2
1 ఆ తరువాత అహష్‌వేరోషు కోపాగ్ని చల్లారినప్పుడు అతడు వష్తిని, ఆమె చేసినదానిని, ఆమె విషయం తాను నిర్ణయించినదానిని తలచుకొన్నాడు. 2 అప్పుడు రాజ సేవకులు ఇలా ఆలోచన చెప్పారు: “అందమైన పడుచు కన్యలను చక్రవర్తికోసం వెదకాలి. 3 అందమైన పడుచు కన్యలందరినీ షూషన్ రాజధానిలో ఉన్న అంతఃపురానికి తీసుకురావడానికి చక్రవర్తి ఒక్కొక్క ప్రదేశంలో మనుషులను నియమించాలి. స్త్రీల వ్యవహారాలను చూచుకొనేవాడూ, చక్రవర్తి నపుంసకుడైనహేగే అధీనంలో ఆ కన్యలను ఉంచాలి. అందాన్ని హెచ్చించే పరిమళ ద్రవ్యాలను ఆ కన్యలకు ఇవ్వాలి. 4 తరువాత కన్యలలో ఏ కన్య చక్రవర్తికి ఎక్కువ ఇష్టం అవుతుందో ఆమె వష్తికి బదులుగా రాణి అవుతుంది.” ఈ మాట చక్రవర్తికి నచ్చింది గనుక అతడు అలాగే జరిగించాడు.
5 షూషన్ రాజధానిలో మొర్‌దెకయి అనే ఒక యూదుడు ఉండేవాడు. అతడు యాయీరు కొడుకు, షిమీ మనుమడు, కీషు వంశీయుడు, బెన్యామీను గోత్రికుడు. 6 బబులోను రాజైన నెబుకద్‌నెజరు యూదా రాజైన యెకోనయాను బందీగా తీసుకుపోయినప్పుడు యెకోనయాతోపాటు జెరుసలంనుంచి వెళ్ళిన బందీలలో ఈ మొర్‌దెకయి ఒకడు. 7 మొర్‌దెకయి పినతండ్రి కూతురైన హదస్సాకు తల్లిదండ్రులు లేరు గనుక అతడు ఆమెను పెంచుకొన్నాడు. హదస్సాకు ఎస్తేరు అనే మరో పేరు ఉంది. ఆమె రూపవతి, అందకత్తె. ఆమె తల్లిదండ్రులు చనిపోయిన తరువాత మొర్‌దెకయి ఆమెను తన కూతురుగా తన ఇంట్లో చేర్చాడు.
8 చక్రవర్తి ఆజ్ఞ నిర్ణయం ప్రకటించడం జరిగినప్పుడు చాలామంది యువతులను షూషన్ రాజధానికి తీసుకువచ్చి హేగే అధీనంలో ఉంచడం జరిగింది. వాళ్ళు ఎస్తేరును కూడా చక్రవర్తి నగరుకు తీసుకువచ్చి, స్త్రీల వ్యవహారాలను చూచుకొనే ఈ హేగే అధీనంలో ఉంచారు. 9 ఆమె అంటే అతనికి ఇష్టమైంది గనుక అతడు ఆమెమీద దయ చూపాడు. వెంటనే అతడు కావలసిన పరిమళ ద్రవ్యాలనూ భోజనపదార్థాలను ఆమెకు ఇచ్చాడు, రాజభవనంలో నుంచి ఆమెకు ఏడుగురు పరిచారికలను ఏర్పాటు చేశాడు, ఆమెను, ఆమె పరిచారికలను అంతఃపురంలో ఉన్న స్థలాలన్నిటిలో మంచి స్థలంలో ఉంచాడు. 10 ఎస్తేరు తన జాతినీ కుటుంబాన్నీ తెలియజేయలేదు. అంతకుముందు మొర్‌దెకయి, “తెలియ జేయకూడదు” అని ఆదేశించాడు. 11 ఎస్తేరు ఎలా ఉన్నదో, ఆమెకు ఏమి సంభవిస్తూ ఉన్నదో తెలుసుకోవడానికి మొర్‌దెకయి ప్రతిరోజూ అంతఃపురం ఆవరణం దగ్గర పచార్లు చేస్తూ వచ్చాడు.
