3 ✝“నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బావుండేది. మగ శిశువు పుట్టాడు అని చెప్పుకున్న రాత్రి అంటూ లేకుండా ఉంటే బాగుండేది. నా తల్లి గర్భాన్ని అది మూసింది కాదు, నా కండ్లకు బాధను మరుగు చెయ్యకపోయింది.
4 గనుక ఆ రోజు చీకటిగా మారాలి! పైగా ఉన్న దేవుడు దానిని తలచుకోకూడదు. దానిమీద వెలుగు ప్రసరించకూడదు.
5 చీకటి, చావునీడ దాన్ని తమలోకి చేర్చుకోవాలి! దానిని మబ్బు ఆవరించాలి! పగటివేళ చీకటి కమ్మినట్లు దానికి భయాందోళన పుట్టించాలి!
6 చీకటే ఆ రాత్రిని పట్టుకోవాలి! సంవత్సరం రోజులలో ఆ రోజు లేకుండా పోవాలి! ఏ నెలలోనూ అది ఒక భాగం కాకూడదు.
7 ఆ రాత్రి ఎవడూ పుట్టకపోతే ఎంత బావుండేది! అప్పుడు ఎవడూ సంతోషధ్వనులు చెయ్యకపోతే ఎంత బావుండేది!
8 రోజులను శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఆ రోజును శపించాలి! లివయాటాన్✽ను రెచ్చగొట్టేవారు దానిని శపిస్తారు గాక!
9 సందెవేళలో ప్రకాశించే నక్షత్రాలను చీకటి కమ్మాలి! ఆ రాత్రివేళ వెలుగుకోసం ఎదురు చూచివుంటే వెలుగు లభ్యం కాకుండా ఉండాలి!
10 ఉదయించే సూర్యకిరణాలు కనబడకుండా ఉండాలి!
11 ✝పుట్టగానే నేనెందుకు చచ్చాను కాను? తల్లి గర్భంనుంచి రాగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?
12 నన్ను మోకాళ్ళమీద ఎందుకు ఉంచారు? నేనెందుకు స్తన్యపానం చేసినట్టు?
13 ✽లేకపోతే నేను ఈ పాటికి పడుకొని, ప్రశాంతంగా ఉండిపొయ్యేవాణ్ణి గదా! కన్నుమూసి ఉండేవాణ్ణి. నాకు విశ్రాంతి లభించివుండేది.
14 శిథిలమైపోయిన భవనాలు మళ్ళీ కట్టించుకునే భూరాజులలాగా మంత్రులలాగా నేనూ చనిపోయి ప్రశాంతంగా ఉండిపొయ్యేవాణ్ణి.
15 బంగారం సంపాదించుకొని, తమ ఇండ్లనిండా వెండి కూడబెట్టుకున్న అధికారుల్లాగా కన్నుమూసి ఉండేవాణ్ణి.
16 భూమిలో పాతిపెట్టబడ్డ పిండంలాగా, వెలుగు చూడని శిశువులాగా నాకిప్పుడు ఈ లోకంలో ఉనికే ఉండేది కాదు.
17 అక్కడ దుర్మార్గులు అల్లరి చేయడం మానుకుంటారు, అలసినవారికి అక్కడ విశ్రాంతి.
18 అక్కడ బందీలు కలిసి విశ్రమిస్తారు. వారిచేత ఊడిగం చేయించేవాళ్ళ మాటలు వారికి వినపడవు.
19 పేదవారూ, గొప్పవారూ అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల స్వాధీనం నుంచి విడుదల అయ్యారు.
20 ✽దుర్దశతో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులకు బ్రతుకు ఎందుకు?
21 ✽వారు మృతిని కోరుకుంటారు. మరుగైవున్న ధనం కోసం లోతుగా తవ్వినట్టు దానికోసం వెదుకుతారు. అది వారికి ప్రాప్తం కాలేదు.
22 సమాధికి చేరడం వల్ల ఆనందమయులవుతారు, చాలా సంబరపడిపోతారు.
23 ✽మార్గం చూడలేనివాడికి, చుట్టూ దేవుడు కంచె వేసినవాడికి బ్రతుకు ఎందుకు?
24 భోజనం చేయడానికి బదులు నేను నిట్టూర్పులు విడుస్తూనేవున్నాను. నీటిబుగ్గలాగా నా మూలుగులు పెల్లుబికి వస్తూవున్నాయి.
25 ✽నేను భయపడినదే నాకు సంభవించింది. నన్ను భయపెట్టినదే నా మీదికి ముంచుకువచ్చింది.
26 నాకు శాంతి లేదు. సుఖం లేదు. విశ్రాంతి లేదు. నేను అనుభవిస్తున్నది ఆందోళనే.