4
1 ✽తేమానువాడు ఎలీఫజు దానికి ఇలా బదులు చెప్పాడు:2 ✽“ఎవడైనా నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నీకేమైనా అభ్యంతరమా? ఎవడైతేమట్టుకు ఏమీ మాట్లాడకుండా ఎలా ఊరుకుంటాడు?
3 నీవు చాలామందికి బుద్ధి చెప్పినవాడివి. దుర్బలమైన చేతులెన్నో నీ మూలంగా బలపడ్డాయి.
4 ఎవడైనా కాలు జారితే నీ మాటలతో అలాంటి వ్యక్తిని ఆదుకున్నావు. మోకాళ్ళు సడలినవాళ్ళను బలపరచావు.
5 అలాంటి నీకు ఇప్పుడు కష్టం వచ్చింది. నీవు కుంచించుకుపొయ్యావు. అది నిన్ను ముట్టడించినప్పుడు నీవు హడలిపోతున్నావు.
6 నీకు ఉన్న భయభక్తులవల్ల నీకు ధైర్యం కలగదా? నీ నిర్దోష ప్రవర్తనవల్ల ఆశాభావం కలగదా?
7 ✽తలంచుకో! నిరపరాధి ఎవడైనా ఎప్పుడైనా నాశనమయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచిపెట్టుకు పోయారా?
8 ✝నాకు తెలిసినంతవరకు చెడుగును దున్ని, కీడును నాటేవాళ్ళు ఆ పంటనే కోస్తారు!
9 ✝దేవుని శ్వాసవల్ల వాళ్ళు నాశనం అవుతారు. ఆయన ముక్కుపుటాలలో నుంచి వెలువడే ఊపిరిచేత వాళ్ళు అంతరించిపోతారు.
10 ✽సింహ గర్జన, క్రూర సింహం చేసే ధ్వని ఆగిపోతుంది. సింహాల కోరలు విరిగిపోతాయి.
11 సింహం తిండి లేక చచ్చిపోతుంది. సింహం పిల్లలు అటూ ఇటూ చెదరిపోతాయి.
12 ✽నాకో విషయం రహస్యంగా తెలిసింది. ఎవరో నా చెవిలో గుసగుసలు చెప్పినట్టు అది నాకు వినిపించింది.
13 గాఢ నిద్ర పట్టే రాత్రివేళ కలవరపెట్టే కలలలో అది వచ్చింది.
14 నేను భయంతో గజగజలాడిపొయ్యాను. అంచేత నా ఎముకలన్నీ కదలిపోయినట్లయింది.
15 ఏదో ఊపిరి నా ముఖాన్ని సోకింది. నా ఒంటిమీది వెండ్రుకలు గగురు పొడుచుకున్నాయి.
16 ఏదో నా దగ్గర నిలబడింది గాని అది ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఏదో స్వరూపం నా కండ్ల ఎదుటే ఉంది. ఏదో స్వరం మెల్లగా నాకు వినిపించింది.
17 ✽✽ అదేమిటంటే, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి శుద్ధుడు కాగలడా? తమ సృష్టికర్త ఎదుట మనిషి పవిత్రుడు కాగలడా?
18 ఇదిగో విను, ఆయన తన సొంత సేవకులనే నమ్మడం లేదు. తన దూతల్లోనే తప్పులు పట్టుకుంటాడు ఆయన!
19 ✽ అలాంటప్పుడు బంకమట్టి ఇంటిలో ఉన్న వాళ్ళను మట్టిలో పుట్టిన వాళ్ళను నమ్ముతాడా? వాళ్ళు చిమ్మెటకంటే సులభంగా చితికిపొయ్యేవాళ్ళు. వీళ్ళలో మరింకెన్ని తప్పులు ఆయన పట్టుకుంటాడో!
20 ఉదయానికి సాయంకాలానికి మధ్యవాళ్ళు ముక్కలు చెక్కలైపోతారు. ఎవరూ గమనించకుండా వాళ్ళు శాశ్వతంగా నాశనం అవుతారు.
21 వాళ్ళ డేరా తాడు తెగిపోతుంది. బుద్ధి రాకముందే చచ్చి ఊరుకుంటారు.