6
1 ఆ రాత్రి చక్రవర్తికి నిద్ర పట్టలేదు. గనుక రాజ్య చరిత్ర గ్రంథం తెప్పించి తన సమక్షంలో చదివి వినిపించమని అతడు ఆజ్ఞ జారీ చేశాడు. 2 చక్రవర్తి నపుంసకులలో బిగ్తాన్, తెరష్ అనే ఇద్దరు ద్వారపాలకులు చక్రవర్తి అహష్‌వేరోషును చంపడానికి చూచిన సంగతిని మొర్‌దెకయి తెలియజేశాడని ఆ గ్రంథంలో వ్రాసి ఉంది.
3 ఆ సంగతి విని చక్రవర్తి “అలా చేసినందుచేత మొర్‌దెకయికి ఏం బహుమతి, ఏం ఘనత చేకూరాయి?” అని అడిగాడు. అతని సేవకులు “అతడికేమీ చేకూరలేదు” అని జవాబిచ్చారు.
4 అప్పుడు చక్రవర్తి “ఆ స్థానంలో ఎవరున్నారు?” అని అడిగాడు. అప్పుడే హామాను రాజభవనం బయటి ఆవరణంలో ప్రవేశించాడు. తాను చేయించిన ఉరికొయ్యమీద మొర్‌దెకయిని ఉరి తీయించడానికి అనుమతి ఇవ్వమని చక్రవర్తితో మనవి చేయడానికి వచ్చాడు. 5 చక్రవర్తి సేవకులు “చిత్తగించండి. హామాను ఆస్థానంలో నిలుచున్నాడు” అని అతనితో చెప్పారు. చక్రవర్తి “అతణ్ణి లోపలికి తీసుకురండి” అని ఆదేశించాడు.
6 హామాను లోపలికి వచ్చిన తరువాత చక్రవర్తి “చక్రవర్తి గౌరవిద్దామనుకొనేవాడికి ఏం చేయాలి?” అని అతణ్ణి అడిగాడు.
“నా కంటే ఎక్కువగా ఇంకెవరిని చక్రవర్తి గౌరవించాలను కుంటాడు?” అనుకొని హామాను చక్రవర్తితో ఇలా అన్నాడు: 7 “చక్రవర్తి గౌరవించాలనుకొనేవాడికి చేయవలసిన దేమిటంటే, 8 చక్రవర్తి ధరించుకొన్న రాజవస్త్రాలనూ, చక్రవర్తి ఎక్కిన గుర్రాన్నీ తెప్పించాలి. ఆ గుర్రం తలమీద రాజ్యాధికారాన్ని సూచించే తురాయి ఉండాలి. 9  ఆ వస్త్రాలనూ, గుర్రాన్నీ చక్రవర్తి అధిపతులలో మహా ఘనులలో ఒకడికి అప్పగించాలి. అప్పుడు, చక్రవర్తి గౌరవించాలనుకొనేవాడికి అతడు ఆ వస్త్రాలను తొడిగించి, ఆ గుర్రం మీద అతణ్ణి ఎక్కించి నగర వీధుల్లో అతణ్ణి నడిపించాలి. అతని ముందు నడుస్తూ చక్రవర్తి గౌరవించాలనుకొన్నవాడికి ఈ విధంగా చేయడం యుక్తమే! అని చాటించాలి.”
10 అందుకు చక్రవర్తి “నీవు చెప్పినట్టే త్వరగా వెళ్ళి, అలాంటి వస్త్రాలనూ గుర్రాన్నీ తీసుకువచ్చి, యూదుడైన మొర్‌దెకయికి అలా చెయ్యి, అతడు చక్రవర్తి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు గదా. నీవు చెప్పినదానిలో దేనినీ విడువక అంతా చెయ్యి” అని హామానుకు ఆజ్ఞ ఇచ్చాడు.
11 అలాగే హామాను అలాంటి వస్త్రాలనూ గుర్రాన్నీ తెచ్చి, మొర్‌దెకయికి ఆ వస్త్రాలను తొడిగించి, గుర్రం మీద అతణ్ణి ఎక్కించి, నగర వీధుల్లో అతణ్ణి నడిపించాడు. అతని ముందు నడుస్తూ “చక్రవర్తి గౌరవించాలనుకొన్నవాడికి ఈ విధంగా చేయడం యుక్తమే” అని చాటించాడు. 12 ఆ తరువాత మొర్‌దెకయి చక్రవర్తి ద్వారం దగ్గరికి తిరిగి వచ్చాడు. అయితే హామాను తల కప్పుకొని దుఃఖంతో ఇంటికి త్వరగా వెళ్ళాడు. 13 తనకు సంభవించినదంతా తన భార్య జెరెష్‌కూ తన మిత్రులందరికీ తెలియజేశాడు. అతడిదగ్గర ఉన్న జ్ఞానులు, అతడి భార్య జెరెష్ “మీకు మొర్‌దెకయిచేత పతనం కలగడం ఆరంభమైంది. అతడు యూదుల జాతికి చెందినవాడైతే అతడి మీద మీరు జయం సాధించలేరు. అతడిచేత తప్పనిసరిగా పడిపోతారు” అని అతడితో చెప్పారు. 14 వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే చక్రవర్తి నపుంసకులు వచ్చి, ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామానును త్వరపెట్టారు.