7
1 ✽“భూమి మీద మనిషి జీవితం యుద్ధంలాంటిది గదా?మనిషి బతికినన్నాళ్ళూ కూలికి వచ్చినవాడిలా ఉన్నాడు గదా?
2 దాస్యంలో ఉన్నవాడు నిలవడానికి నీడకోసం తహతహలాడుతాడు. కూలి మనిషి జీతంకోసం పడిగాపులు పడుతాడు.
3 అదేవిధంగా నేనూ నెలలు తరబడి ఆశాభంగం చెందవలసి వచ్చింది. రాత్రులకు రాత్రులే నేను ఆయాసంతో పడివుండాలని నియామకమైంది.
4 నేను పడుకున్నప్పుడెల్లా ‘నేనెప్పుడు లేస్తాను? రాత్రి ఎప్పుడు గడిచిపోతుంది?’ అనుకుంటాను. ఉదయందాకా ఆయాసంతో అటూ ఇటూ పొర్లాడుతూ ఉంటాను.
5 నా శరీరం నిండా పురుగులే! నా ఒళ్ళంతా మంటిపెల్లలే! నా చర్మం బాగైనట్టే అయి, మళ్ళీ చీము పోస్తుంది.
6 నేతగాడి నాడెలాగా నా రోజులు త్వరితంగా గడిచిపోతున్నాయి. ఆశాభావం లేకుండా అంతరించి పోతున్నాయి.
7 ✽దేవా! నా జీవం ఊపిరిలాంటిదే అని తలచుకో! నా కంటికి క్షేమం ఇంకెన్నడూ కనిపించదు.
8 నన్ను చూచినవారి కండ్లకు నేను ఇకమీదట కనబడను. నీ కండ్లు నా వైపు చూచినా నేను ఉండను.
9 మేఘాలు అంతరిస్తాయి, అంతర్థానమవుతాయి. అలాగే మృత్యులోకానికి దిగిపోయినవాడు పైకి రాబోడు.
10 అతడు తన స్వగృహానికేమీ తిరిగి రాడు. అతడి స్వస్థలానికే అతడు అపరిచితుడవుతాడు.
11 అంచేత నేనేమీ నోరు మూసుకోను. నా ఆత్మలో వేదన ఉంది. నేను మాట్లాడి తీరుతాను. నా మనసు దుఃఖమయమయింది. నేను విలపిస్తాను.
12 ✽నేనేమైనా సముద్రాన్నా? సముద్రంలోని ఏదో బ్రహ్మాండమైన జీవినా? నీవెందుకు నన్నిలా కాపలా కాస్తున్నావు?
13 ✽నా పడక నాకు ఆధారం చేకూరుస్తుందని, నా పరుపు నా బాధను కొంత నివారణ చేస్తుందని నేననుకొంటే, 14 నా కలలే నన్ను భయపడేలా చేస్తున్నాయి. నీవు స్వప్నాలద్వారా నాకు బీతి కలిగిస్తావు.
15 నా ప్రాణానికి ఊపిరాడక చస్తే బావుండేది అనిపిస్తుంది. ఈ నా అస్తిపంజరాన్ని చూచుకునేకంటే చావునయం.
16 ✝బ్రతుకు అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎల్లకాలం బ్రతకడం నాకిష్టం లేదు. నా జోలికి రావద్దు. నా రోజులు ఆవిరిలాగా ఉన్నాయి.
17 ✽ “మనిషి ఎంతటివాడు? నీవు అతణ్ణి ఎందుకింత గొప్పగా ఎంచుకోవడం? నీ మనసు అతడి మీద ఉంచడం ఎందుకు? 18 ప్రతి ఉదయమూ నీవు అతణ్ణి సందర్శిస్తావెందుకు? క్షణక్షణమూ అతణ్ణి పరీక్షకు గురి చేస్తావెందుకు? 19 ఎంతకాలమని ఇలా ఎడతెగకుండా నావైపే చూస్తూవుంటావు? నా ఉమ్మి నేను మింగేదాకా కూడా నన్ను విడిచిపెట్టవా? 20 ✽మనుషులను కనిపెట్టి చూచేవాడా! ఒకవేళ నేను అపరాధం చేసినా అది నీకేమి చేయగలదు? నీ దృష్టికి నన్నెందుకిలా గురి చేస్తున్నావు? నాకు నేనే భారంగా ఉన్నాను. 21 ✽నా అతిక్రమాలు నీవెందుకు క్షమించవు? నా పాపాలు నీవెందుకు తుడిచివెయ్యవు? నేనిప్పుడు మట్టి పాలవుతాను. నీవు నాకోసం వెదికినా, నేను ఉండను.”