ఎస్తేరు
1
1 ✽ ఇవి అహష్‌వేరోషు రోజుల్లో జరిగిన సంఘటనలు. ఈ అహష్‌వేరోష్ ఇండియా నుంచి కూషు✽ దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలను పరిపాలించేవాడు. 2 ఆ కాలంలో అహష్‌వేరోషు చక్రవర్తి షూషన్✽ అనే రాజధానిలో రాజ్యపరిపాలన చేసేవాడు. 3 తన పరిపాలనలో మూడో సంవత్సరంలో తన నాయకులందరికీ పరివారమంతటికీ విందు చేయించాడు. పారసీక, మాదీయ✽ దేశాల సైన్యాధిపతులూ ఆ సంస్థానాల ప్రముఖులూ నాయకులూ హాజరయ్యారు. 4 అప్పుడు చక్రవర్తి తన సామ్రాజ్యం ఐశ్వర్యాన్నీ, వైభవాన్నీ, తమ ఘనతనూ మహారాజ తేజస్సునూ చాలాకాలం – నూట ఎనభై రోజులు – ప్రదర్శించాడు. 5 ఆ రోజులు గడిచిన తరువాత చక్రవర్తి షూషన్ రాజధానిలో ఉన్న ప్రజలందరికీ ఘనులకేమి అల్పులకేమీ రాజభవనం తోట ఆవరణంలో ఏడు రోజుల విందు చేయించాడు.6 తోటలో ఉన్న చలువరాతి స్తంభాలమీద వెండి కమ్ములు ఉన్నాయి. వాటికి తెల్లని తెరలు, ఊదారంగు గల తెరలు, తెలుపూ నీలిరంగూ కలిసిన అవిసెనారతో చేసిన త్రాళ్ళతో కట్టబడి వ్రేలాడుతూ ఉన్నాయి. వేరు వేరు రకాల చలువరాళ్ళు పరచిన నేలమీద వెండి బంగారాలతో చేసిన తల్పాలు ఉన్నాయి. 7 అక్కడ సమకూడినవారికి బంగారు పాత్రలతో ద్రాక్షరసం ఇచ్చారు. ఆ పాత్రలు ఒకదానికి ఒకటి వేరుగా ఉన్నాయి. చక్రవర్తి హోదాకు తగినట్టుగా ద్రాక్షరసం సమృద్ధిగా పోశారు. 8 అయితే త్రాగాలని ఎవరూ ఎవరినీ బలవంతం చేయకూడదని చక్రవర్తి తన భవనం సేవకులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరి ఇష్టం ప్రకారం వారికి పోయాలని ఆదేశించాడు. 9 అంతలో రాణి అయిన వష్తి కూడా అహష్‌వేరోషు చక్రవర్తి రాజభవనంలో స్త్రీలకు విందు చేయించింది.
10 ఏడో రోజున అహష్‌వేరోషు చక్రవర్తి ద్రాక్ష మద్యం త్రాగి సంబరపడుతూ ఉన్నప్పుడు, సమకూడిన ప్రజలకూ నాయకులకూ వష్తిరాణి అందాన్ని కనుపరచుదాం అనుకొన్నాడు. ఆమె చాలా అందకత్తె. 11 కనుక ఆమె కిరీటం ధరించుకొని తనదగ్గరికి రావాలని ఆమెను తీసుకురమ్మని తనకు సేవ చేసే ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞ జారీ చేశాడు. (వాళ్ళు మెహూమాన్, బిజ్తా, హర్‌బోనా, బిగ్తా, అబగ్తా, జేతర్, కర్కస్.) 12 ✽చక్రవర్తి ఆజ్ఞను వాళ్ళు వష్తిరాణికి తెలియచేసినప్పుడు ఆమె రావడానికి ఒప్పుకోలేదు. కనుక చక్రవర్తి తీవ్ర కోపంతో మండిపడ్డాడు.
13 ✽న్యాయ శాస్త్రాన్ని రాజ ధర్మాన్నీ తెలుసుకొన్న వారందరిచేత చక్రవర్తి ప్రతి సంగతినీ పరిష్కారం చేసుకొనేవాడు. 14 అలాంటివాళ్ళలో కరషెనా, షెతార్, అదమాతా, తర్షీష్, మెరస్, మరసెనా, మెమూకాన్ ఉన్నారు. ఈ ఏడుగురు పారసీక, మాదీయ దేశాల నాయకులు, సామ్రాజ్యంలో అందరికంటే ప్రముఖులై చక్రవర్తి సముఖంలోకి ప్రవేశం కలిగినవాళ్ళు.
15 చక్రవర్తి ఆ కాలజ్ఞానులను చూచి “అహష్‌వేరోషు చక్రవర్తి నపుంసకులచేత ఇప్పించిన ఆజ్ఞను వష్తిరాణి శిరసావహించలేదు. న్యాయశాస్త్ర ప్రకారం ఆమెకు ఏం చేయాలి?” అని అడిగాడు.
16 అందుకు మెమూకాన్ చక్రవర్తితోనూ నాయకులతోనూ ఇలా జవాబిచ్చాడు: “వష్తిరాణి అహష్‌వేరోషు చక్రవర్తిపట్ల మాత్రమే గాక, చక్రవర్తికి చెందిన అన్ని ప్రదేశాల నాయకులపట్లా ప్రజలందరిపట్లా కూడా తప్పిదం చేసినట్లయింది. 17 ఎలాగంటే, రాణి ప్రవర్తన విషయం స్త్రీలందరికీ వినబడుతుంది. అప్పుడు వాళ్ళు తమ భర్తలను చిన్నచూపు చూచి ‘అహష్‌వేరోషు చక్రవర్తి తన రాణి అయిన వష్తిని తన దగ్గరికి తీసుకురావాలని ఆజ్ఞ జారీ చేసినా ఆమె రాలేదు’ అంటారు. 18 ✽రాణి చేసినదాని గురించి విని పారసీక, మాదీయ నాయకుల భార్యలు కూడా నాయకులతో అలాగే మాట్లాడడం ఈ రోజే ప్రారంభిస్తారు. తద్వారా తృణీకారం, కోపం చాలా ఎక్కువవుతాయి. 19 కనుక చక్రవర్తికి ఇష్టమైతే, ఇకమీదట వష్తి అహష్‌వేరోషు చక్రవర్తి సన్నిధానంలోకి ఎన్నడూ రాకూడదని చక్రవర్తి ఆజ్ఞ జారీ చేయాలి. ఆ ఆజ్ఞ మార్చబడకుండా పారసీకుల, మాదీయుల శాసన గ్రంథంలో రాయాలి. అంతేగాక, వష్తి కంటే యోగ్యురాలిని రాణిగా చక్రవర్తి చేయాలి. 20 అప్పుడు చక్రవర్తి నిర్ణయం✽ తన మహా సామ్రాజ్యంలో అంతటా ప్రకటించడం జరిగితే ఘనురాలు గానీ, అల్పురాలు గానీ స్త్రీలందరూ✽ తమ భర్తలను గౌరవిస్తారు.”
21 ఈ సలహా చక్రవర్తికీ అతని నాయకులకూ నచ్చింది గనుక మెమూకాన్ చెప్పినట్టే చక్రవర్తి చేశాడు. 22 ప్రతి పురుషుడూ తన ఇంట్లో అధికారిగా ఉండాలని ఆజ్ఞ జారీ చేసి ప్రతి ప్రదేశానికీ దాని వ్రాతప్రకారం, ప్రతి జనానికీ దాని భాషలో సామ్రాజ్యం అంతటా తాకీదులు పంపించాడు.