9
1 పన్నెండో నెల, అంటే అదార్ నెల, పదమూడో రోజు వచ్చింది. అది చక్రవర్తి నిర్ణయం, ఆజ్ఞ నెరవేరవలసిన రోజు. ఆ రోజున యూదుల పగవాళ్ళు వాళ్ళను ఓడించగలమని ఆశించారు గాని అంతా మారిపోయింది. ఆ రోజునే యూదులు తమ పగవాళ్ళను ఓడించారు. 2 అహష్‌వేరోషు చక్రవర్తి పరిపాలించే ప్రదేశాలన్నిటిలో తాము నివసించే పట్టణాలలో యూదులు సమకూడారు. తమకు హాని చేయడానికి చూచినవాళ్ళను హతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యూదులను గురించిన భయం ఇతర జనాలన్నిటికీ కలిగింది, గనుక వారిని ఎదిరించగలవాళ్ళెవరూ లేకపోయారు. 3 అంతేగాక ఆ ప్రదేశాల నాయకులూ పరిపాలకులూ అధిపతులూ ఉద్యోగులూ అందరూ మొర్‌దెకయికి భయపడి యూదులకు సహాయం చేశారు. 4 చక్రవర్తి భవనంలో మొర్‌దెకయి ప్రముఖుడయ్యాడు. అతని కీర్తి ప్రదేశాలన్నిటిలో వ్యాపించింది. మొర్‌దెకయి బలప్రభావాలు అంతకంతకు ఎక్కువ అవుతూ వచ్చాయి.
5 యూదులు తమ శత్రువులందరినీ కత్తిపాలు చేసి, చంపి, నాశనం చేశారు. తమను ద్వేషించినవాళ్ళను తమకు ఇష్టం వచ్చినట్టు చేశారు. 6 షూషన్ రాజధానిలో వారు అయిదు వందలమంది పురుషులను చంపి నాశనం చేశారు. 7 యూదులకు శత్రువూ, హమ్మెదాతా కొడుకూ అయినా హామాను పదిమంది కొడుకులను కూడా వారు చంపారు. 8 వాళ్ళ పేర్లు పరషందాతా, దల్‌పొన్, అస్సాతా, 9 పోరాతా, అదలయా, అరీదాతా, పరమాష్తా, అరీసై, అరీదై, వైజాతా. 10 వాళ్ళను చంపారు గాని దోపిడీ సొమ్ము పట్టుకోలేదు.
11 ఆ రోజే షూషన్ రాజధానిలో సంహారమైనవాళ్ళ లెక్క ఎవరో చక్రవర్తికి తెలియజేశారు. 12 చక్రవర్తి ఎస్తేరురాణితో అన్నాడు, “యూదులు షూషన్ రాజధానిలో అయిదు వందలమంది పురుషులనూ, హామాను పదిమంది కొడుకులనూ చంపి నాశనం చేశారు. నా రాజ్యంలో తక్కిన ప్రదేశాలలో వాళ్ళు ఏం చేశారో! ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకిస్తాను. నీ విజ్ఞాపనం ఏమిటి? అది నీకు ప్రసాదిస్తాను.”
13 అందుకు ఎస్తేరు “చక్రవర్తికి ఇష్టమైతే, ఈ రోజు రాజాజ్ఞను వారు నెరవేర్చినట్టు, రేపు కూడా చేసి హామాను పదిమంది కొడుకులను ఉరికొయ్యమీద ఉరితీసేలా షూషన్‌లో ఉన్న యూదులకు అనుమతి ఇప్పించండి” అని చెప్పింది.
14 అలాగే జరగాలని చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. షూషన్‌లో ఆ ఆజ్ఞ ప్రకటించబడింది. వారు హామాను పదిమంది కొడుకులను ఉరితీశారు. 15 షూషన్‌లో యూదులు అదార్ నెల పద్నాలుగో రోజున కూడా సమకూడి షూషన్‌లో మూడు వందలమంది పురుషులను చంపారు. అయితే వారు దోపిడీసొమ్ము పట్టుకోలేదు. 16 చక్రవర్తి ప్రదేశాలలో ఉన్న తక్కిన యూదులు కూడా ప్రాణ సంరక్షణకోసం, పగవాళ్ళవల్ల బాధ లేకుండా నెమ్మది పొందేందుకు సమకూడారు. తమ శత్రువులలో డెబ్భై అయిదు వేలమందిని చంపారు గాని, దోపిడీసొమ్ము పట్టుకోలేదు. 17 ఇది అదార్ నెల పదమూడో రోజున జరిగింది. పద్నాలుగో రోజున వారు విశ్రమించి, సంతోషంతో విందులు చేసుకొన్నారు. 18 షూషన్‌లో ఉన్న యూదులు ఆ నెల పదమూడో రోజున, పద్నాలుగో రోజున సమకూడి, పదిహేనో రోజున విశ్రమించి, సంతోషంతో విందులు చేసుకున్నారు. 19 కనుక పల్లెటూళ్ళ ప్రాంతాలలో గోడలు లేని ఊళ్ళలో కాపురమున్న యూదులు అదార్ నెల పద్నాలుగో రోజున సంతోషంతో విందులు చేసుకొంటారు. అది శుభదినమని ఒకరినొకరు బహుమానాలను ఇస్తారు.
