5
1 మూడో రోజున ఎస్తేరు రాణుల అలంకారాలు ధరించుకొని, రాజభవనంలోపలి ఆవరణంలోకి వెళ్ళి, దర్బారు ఎదుట నిలుచుంది. చక్రవర్తి దర్బారులో ద్వారానికి ఎదురుగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. 2 ✝ఎస్తేరురాణి లోపలి ఆవరణంలో నిలబడి ఉండడం కనిపించినప్పుడు ఆమెను చక్రవర్తి దయ చూశాడు, తన చేతిలో ఉన్న బంగారు రాజదండం ఆమెవైపు చాపాడు. ఎస్తేరు అతనిదగ్గరికి వచ్చి రాజదండం కొనను తాకింది. 3 ✝అప్పుడు చక్రవర్తి “ఎస్తేరురాణీ, నీకేం కావాలి? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగంవరకు నీకిస్తాను” అని ఆమెతో చెప్పాడు.4 ✽అందుకు ఎస్తేరు “చక్రవర్తికి ఇష్టమయితే, చక్రవర్తి కోసం నేను సిద్ధం చేయించిన విందుకు చక్రవర్తి హామానుతో కూడా ఈ రోజు రావాలని కోరుతున్నాను” అని జవాబిచ్చింది.
5 చక్రవర్తి “ఎస్తేరు చెప్పినట్టు చేస్తాం. వెంటనే హామానును తీసుకురండి” అని ఆజ్ఞ జారీ చేశాడు. ఎస్తేరు సిద్ధం చేయించిన విందుకు చక్రవర్తి, హామాను వచ్చారు. 6 విందులో ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నప్పుడు చక్రవర్తి “నీ విజ్ఞాపనం ఏమిటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగంవరకు నీకు ఇస్తాను” అని ఎస్తేరుతో చెప్పాడు.
7 ఎస్తేరు ఇలా జవాబిచ్చింది: “నా మనవి, నా విజ్ఞాపనం ఏమిటంటే, 8 చక్రవర్తి నన్ను దయ చూస్తూఉంటే, నా మనవి, నా విజ్ఞాపనం ప్రకారం చేయడం చక్రవర్తికి ఇష్టమైతే చక్రవర్తి కోసం, హామానుకోసం నేను చేయించబోయే విందుకు రేపు రావాలి. అప్పుడు చక్రవర్తి చెప్పినట్టు నా విన్నపం తెలియజేస్తాను.”
9 ✝ఆ రోజు హామాను సంతోషంతో బయలుదేరాడు. అతడి మానసిక స్థితి బాగానే ఉంది. కానీ, చక్రవర్తి ద్వారందగ్గర ఉన్న మొర్‌దెకయిని చూచి, మొర్‌దెకయి నిలబడకపోవడం తనకు భయపడకపోవడం గమనించి హామాను మొర్‌దెకయిమీద అధికంగా కోపగించాడు. 10 అయినా హామాను కోపాన్ని అణచుకొని✽ ఇంటికి వెళ్ళాడు. అప్పుడతడు తన మిత్రులనూ, తన భార్య జెరెష్‌నూ పిలిచి, గొప్పలు చెప్పుకోసాగాడు, 11 తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం విషయం, తనకు పుట్టిన చాలామంది కొడుకుల విషయం చెప్పాడు. చక్రవర్తి తనను ఘనపరచి, తక్కిన నాయకులందరికంటే అధిపతులందరికంటే తనను ఏ విధంగా పై స్థితికి హెచ్చించాడో దాని గురించి కూడా గొప్పలు✽ చెప్పుకొన్నాడు. 12 అతడు ఇంకా అన్నాడు “ఎస్తేరురాణి విందు చేయించింది. చక్రవర్తిని, నన్ను పిలిచింది. ఇంకెవరినీ పిలవలేదు. రేపు కూడా చక్రవర్తితో కలిసి విందుకు రమ్మని నన్ను ఆహ్వానించింది. 13 ✽అయితే చక్రవర్తి ద్వారం దగ్గర ఆ యూదుడు మొర్‌దెకయి కూర్చుని ఉండడం నేను చూస్తున్నంత కాలం దీనంతటివల్ల నాకు తృప్తి కలగదు.”
14 అప్పుడు హామాను భార్య జెరెష్, అతడి మిత్రులందరూ అతడితో చెప్పారు, “యాభై మూరల ఎత్తు గల ఉరికొయ్యను చేయించండి. దానిమీద మొర్‌దెకయిని ఉరి తీయించమని రేపు చక్రవర్తితో మనవి చెయ్యండి. అప్పుడు మీరు చక్రవర్తితోపాటు సంతోషంగా విందుకు వెళ్ళవచ్చు.” ఈ మాట హామానుకు నచ్చింది✽, గనుక అలాగే ఉరికొయ్యను చేయించాడు.