8
1 ఆ రోజే అహష్‌వేరోషు చక్రవర్తి యూదుల శత్రువైన హామాను✽ ఇంటిని ఎస్తేరురాణికి ఇచ్చాడు. మొర్‌దెకయి తనకు ఏమై ఉన్నాడో ఎస్తేరు చక్రవర్తికి తెలియజేసింది. గనుక మొర్‌దెకయి చక్రవర్తి సన్నిధానంలోకి రాగలిగాడు. 2 ✝చక్రవర్తి తన ముద్ర ఉంగరం మొర్‌దెకయికి ఇచ్చాడు. అంతకుముందు అతడు హామాను చేతినుంచి దానిని తీసుకొన్నాడు. ఎస్తేరు మొర్‌దెకయిని హామాను ఇంటిమీద అధికారిగా ఉంచింది. 3 మరో సారి ఎస్తేరు చక్రవర్తితో మనవి చేసుకొని అతని పాదాలమీద పడి ఏడ్చింది. అగాగు సంతతివాడైన హామాను యూదులమీద చేసిన దురాలోచనను భంగం చేయండని చక్రవర్తిని ప్రాధేయపడింది. 4 ✝చక్రవర్తి బంగారు రాజదండం ఎస్తేరువైపు చాపాడు. ఎస్తేరు లేచి చక్రవర్తి ఎదుట నిలబడి, 5 ✝ఇలా అంది:“చక్రవర్తికి ఇష్టమైతే, మీ దయకు నేను పాత్రురాలనుకొంటే, ఇలా చేయడం మంచిదని మీకు తోస్తే, నేనంటే మీకు ఇష్టం ఉంటే, చక్రవర్తి ఇలా చేయగలరని నా మనవి: చక్రవర్తి పరిపాలించే ప్రాంతాలన్నిటిలో యూదులను నాశనం చేసేందుకు హమ్మెదాతా కొడుకూ అగాగు సంతతివాడూ అయిన హామాను తాకీదులు వ్రాయించాడు. ఆ తాకీదులను రద్దు చేయడానికి ఆజ్ఞ జారీ చేయండి. 6 నా ప్రజలమీదికి విపత్తు రావడం, నా వంశం నాశనం కావడం చూచి సహించగలనా?”
7 అందుకు అహష్‌వేరోషుచక్రవర్తి ఎస్తేరురాణితో, యూదుడైన మొర్‌దెకయితో ఇలా చెప్పాడు: “హామాను యూదులకు వ్యతిరేకంగా చేయి చాపినందుచేత వాణ్ణి ఉరికొయ్యమీద ఉరితీశారు. వాడి ఇంటిని నేను ఎస్తేరుకు ఇచ్చాను. 8 చక్రవర్తి పేర రాసి చక్రవర్తి ముద్ర ఉంగరంతో ముద్రించిన తాకీదును కొట్టివేయడం✽ అసాధ్యం, గనుక మీకు ఇష్టం వచ్చినట్టు చక్రవర్తి పేర యూదుల పక్షంగా తాకీదు రాయించి చక్రవర్తి ఉంగరంతో దానిని ముద్రించండి.”
9 ✝వెంటనే చక్రవర్తి లేఖకులు పిలవబడ్డారు. అది మూడో నెల అయిన సీవాన్ నెల ఇరవై మూడో రోజు. మొర్‌దెకయి ఆదేశించినట్టే వాళ్ళు యూదులకూ, ఇండియా✽నుంచి కూషు దేశం వరకు ఉన్న నూట ఇరవై ఏడు ప్రదేశాల పరిపాలకులకూ అధిపతులకూ నాయకులకూ తాకీదులు వ్రాశారు. ప్రతి ప్రదేశానికీ ప్రతి జాతికీ వారి భాషలో, లిపిలో వ్రాశారు. యూదులకు కూడా వారి భాషలో, లిపిలో వ్రాశారు. 10 ✝అహష్‌వేరోషు చక్రవర్తి పేర మొర్‌దెకయి వ్రాయించాడు. ఆ తాకీదులను చక్రవర్తి ముద్ర ఉంగరంతో ముద్రించాడు. చక్రవర్తి అశ్వశాలల నుంచి గుర్రాలను తెప్పించి, వాటిమీద అంచెవాళ్ళను ఎక్కించి, ఆ తాకీదులను వాళ్ళచేత పంపించాడు. 11 ✽ ఆ తాకీదులలో వ్రాసి ఉన్నదేమంటే, పట్టణాలన్నిటిలో ఉన్న యూదులు ప్రాణ సంరక్షణ కోసం సమకూడడానికీ, తమమీదికీ తమ భార్యబిడ్డల మీదికీ వచ్చిన ఏ ప్రదేశం వాళ్ళనైనా ఏ జనం సైనికులనైనా సంహారానికీ హత్యకూ సమూలనాశనానికీ గురి చేయడానికీ, వాళ్ళ ఆస్తిని దోచుకోవడానికీ చక్రవర్తి అనుమతి ఇచ్చాడు. 12 అలా చేయడానికి, అహష్‌వేరోషు చక్రవర్తి పరిపాలించే ప్రదేశాలన్నిటిలో యూదులకు ఒకే ఒక రోజు నియమించాడు. అది పన్నెండో నెల, అంటే అదార్ నెల పదమూడో రోజు. 13 ఆ రోజుకు యూదులు తమ శత్రువులకు ప్రతీకారం చేయడానికి సిద్ధపడేలా ఆ తాకీదుల ప్రతులు రాజాజ్ఞగా ప్రదేశాలన్నిటిలో ఉన్న అన్ని జనాలకూ ఇవ్వాలని వాటిని పంపించాడు. 14 అంచెవాళ్ళు రాజాజ్ఞ కారణంగా త్వరపడి చక్రవర్తి అశ్వశాలలనుంచి తెచ్చిన గుర్రాలమీద వేగంతో బయలుదేరారు. ఆ ఆజ్ఞ షూషన్ రాజధానిలో కూడా ఇవ్వడం జరిగింది.
15 మొర్‌దెకయి చక్రవర్తి సమక్షంనుంచి బయలు దేరినప్పుడు అతడు తెలుపు నీలి రంగులు గల రాజవస్త్రం✽, పెద్ద బంగారు కిరీటం, ఊదా రంగు గల శ్రేష్ఠమైన పైవస్త్రం ధరించినవాడు. అప్పుడు షూషన్ నివాసులు ఆనందధ్వనులతో సంబరపడ్డారు.✽ 16 యూదులకు క్షేమం, సంతోషం, ఆనందం, ఘనత కలిగాయి. 17 చక్రవర్తి నిర్ణయం, ఆజ్ఞ వచ్చిన ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో యూదులకు సంతోషానందాలు కలిగాయి. అది శుభదినమని విందు చేసుకొన్నారు. దేశ ప్రజలకు యూదులంటే భయం✽ కలిగింది, గనుక చాలా మంది యూదులయ్యారు.