20 మొర్‌దెకయి ఈ సంగతులను వ్రాసిపెట్టాడు. అతడు అహష్‌వేరోషు చక్రవర్తి పరిపాలించే ప్రదేశాలన్నిటిలో – దగ్గరగా గానీ దూరంగా గానీ ఉంటున్న యూదులందరికీ లేఖలు పంపాడు. 21 యూదులు ప్రతి సంవత్సరమూ అదార్ నెల పద్నాలుగో రోజు, పదిహేనో రోజున ప్రత్యేక దినాలుగా స్థిరంగా ఆచరించాలని ఆ లేఖలలో వ్రాశాడు. 22 ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు తమ పగవాళ్ళ బారినుంచి తప్పించుకొన్నారు. ఆ నెల వారి దుఃఖం సంతోషానికి మారిపోయింది. ఆ రోజు వారు విలాపం మానిన శుభదినం అయింది. ఆ రోజుల్లో వారు సంతోషంతో విందులు చేసుకొని, ఒకరినొకరు బహుమానాలనూ, బీదలకు కానుకలనూ ఇవ్వాలని మొర్‌దెకయి వ్రాశాడు.
23 యూదులు తాము మొదలుపెట్టిన ఆచారాన్ని మొర్‌దెకయి తమకు వ్రాసిన ప్రకారం సాగించడానికి సమ్మతించారు. 24  యూదులందరి శత్రువూ హమ్మెదాతా కొడుకూ అగాగువాడూ అయిన హామాను యూదులను నాశనం చేయడానికి కుట్ర చేసి, వారి సమూల నాశనానికి “పూరు” – అంటే చీటి వేయించుకొన్నాడు. 25 ఎస్తేరు చక్రవర్తి సముఖంలోకి వచ్చిన తరువాత, హామాను యూదుల మీద చేసిన దురాలోచన వాడి నెత్తి మీదికే వచ్చేలా చేసి, చక్రవర్తి వాణ్ణీ వాడి కొడుకులనూ ఉరికొయ్యమీద ఉరి తీయాలని ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాడు. 26 అందుచేత యూదులు ఆ రోజులను ‘పూరు’ అనే మాటనుబట్టి ‘పూరీం’ అన్నారు. మొర్‌దెకయి లేఖలో వ్రాసిన మాటలన్నిటిని బట్టి, ఆ విషయంలో వారు చూచి అనుభవించినదాని కారణంగా, 27 యూదులు ప్రతి సంవత్సరమూ ఈ రెండు రోజులు వాటి నియామక కాలంలో యథావిధిగా తప్పకుండా ఆచరిస్తామనీ, తమ సంతానం తమను కలిసి ఉంటే వారందరూ కూడా ఆచరించాలనీ నిర్ణయం చేసుకొన్నారు. 28 ఈ రోజులను తరతరాలుగా ప్రతి కుటుంబమూ ప్రదేశాలన్నిటిలో ప్రతి పట్టణంలో జ్ఞాపకం చేసుకొని ఆచరించాలనీ, ఈ ‘పూరీం’ రోజులు యూదులు ఆచరించడం, తమ సంతతివారు జ్ఞాపకం చేసుకోవడం ఎన్నడూ మానకూడదనీ నిశ్చయించుకొన్నారు. 29 పూరీం గురించిన ఆ రెండో లేఖను స్థిరపరచడానికి అబీహాయిల్ కూతురు ఎస్తేరురాణి, యూదుడు మొర్‌దెకయి ఖచ్చితంగా రాశారు. 30 అహష్‌వేరోషు రాజ్యంలో ఉన్న నూట ఇరవై ఏడు ప్రదేశాలలో ఉన్న యూదులందరికీ మొర్‌దెకయి లేఖలు పంపాడు.
31 యూదుడు మొర్‌దెకయి, ఎస్తేరురాణి వారికి నిర్ణయించినట్టు, యూదులు ఉపవాస విలాప కాలాల గురించి తమకోసం, తమ సంతతివారికోసం నిర్ణయించుకొన్నట్టు, ఈ పూరీం రోజులనూ వాటి నియమిత కాలాన్నీ స్థిరపరచడానికి శాంతి, విశ్వసనీయత ప్రోత్సహించే మాటలు వ్రాశారు. 32 ఎస్తేరు ఇచ్చిన ఆజ్ఞ పూరీం విషయమైన ఏర్పాట్లు దృఢపరిచింది. అది గ్రంథంలో వ్రాయడం జరిగింది.