽బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్ళు లేకుండా రెల్లు మొలుస్తుందా?
12 అది ఇంకా పెరుగుతూ ఉండగానే, దానిని కోసేముందే, అన్ని మొక్కలకంటే ఇది త్వరగా ఎండిపోతుంది.
13 దేవుణ్ణి విస్మరించే వాళ్ళందరి గతి ఇంతే. భక్తి లేనివాడి ఆశ అడుగంటిపోతుంది.
14 అతడికి ఆశాభంగం కలుగుతుంది. అతడు దేనిమీద నమ్మకం ఉంచాడో అది సాలెగూడులాంటిది.
15 సాలెపురుగు తన ఇంటిమీద ఆధారపడుతుంది గాని, దానిని గట్టిగా పట్టుకొన్నా అది నిలవదు.
16 భక్తిలేనివాడు ఎండకు పచ్చగా ఉన్న మొక్కలాంటివాడు. దాని తీగెలు తోటమీదుగా అల్లుకుంటాయి.
17 దాని వేరులు గుట్టచుట్టూ ఆవరిస్తాయి. అది రాళ్ళ మధ్య ఉనికి పట్టుకోసం చూస్తుంది.
18 దేవుడు దాని స్థలంనుంచి దాన్ని తొలగిస్తే ఆ స్థలమే దానితో ‘నిన్నెరగను పో! నిన్ను ఎన్నడూ చూడలేదు!’ అంటుంది.
19 దాని ఆనందమయమైన స్థితికి అదే అంతం. అది ఉన్న మట్టిలో నుంచి వేరే మొక్కలు పుట్టుకు వస్తాయి.
20 ✽ఇదిగో విను. దేవుడు నిర్దోషిని విసర్జించడు. దుర్మార్గులను చేయి పట్టుకొని పైకి ఎత్తడు.
21 ✽నువ్వు నోటినిండా నవ్వేలా చేస్తాడాయన. నీ పెదవులనిండా ఆనంద ధ్వనులు ఉండేలా చేస్తాడు.
22 నీ పగవాళ్ళను అవమానం ఆవరిస్తుంది. దుర్మార్గుల డేరా ఇక నిలవదు.