6
1 ✽ఇది యోబు ఇచ్చిన జవాబు: 2 “నా శోకం సరిగా తూగుతుంది. గాక! నా విపత్తంతా త్రాసులో పెట్టడం జరుగుతుంది గాక!3 అవి సముద్రం ఇసుకకంటే బరువు. అందుకనే నేను ఆలోచించకుండా మాట్లాడాను.
4 ✽అమిత శక్తిగలవాని బాణాలు నాలో గుచ్చుకు పొయ్యాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూవుంది. దేవుని భయంకరమైన చర్యలు సైన్యంలాగా నాకు వ్యతిరేకంగా బారులు తీరి నిలిచాయి.
5 ✽అడవి గాడిదకు గడ్డి ఉన్నప్పుడు అరుస్తుందా? ఎద్దుకు మేత దొరికితే, రంకె వేస్తుందా?
6 చప్పటి పదార్థం ఉప్పు లేకుండా ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉందా?
7 అలాంటివాటిని ముట్టుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. అవి తినాలంటే, నాకు అసహ్యం అనిపిస్తుంది.
8 ✽నా కోరిక తీరుతుంది గాక! నా ఆశాభావం దేవుడు నెరవేరుస్తాడు గాక!
9 ఎలాగంటే నన్ను చితగొట్టడం దేవునికి ఇష్టమవుతుంది గాక! దేవుడు చెయ్యి చాపి, నన్ను లేకుండా చేస్తాడు గాక!
10 అలాంటప్పుడు నాకు ఆదరణ ఇంకా ఉంటుంది, నన్ను వదలని వేదనలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే, పవిత్రుడైన దేవుని మాటలు నేను కాదనలేదు.
11 ✽నా బలమెంత? నేనెందుకు ఆశాభావంతో కనిపెట్టుకోవాలి? నా అంతిమ స్థితి ఏపాటిది? నేనెందుకు ఓర్చుకోవాలి?
12 నాకేమైన రాయికున్నంత గట్టితనం ఉందా? నాదేమైన కంచు శరీరమా?
13 నాలో నాకు సహాయం అంటూ ఏమీ లేదు. బలాభివృద్ధి నన్ను పూర్తిగా వదిలిపెట్టిపోయింది.
14 ✽అమిత శక్తి గల వాని పట్ల భయభక్తులు విడిచిపెట్టినా సరే, నిరాశ చెందినవాడి మీద స్నేహితుడు దయ చూపాలి గదా?
15 నా సోదరులు వానకాలంలో మాత్రమే పారే వాగులాగా, కనబడకుండా పొయ్యే ప్రవాహంలాగా నమ్మరాని వారయ్యారు.
16 అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, హిమంతో నల్లబడి పారుతాయి.
17 ఎండాకాలంలో అవి కనబడవు. వేడిమి కలగగానే అవి తమ చోటునుంచి పూర్తిగా ఆర్చుకుపోతాయి.
18 అవి అటూ ఇటూ తిరుగుతాయి. తరువాత ఏమీ లేకుండా నీళ్ళు ఇంకిపోతాయి.
19 తేమానుంచి ప్రయాణమైన వర్తకులు ఆ ప్రవాహాలకోసం వెదకుతారు. షేబ బాటసారులు వాటి మీద ఆశ పెట్టుకొంటారు.
20 వారికి నమ్మకం ఉన్నా ఆశాభంగం కలుగుతుంది. ఆ చోటికి వచ్చి సిగ్గుపడుతారు.
21 మీరు ఆ ప్రవాహాలలాగే అయ్యారు. నా భయంకరమైన స్థితిని చూచి మీరు హడలిపోతున్నారు.
22 ✽నాకేమైనా తెచ్చి ఇవ్వండని అడిగానా? మీ కలిమిలోనుంచి నాకేదైనా ఇచ్చిపోండని ప్రాధేయపడ్డానా?
23 శత్రువు బారినుంచి నన్ను తప్పించండి అని గానీ, నన్ను బాధపెట్టేవారి చేతిలో నుంచి కాపాడండి అని గానీ అన్నానా?
24 నాకు మీరు ఉపదేశం చేయండి. మౌనం వహిస్తాను. నేనెక్కడ తప్పిపోయానో నాకు చూపండి.
25 ✽యథార్థ వాక్కులు చాలా ప్రభావం గలవి. కాని, మీ వివాదాలు నిష్ ప్రయోజనమైనవి.
26 నా మాటలను బట్టి నన్ను మందలిద్దామనుకున్నారా? నిరుత్సాహంతో క్రుంగిపోయినవాడి మాటలు గాలికే పోతాయి గదా?
27 అనాథ శిశువులను బానిసలుగా కొనేందుకు చీట్లు వేసేవాళ్ళలాగా ఉన్నారు మీరు, మీ స్నేహితుణ్ణి లాభానికి అమ్మజూపేటంతటివాళ్ళు మీరు.
28 ✽ఇప్పుడు నా ముఖంలోకి చూడండి. మీ ముఖాలు చూచి అబద్ధమాడుతానా? చెప్పండి.
29 మళ్ళీ ఆలోచించండి. మీరు చెప్పేదాంట్లో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి. ఇందులో నేను నిర్దోషిని.
30 అన్యాయమనేది నా నాలుకమీద ఉంటుందా? అపనింద విషయాలేవో నా నోరు పసికట్టలేదా?