5
1 “పిలిచి చూడు – ఎవరు మారు పలుకుతారు నీకు? పవిత్ర దేవదూతలలో ఎవరివైపు నీవు తిరుగుతావు?
2 కోపం చేత మూర్ఖులు చస్తారు. అసూయవల్ల తెలివితక్కువ వాళ్ళు నాశనమవుతారు.
3 మూర్ఖుడు వేరుపారివుండడం నేను చూశాను. అయినా వెంటనే ‘అతడి నివాసం శపితమే’ అన్నాను.
4 అతడి పిల్లలకు క్షేమం దూరం అయింది. గుమ్మం దగ్గరే వాళ్ళు చితికిపోయారు. వాళ్ళను రక్షించే వారెవరూ లేరు.
5 ఆకలి ఉన్నవాళ్ళు అతడి పంట కాస్తా తినేస్తారు. ముండ్లలోనుంచి కూడా దాన్ని కాజేస్తారు. నాశనం వాడి ఆస్తికోసం పొంచివుంది.
6 దుమ్ములోనుంచి శ్రమ పుట్టుక రాదు. బాధ భూమిలోనుంచి మొలవదు.
7 నిప్పురవ్వలు పైకెగిరినట్లు మనిషి పుట్టుక బాధలకోసమే.
8 నామట్టుకు నేనైతే దేవునికే చెప్పుకొనేవాణ్ణి. దేవునికే నా వ్యవహారం అప్పగించేవాణ్ణి.
9 దేవుడు చేసే మహా క్రియలు పరిశోధించలేము. ఆయన జరిగించే అద్భుతాలు అసంఖ్యాకాలు.
10 ఆయన భూమిమీద వాన కురిపిస్తాడు. తద్వారా పొలాలకు నీటి పారుదల కలిగిస్తాడు.
11 ఆయన దీనావస్థలో ఉన్నవారికి పైస్థానం ప్రసాదిస్తాడు. శోకించేవాళ్ళను సంక్షేమ స్థితికి పైకి ఎత్తుతాడు.
12 దేవుడు యుక్తిపరుల పన్నాగాలను భంగపరుస్తారు. వాళ్ళ ఆలోచన నెరవేర్చలేకపోతారు.
13 దేవుడు జ్ఞానుల యుక్తిమూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. వంచకుల ఉపాయాలను ఆయన తారుమారు చేస్తాడు.
14 పగలు వాళ్ళకు చీకటి ఎదురవుతుంది. మధ్యాహ్నం పూట రాత్రిలోలాగా తడుముకుంటారు.
15 వాళ్ళ నోరు ఖడ్గంలాంటిది. దాని బారినుంచి దరిద్రులను ఆయన తప్పిస్తాడు. బలాఢ్యుల చేతిలో నుంచి విడిపిస్తాడు.
16 కాబట్టి పేదలకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు పడిపోతుంది.
17 ఇదిగో విను, దేవుడు శిక్షించి సరిదిద్దే మనిషి ధన్యజీవి. కనుక అమితశక్తి గలవాని క్రమశిక్షణను నిర్లక్ష్యం చెయ్యకు.
18 ఆయన గాయం చేస్తే, దానిని బాగు చేస్తాడు కూడా. ఆయన దెబ్బ తీస్తాడు అయితే తన చేతులతోనే ఆ గాయం మాన్పుతాడు.
19 ఆరు కష్టాలు వస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు హాని కలగదు.
20 కరవు కాటకాలలో నిన్ను చావునుంచి తప్పిస్తాడు. యుద్ధంలో కత్తివాత నుంచి కాపాడుతాడు.
21 నోటి దురుసుతనం నుంచి ఆయన నిన్ను దాచేస్తాడు. దౌర్జన్యం వచ్చినా నీకేమీ భయం ఉండదు.
22 పొలంలోని రాళ్ళు కూడా నీతో సఖ్యంగా ఉంటాయి. అడవి మృగాలు నీతో మచ్చికగా ఉంటాయి.
23 కరవు, దౌర్జన్యం ప్రాప్తిస్తే, చిరునవ్వుతో ఉంటావు. అడవి మృగాలకు నువ్వేమీ భయపడవు!
24 నీ డేరాలో శాంతి భద్రతలు ఉన్నాయని తెలుసుకుంటావు. నీ ఇంట్లో సామాన్లు కలయచూస్తే ఏదీ పోయివుండదు.
25 అంతే కాదు. నీ సంతతి సంఖ్య పెరుగుతుంది. నీ సంతానం లెక్కలో భూమిమీద గడ్డిలాగా విస్తరిస్తారు. దీని గురించి నీకు నిశ్చయత ఉంటుంది.
26 పంటకాలంలో ధాన్యం ఇంటికి చేరినట్లు వయస్సు పండిన తరువాత నీవు సమాధికి చేరుతావు.
27 “మేము ఈ విషయాలు తరచి చూచినవి. ఇవి వాస్తవం. నీవు ఇవి విని స్వయంగా తెలుసుకో!”