3
1 ఈ సంగతుల తరువాత అహష్‌వేరోషు చక్రవర్తి హమ్మెదాతా కొడుకూ అగాగు సంతతివాడూ అయిన హామానును ఘనపరచి, హెచ్చు ఉద్యోగం ఇచ్చి, తక్కిన అధిపతులందరికంటే గౌరవనీయమైన స్థానంలో ఉంచాడు. 2 చక్రవర్తి ద్వారంలో చక్రవర్తి సేవకులందరూ హామానుకు వంగి నమస్కారం చేయాలని చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. కనుక వాళ్ళంతా అలా చేశారు. కానీ, మొర్‌దెకయి వంగలేదు, నమస్కారం చేయనూ లేదు. 3 చక్రవర్తి ద్వారం దగ్గర ఉన్న చక్రవర్తి సేవకులు మొర్‌దెకయిని చూచి “చక్రవర్తి ఆజ్ఞను ఎందుకు మీరుతున్నావు నీవు?” అని అడిగారు. 4 ప్రతి రోజూ వాళ్ళు అతనితో అలా చెపుతూ వచ్చినా అతడు వాళ్ళ మాట చెవిని పెట్టలేదు. “నేను యూదుణ్ణి” అని అతడు వాళ్ళతో చెప్పాడు. కనుక మొర్‌దెకయి చెప్పిన కారణం నిలుస్తుందో లేదో చూద్దామని వాళ్ళు దాని గురించి హామానుకు తెలియజేశారు. 5 మొర్‌దెకయి వంగకపోవడం, తనకు నమస్కారం చేయకపోవడం చూచి హామాను ఆగ్రహంతో నిండిపోయాడు. 6 మొర్‌దెకయి జాతిని తెలుసుకొని హామాను మొర్‌దెకయిని ఒకణ్ణే చంపడం చిన్న సంగతి అనుకొన్నాడు. మొర్‌దెకయి ఏ జాతికి చెందాడో ఆ జాతివారందరినీ – అహష్‌వేరోషు సామ్రాజ్యం అంతట్లో ఉన్న యూదులందరినీ – నాశనం చేయడానికి హామాను అవకాశంకోసం వెదకసాగాడు.
7 అహష్‌వేరోషు చక్రవర్తి పాలించిన పన్నెండో సంవత్సరం మొదటి నెల అయిన నీసాన్ నెలలో ఒక నెలను ఒక రోజును ఎన్నుకోవడానికి హామాను తన ఎదుట చీటి వేయించు కొన్నాడు. (ఆ చీటిని “పూరు” అంటారు). చీటి పన్నెండో నెల అయిన అదార్ నెల మీద పడింది.
8 అప్పుడు హామాను అహష్‌వేరోషుతో ఇలా అన్నాడు: “మీ సామ్రాజ్యంలోని ప్రదేశాలన్నిటిలో ఉన్న ప్రజల మధ్య ఒక జాతివాళ్ళు చెదరి ఉన్నారు. వాళ్ళ మతాచారాలు ఇతర ప్రజలందరి మతాచారాలకు వేరుగా ఉన్నాయి. చక్రవర్తి చట్టాలకు వాళ్ళు లోబడరు. కనుక, వాళ్ళను ఉండనివ్వడం చక్రవర్తికి ప్రయోజనకరం కాదు. 9 చక్రవర్తికి ఇష్టమైతే వాళ్ళను నాశనం చేయాలని ఆజ్ఞ ఇప్పించండి. ఆ పని చేసేవాళ్ళకోసం నేను మూడు లక్షల నలభై వేల కిలోగ్రాముల వెండి చక్రవర్తి ఖజానాలో ఉంచుతాను.”
10 చక్రవర్తి తన ముద్ర ఉంగరం చేతినుంచి తీసి, దానిని హమ్మెదాతా కొడుకూ, అగాగు సంతతివాడూ, యూదులకు శత్రువూ అయిన హామానుకు ఇచ్చి ఇలా అన్నాడు: 11 “ఆ వెండి నీ చేతిలో ఉంది, ఆ జాతివాళ్ళు కూడా నీ చేతిలో ఉన్నారు. నీకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకు చెయ్యి.”
12 ఆ మొదటి నెల పదమూడో రోజున చక్రవర్తి యొక్క లేఖకులను హామాను పిలిచాడు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారమే, చక్రవర్తి నియమించిన పరిపాలకులకూ అధిపతులకూ ప్రతి ప్రదేశంలోని ప్రజల నాయకులకూ వారు వ్రాశారు. ప్రతి ప్రదేశానికీ ప్రతి జాతికీ వారి భాషలో, లిపిలో వ్రాశారు. ఆ తాకీదులు అహష్‌వేరోషు చక్రవర్తి పేర వ్రాయించిన తరువాత హామాను చక్రవర్తి యొక్క ముద్ర ఉంగరంతో వాటిని ముద్రించాడు. 13 పన్నెండో నెల అయిన అదార్ నెల పదమూడో రోజున యూదులందరినీ – యువతి యువకులను గానీ ముసలివాళ్లను గానీ స్త్రీలను గానీ చిన్నపిల్లలను గానీ – ఒకే రోజున అందరినీ చంపి పూర్తిగా నాశనం చేసి, వాళ్ళ సొమ్మును దోచుకోవాలని ఆ తాకీదులలో వ్రాసి ఉంది. అవి అంచెవాళ్ళచేత రాజ్య ప్రదేశాలన్నిటికీ పంపడం జరిగింది.
14 ఆ రోజుకు అందరూ సిద్ధపడేలా ఆ తాకీదుల ప్రతులు రాజ శాసనంగా ప్రదేశాలన్నిటిలో ఉన్న అన్ని జనాలకూ ఇవ్వాలని వాటిని పంపారు. 15 అది రాజాజ్ఞ కాబట్టి అంచెవారు త్వరపడి బయలుదేరారు. ఆ ఆజ్ఞ షూషన్ రాజధానిలో కూడా ఇవ్వడం జరిగింది. చక్రవర్తి, హామాను త్రాగడానికి కూర్చున్నారు గాని షూషన్ నగరం గందరగోళం అయింది.