యోబు
1
1 ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నిర్దోషి, నిజాయితీగా బ్రతికేవాడు, దేవుడంటే భయభక్తులు గల మనిషి. అతడు చెడుగునుంచి వైదొలగేవాడు. 2 అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. 3 ఏడు వేల గొర్రెలు, మూడు వేల ఒంటెలు, అయిదు వందల జతల ఎద్దులు, అయిదు వందల గాడిదలు అతనికి ఉన్నాయి. ఎందరో అతని క్రింద పనిచేసేవాళ్ళున్నారు. తూర్పు వారందరిలో అతడే గొప్పవాడు.
4 అతని కొడుకులంతా వంతుల ప్రకారం విందులు చేసేవాళ్ళు. ఎవడి వంతురోజున అతని ఇంట్లో సమకూడే వాళ్ళు. అన్నపానాలు పుచ్చుకోవడానికి వాళ్ళ ముగ్గురు అక్కచెల్లెళ్ళను కూడా పిలిచేవాళ్ళు. 5 ఈ విధంగా విందులు అయిపొయ్యాక యోబు ప్రొద్దున్నే లేచి తన సంతానంలో ప్రతి ఒక్కరికోసమూ హోమబలి చేసేవాడు. వారు అపరాధం చేసి, హృదయంలో దేవుణ్ణి దూషించారేమో అనే సందేహంతో వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచేవాడు. యోబు ఎల్లప్పుడూ ఇలా చేసేవాడు.
6 దేవుని కుమారులు యెహోవా సమక్షంలో నిలబడడానికి వచ్చిన రోజు అది. ఆనాడు సైతాను వారితో కలిసి వచ్చాడు. 7 “నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు?” అని యెహోవా సైతానును అడిగాడు. అందుకు సైతాను “భూమిమీద సంచారం చేసి వస్తున్నాను. అక్కడ అటూ ఇటూ తిరుగులాడాను” అని జవాబిచ్చాడు.
8 యెహోవా సైతానుతో “నీవు నా సేవకుడు యోబు ను చూచి ఆలోచించావా? అతడు నిర్దోషి, నిజాయితీగా బ్రతికేవాడు, దేవుడంటే భయభక్తులు గల మనిషి, చెడుగునుంచి వైదొలగేవాడు. భూలోకమంతట్లో అతనికి సాటి ఎవరూ లేరు” అన్నాడు.
9 అందుకు సైతాను “దేవుడంటే భయభక్తులు ప్రదర్శిస్తున్నాడంటే, యోబు ఇదంతా ఊరకనే చేస్తున్నాడా? 10 నీవు అతడికీ, అతడి ఇంటిల్లిపాదికీ, అతడి సర్వస్వానికీ చుట్టూరా కంచె వేశావు గదా! నీవు అతడి చేతి కష్టాన్ని దీవించావు. అందుచేత అతడి ఆస్తి దేశంలో వృద్ధి అయింది. 11 కానీ, నీవిప్పుడు చెయ్యి చాపి అతడి సర్వస్వాన్ని మొత్తితే అతడు నీ ఎదుటే నిన్ను తిట్టిపోస్తాడు” అన్నాడు.
12 యెహోవా సైతానుతో అన్నాడు, “యోబు సర్వస్వం నీ వశం. నీవు అతనికి మాత్రం ఏ హానీ చేయకూడదు.” అప్పుడు సైతాను యెహోవా ఎదుట నుంచి వెళ్ళిపోయాడు.
13 ఒక రోజు యోబు కొడుకులు, కూతుళ్ళు తమ పెద్దన్న ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నారు. 14 అప్పుడొక మనిషి యోబు దగ్గరికి వచ్చి ఈ వార్త చెప్పాడు: “ఎద్దులు నాగలి దున్నుతున్నాయి. గాడిదలు అక్కడే మేస్తూవున్నాయి. ఇంతలో షెబావాళ్ళు వచ్చి పడి, వాటిని తోలుకుపొయ్యారు. 15 సేవకులను కత్తివాతకు గురిచేశారు. నేనొక్కణ్ణే తప్పించుకుని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను.”
16 అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరొకడు వచ్చి, “దేవుని అగ్ని ఆకాశంనుంచి పడింది. గొర్రెలూ, సేవకులూ అంతా కాలిపోయారు. నేనొక్కణ్ణే తప్పించుకుని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను” అన్నాడు.
17 అతడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో మరొకడు వచ్చి ఇలా అన్నాడు: “కల్దీయవాళ్ళు మూడు గుంపులుగా వచ్చి పడ్డారు. ఒంటెలను దోచుకుపొయ్యారు. సేవకులను కత్తివాతకు గురి చేశారు. నేనొక్కణ్ణే తప్పించుకుని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను.”
18 అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఇంతలో మరొకడు వచ్చి “మీ కొడుకులు, కూతుళ్ళు తమ పెద్దన్న ఇంట్లో ఆహారం, ద్రాక్షరసం పుచ్చుకొంటూవుంటే, 19 పెద్ద సుడిగాలి ఎడారి వైపు నుంచి వచ్చింది, ఇల్లు నలుమూలలా దెబ్బతీసింది. ఇల్లు యువకుల మీద పడింది. అంచేత వాళ్ళంతా చనిపోయారు. నేనొక్కణ్ణే తప్పించుకుని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను” అన్నాడు.
20  అప్పుడు యోబు లేచి నిలిచాడు. పైబట్ట చింపుకొన్నాడు. తల వెండ్రుకలు పూర్తిగా క్షౌరం చేయించుకొన్నాడు. అప్పుడు నేలమీద సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు. 21 “నేను నా తల్లి గర్భంలోనుంచి వచ్చినప్పుడు దిగంబరిని. దిగంబరి గానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసివేశాడు. యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక!” అన్నాడు.
22 ఈ సంగతులన్నిట్లో దేనిలోనూ యోబు ఎలాంటి తప్పిదమూ చేసినవాడు కాడు. దేవుడు తనకు అన్యాయం చేశాడని అతడు చెప్పలేదు.