2
1 దేవుని కుమారులు యెహోవా సమక్షంలో నిలిచే మరో రోజు వచ్చింది. ఆయన ఎదుట నిలబడడానికి సైతాను కూడా వారితో కలిసి వచ్చాడు. 2 యెహోవా సైతానును అడిగాడు, “నీవు ఎక్కడనుంచి వస్తున్నావు?” అందుకు సైతాను “భూమిమీద సంచారం చేసి వస్తున్నాను. అక్కడ అటూ ఇటూ తిరుగులాడాను” అని జావాబిచ్చాడు.3 ✽యెహోవా సైతానుతో అన్నాడు, “నీవు నా సేవకుడు యోబును చూచి ఆలోచించావా? అతడు నిర్దోషి, నిజాయితీగా బ్రతికేవాడు. దేవుడంటే భయభక్తులు గల మనిషి, చెడుగునుంచి వైదొలగేవాడు. భూలోకమంతట్లో అతడికి సాటి ఎవరూ లేరు. నిష్కారణంగా అతణ్ణి నాశనం చేయాలని నీవు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించావు. అయినా అతడు తన నిజాయితీ విడవలేదు చూశావా?”
4 ✽సైతాను అన్నాడు, “మనిషి తన చర్మం రక్షించుకొనేందుకు చర్మం ఇస్తాడు. తన ప్రాణం దక్కించుకొనేందుకు తనకున్నదంతా ఇస్తాడు. 5 మరోసారి నీవు చెయ్యి చాపి, అతడి ఎముకలమీద, శరీరంమీద దెబ్బ తీస్తే అతడు నీ ఎదుటే నిన్ను తిట్టిపోస్తాడు” 6 ✽యెహోవా “ఇడుగో, అతడు నీ చేతిలో ఉన్నాడు. కానీ అతని ప్రాణం నీవు తీయకూడదు” అని సైతానుతో అన్నాడు.
7 ✽సైతాను యెహోవా సముఖం నుంచి వెళ్ళిపొయ్యాడు. అతడు యోబును దెబ్బ తీసి, అతని అరికాలునుంచి నడినెత్తివరకు చాలా బాధకరమైన కురుపులు లేచేలా చేశాడు. 8 ✽యోబు ఒళ్ళు గోకుకోవడానికి చిల్ల పెంకును తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. 9 ✽అప్పుడు అతని భార్య అతనితో ఇలా అంది: “నీవింకా నీ నిజాయితీ విడవవు గదూ! దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో!”✽
10 ✽ అందుకు యోబు ఆమెతో “తెలివితక్కువదానిలా మాట్లాడుతావేం? మనం దేవుడిచ్చే మేలును మాత్రమేనా అనుభవించేది? కీడు అనుభవించకూడదా?” అన్నాడు.
దీనంతట్లో యోబు మాటలతో తప్పిదమేమీ✽ చేయలేదు.
11 ✽తరువాత యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఈ విపత్తులన్నిటి గురించీ విన్నారు. వీరు తేమాను ప్రాంతంవాడు ఎలీఫజు, షూహియా ప్రాంతంవాడు బిల్‌దదు, నయమాతు ప్రాంతంవాడు జోఫరు. వీరు యోబుకు సానుభూతి చూపుదామని, అతణ్ణి పరామర్శిద్దామని ఏకీభావంతో స్వస్థలాలనుంచి బయలుదేరారు. 12 ✽ఇంకా కొంత దూరంగా ఉండి తలలెత్తి చూశారు. వాళ్ళు యోబును గుర్తుపట్టలేక, గొంతెత్తి విలపించడం మొదలు పెట్టారు. తమ పైబట్టలు చింపుకొన్నారు. తలలమీద పడేలా దుమ్ము ఆకాశంవైపు విసిరారు. 13 ✽వాళ్ళు అతనితో కూడా ఏడు రోజులు – రాత్రింబగళ్ళు – నేలమీద చతికిలపడ్డారు. అతనికి చాలా బాధ కలిగిందని గ్రహించి ఎవ్వరూ అతనితో ఒక్క మాట కూడా అనలేదు.