12 స్త్రీలకు అందాన్ని హెచ్చించే నియమిత పరిమళ ద్రవ్యాలు పన్నెండు నెలలు వినియోగించిన తరువాతే అహష్‌వేరోషు చక్రవర్తి దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క అమ్మాయికి వంతు వచ్చేది. వారు ఆరు నెలలు గోపరసతైలం, ఆరు నెలలు వేరు వేరు పరిమళ ద్రవ్యాలు వినియోగించవలసి వచ్చేది. 13 అమ్మాయి అంతఃపురంనుంచి చక్రవర్తి దగ్గరికి వెళ్ళవలసిన సమయంలో రాజ భవనానికి తీసుకుపోవడానికి ఆమెకు ఏది ఇష్టమో అది ఇచ్చేవారు. 14 సాయంకాలం ఆమె రాజభవనంలోకి వెళ్ళి, మరుసటి ఉదయం అంతఃపురంలో రెండో భాగానికి తిరిగి వచ్చింది. ఆ భాగం ఉంపుడుకత్తెలను పదిలం చేయడానికి చక్రవర్తి నియమించిన నపుంసకుడైన షయష్‌గజ్ అధీనంలో ఉంది. ఆమె అంటే చక్రవర్తికి ఇష్టం ఉంటే, అతడు ఆమెను పేరుతో పిలిస్తే ఆమె మళ్ళీ అతనిదగ్గరికి వెళ్ళేది. లేకపోతే ఆమె వెళ్ళేది కాదు.
15 మొర్‌దెకయి తన కూతురుగా పెంచుకొన్న అమ్మాయీ, మొర్‌దెకయి పినతండ్రి అబీహాయిల్ కూతురూ అయిన ఎస్తేరు చక్రవర్తి దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. అప్పుడు, స్త్రీలను పదిలం చేయడానికి చక్రవర్తి నియమించిన నపుంసకుడైన హేగే చెప్పిన అలంకారం తప్ప ఎస్తేరు మరి దేనినీ కోరలేదు. ఎస్తేరును చూచినవాళ్ళంతా మెచ్చుకొన్నారు. 16 అహష్‌వేరోషు చక్రవర్తి పరిపాలించిన ఏడో ఏట టెబేత్ అనే పదో నెలలో ఎస్తేరు రాజభవనంలోకి అతని దగ్గరికి వెళ్ళింది. 17 చక్రవర్తి స్త్రీలందరిలో ఎస్తేరును ఎక్కువ ప్రేమించాడు. ఇతర కన్యలకంటే ఆమె ఎక్కువగా అతని ఆమోదాన్ని, అభిమానాన్ని చూరగొన్నది. కనుక అతడు ఆమె తలమీద రాజ్యకిరీటం ఉంచి, వష్తికి బదులుగా ఆమెను రాణిగా చేశాడు. 18 అప్పుడు చక్రవర్తి తన నాయకులందరికీ పరివారమంతటికీ గొప్ప విందు – ‘ఎస్తేరు విందు’ – చేయించాడు. ప్రదేశాలన్నిటిలో సెలవు రోజు ప్రకటించి, చక్రవర్తి హోదాకు అనుగుణంగా బహుమతులు ఇప్పించాడు.
19  రెండో సారి కన్యలను సమకూర్చడం జరిగినప్పుడు మొర్‌దెకయి చక్రవర్తి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. 20  అతడు ఆమెను పెంచుతూ ఉన్నప్పుడు ఎస్తేరు అతని మాట విన్నట్టే ఇప్పుడూ వింటూ ఉంది. గనుక అతడు తనకు ఆదేశించిన ప్రకారం ఆమె తన జాతిని గానీ కుటుంబాన్ని గానీ ఇంకా తెలియజేయలేదు. 21 ఆ రోజుల్లో, చక్రవర్తి ద్వారం దగ్గర మొర్‌దెకయి కూర్చుని ఉన్నప్పుడు, చక్రవర్తి ఆ ద్వారానికి కాపలాదారులుగా నియమించిన ఇద్దరు నపుంసకులు అహష్‌వేరోషు చక్రవర్తిమీద కోపగించి అతణ్ణి చంపడానికి కుట్ర పన్నారు. వాళ్ళ పేర్లు బిగ్తాన్, తెరెష్. 22 ఈ సంగతి మొర్‌దెకయికి తెలియవచ్చింది. అతడు అది ఎస్తేరురాణికి తెలియజేశాడు. ఎస్తేరు మొర్‌దెకయి పేర చక్రవర్తికి తెలియజేసింది. 23 ఈ సంగతి గురించి విచారణ జరిగినప్పుడు అది నిజమని తెలిసింది గనుక ఆ ఇద్దరు ద్వారపాలకులను ఉరికొయ్యకు ఉరి తీశారు. ఇది చక్రవర్తి సమక్షంలోనే చరిత్ర విశేషాల గ్రంథంలో వ్రాయడం జరిగింది.