4
1 జరిగినదంతా తెలుసుకొన్నప్పుడు మొర్‌దెకయి తొడుక్కొన్న బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద✽ పోసుకొన్నాడు. భోరున రోదనం చేస్తూ, నగరంలో నడిచిపోయాడు 2 గాని చక్రవర్తి ద్వారం దగ్గరికి వచ్చి ఆగాడు. ఎందుకంటే గోనెపట్ట కట్టుకొన్న వాడెవడూ ఆ ద్వారంలో ప్రవేశించకూడదని చట్టం ఒకటి ఉంది. 3 చక్రవర్తి ఆజ్ఞ, శాసనం వచ్చిన ప్రతి ప్రదేశంలో యూదులకు మహా దుఃఖం కలిగింది. వారు ఉపవాసముండి ఏడుస్తూ, రోదనం చేస్తూ ఉన్నారు. చాలామంది గోనెపట్ట కట్టుకొని బూడిదమీద పడుకొన్నారు.4 ఎస్తేరు పనికత్తెలూ నపుంసకులూ వచ్చి, మొర్‌దెకయి విషయం ఆమెకు తెలియజేశారు. వెంటనే ఎస్తేరురాణి అధిక మనోవేదన అనుభవించసాగింది. మొర్‌దెకయి గోనెపట్ట తొడుక్కోవడం మానాలని ఆమె అతనిదగ్గరికి బట్టలు పంపింది గాని, అతడు వాటిని తీసుకోలేదు. 5 ✽అప్పుడు ఎస్తేరు తనకు సేవ చేయడానికి చక్రవర్తి నియమించిన నపుంసకుల్లో ఒకణ్ణి పిలిపించింది. అతడి పేరు హతాక్. మొర్‌దెకయిదగ్గరికి వెళ్ళి ఎందుకలా చేస్తున్నాడని, సంగతి ఏమిటని అడిగి తెలుసుకోమని ఎస్తేరు హతాక్‌కు ఆజ్ఞ ఇచ్చింది. 6 చక్రవర్తి ద్వారం ఎదుట ఉన్న నగరవీధిలో మొర్‌దెకయి ఉన్నాడు. హతాక్ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు, 7 మొర్‌దెకయి తనకు సంభవించినదంతా అతడికి తెలియజేశాడు. యూదులను నాశనం చేయడానికి హామాను చక్రవర్తి ఖజానాకు ఇస్తానని చెప్పిన డబ్బు ఎంతో అది కూడా తెలియజేశాడు. 8 యూదుల నాశనం విషయమైన రాజాజ్ఞ నకలు (అది షూషన్‌లో ఇయ్యబడింది) ఎస్తేరుకు చూపి వివరించమని దానిని హతాక్‌కు ఇచ్చాడు. ఆమె తన ప్రజలకోసం చక్రవర్తికి విన్నపం చేసి దయ చూపమని ప్రాధేయపడడానికి అతని సముఖంలోకి వెళ్ళాలని చెప్పమని అన్నాడు.
9 హతాక్ వచ్చి మొర్‌దెకయి చెప్పినది ఎస్తేరుకు తెలియజేశాడు. 10 అప్పుడు ఎస్తేరు మొర్‌దెకయితో చెప్పమని హతాక్‌తో ఇలా అంది: 11 ✽“చక్రవర్తి పిలుపు రాకపోతే పురుషుడు గానీ స్త్రీ గానీ లోపలి గదులలో ఉన్న ఆయనను సమీపిస్తే ఆ వ్యక్తి చావాలి. ఇది రాజ శాసనం. చక్రవర్తి సేవకులందరికీ రాజ్య ప్రదేశాలలో ఉన్న ప్రజలందరికీ ఇది తెలుసు. ఒకవేళ చక్రవర్తి తన బంగారు రాజదండం ఆ వ్యక్తివైపు చాపితే అతడు బ్రతుకుతాడు. నేటికి ముప్ఫయి రోజులనుంచి చక్రవర్తి దగ్గరికి వెళ్ళడానికి నాకు పిలుపు రాలేదు.”
12 ఎస్తేరు చెప్పినది మొర్‌దెకయికి తెలియజేసిన తర్వాత అతడు ఈ సమాధానం ఆమెకు పంపాడు: 13 “రాజభవనంలో ఉండడంచేత, యూదులందరిలో నీవు మాత్రమే తప్పించు కొంటావనుకోవద్దు. 14 ఒకవేళ నీవు ఈ సమయంలో పూర్తిగా మౌనం వహిస్తే, యూదులకు సాయం, విడుదల ఇంకో దిక్కునుంచి✽ వస్తాయి గాని నీవు నీ తండ్రి వంశంవారు నాశనం అవుతారు. నీవు ఇలాంటి సమయానికే✽ రాజ్యానికి వచ్చావేమో ఎవరికి తెలుసు?”
15 అప్పుడు ఎస్తేరు మొర్‌దెకయికి ఈ మాట పంపింది: 16 “మీరు వెళ్ళి షూషన్‌లో ఉన్న యూదులందరినీ సమకూర్చి నా కోసం ఉపవాసం✽ ఉండండి. మూడు రాత్రింబగళ్ళు ఏమీ తినవద్దు. త్రాగవద్దు ఈ విధంగా నేను, నా పరిచారికలు కూడా ఉపవాసముంటాం. ఆ తరువాత నేను చక్రవర్తి దగ్గరికి వెళ్తాను. అది చట్టానికి విరుద్ధంగా ఉన్నా నేను వెళ్తాను. నేను నశిస్తే నశిస్తాను✽.”
17 అప్పుడు మొర్‌దెకయి వెళ్ళి, ఎస్తేరు తనకు ఆదేశించిన ప్రకారమే అంతా జరిగించాడు.