12
1 షయల్‌తీయేల్ కొడుకు జెరుబ్బాబెల్ తో, యేషూవతో కూడా వచ్చిన యాజులూ లేవీ గోత్రికులూ వీరు: శెరాయా, యిర్మీయా, ఎజ్రా 2 అమరయా, మళ్ళూకు, హట్టుషు, 3 షెకనయా, రెహూ, మెరేమోతు, 4 ఇద్దో, గిన్నెతోను, అబీయా, 5 మీయామీను, మయదయా, బిల్గా, 6 షెమయా, యోయారీబ్, యెదాయా, 7 సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా. యేషూవ రోజులలో వారు యాజులలో, వారి బంధువులలో నాయకులు.
8 లేవీగోత్రికులు వీరు: యేషూవ, బిన్నూయి, కద్‌మీయేల్, షేరేబ్యా, యూదా, మత్తనయా (మత్తనయా అతని బంధువులతోకూడా కృతజ్ఞతా సంకీర్తన కార్యక్రమం జరిగించేవాడు). 9 వారి బంధువులు బక్‌బుకయా, ఉన్నీ ఆరాధన సభలలో వారికి ఎదురుగా నిలబడేవారు. 10 యేషూవకు యోయాకీం జన్మించాడు, యోయాకీంకు ఎల్‌యాషీబు జన్మించాడు, ఎల్‌యాషీబుకు యోయాదా జన్మించాడు. 11 యోయాదాకు యోనాతాను జన్మించాడు. యోనాతానుకు యద్దూవ జన్మించాడు.
12 యోయాకీం రోజుల్లో పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న యాజులెవరంటే, శెరాయా కుటుంబానికి మెరాయా; యిర్మీయా కుటుంబానికి హననయా; 13 ఎజ్రా కుటుంబానికి మెషుల్లాం; అమరయా కుటుంబానికి యెహోహానాను; 14 మళ్ళూకు కుటుంబానికి యోనాతాను; షెబన్యా కుటుంబానికి యోసేపు; 15 హారిం కుటుంబానికి అద్నా; మెరాయోతు కుటుంబానికి హెల్కయి; 16 ఇద్దో కుటుంబానికి జెకర్యా; గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాం; 17 అబీయా కుటుంబానికి జిక్రీ; మిన్‌యామీను కుటుంబానికీ మోపదయా కుటుంబానికి పిల్‌టయి; 18 బిల్గా కుటుంబానికి షమ్మూయ; షెమయా కుటుంబానికి యెహోనాతాను; 19 యోయారీబు కుటుంబానికి మత్తెనయి; యెదాయాల కుటుంబానికి ఉజ్జీ; 20 సల్లయి కుటుంబానికి కల్లయి; ఆమోకు కుటుంబానికి ఏబెరు; 21 హిల్కీయా కుటుంబానికి హషబ్యా; యెదాయా కుటుంబానికి నెతనేల్.
22 ఎల్‌యాషీబు, యోయాదా, యోహానాను, యద్దూవ రోజుల్లో లేవీగోత్రికుల కుటుంబాల నాయకుల పేర్లూ, యాజుల పేర్లూ పారసీకదేశంవాడైన దర్యావేషు పరిపాలన కాలంలో నమోదయ్యాయి. 23 ఎల్‌యాషీబు కొడుకు యోహానాను రోజులవరకు లేవీ కుటుంబాల నాయకుల పేర్లు ‘విషయాల గ్రంథం’లో నమోదయ్యాయి. 24 లేవీగోత్రికుల నాయకులు వీరు: హషబ్యా, షేరేబ్యా, కద్‌మీయేల్ కొడుకు యేషూవ. దేవుని మనిషి అయిన దావీదు ఆదేశించినట్లు, వారూ, వారికి ఎదురుగా నిలబడే వారి సాటివారూ వంతుల ప్రకారం కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి నియమించబడ్డారు. 25 మత్తనయా, బక్‌బుకయా, ఓబద్యా, మెషుల్లాం, టల్‌మోను, అక్కూబ్ ద్వారపాలకులు, ద్వారాల దగ్గరఉన్న గిడ్డంగులకు కాపలాదారులు. 26 వారు యోజాదాక్ మనుమడూ యేషూవ కొడుకు అయిన యోయాకీం రోజుల్లో, అధిపతి అయిన నెహెమ్యా రోజుల్లో, యాజీ ధర్మశాస్త్రీ అయిన ఎజ్రా రోజుల్లో సేవ చేసేవారు.
27 జెరుసలం ప్రాకారాన్ని ప్రతిష్ఠించడం జరిగినప్పుడు, లేవీగోత్రికులు ఆ ప్రతిష్ఠాచారాన్ని కృతజ్ఞతా కీర్తనలతో, పాటలతో, చేతాళాలతో, వేరు వేరు తంతివాద్యాలతో సంతోషంగా జరిగించాలని వారు ఉంటున్న ప్రతి స్థలంనుంచీ జెరుసలంకు వారిని రప్పించడం జరిగింది. 28 గాయకులను జెరుసలం చుట్టూరా ఉన్న ప్రాంతం నుంచి, నెటోపాతి వాళ్ళ గ్రామలనుంచి, 29 బేత్‌గిల్గాల్ నుంచి, గెబ, అజ్‌మావెతు చుట్టూఉన్న ప్రాంతాలనుంచి సమకూర్చడం జరిగింది. (గాయకులు తమకోసం ఊళ్ళను జెరుసలం పరిసరాలలో కట్టేవారు.) 30  యాజులూ లేవీగోత్రికులూ తమను శుద్ధి చేసుకొన్న తరువాత ప్రజలనూ ద్వారాలనూ గోడనూ శుద్ధి చేశారు.
31 ఆ తరువాత యూదావారి నాయకులను గోడమీదికి ఎక్కేలా నేను చేశాను. స్తుతిపాటలు పాడేవారిని రెండు పెద్ద గుంపులుగా చేశాను. ఒక గుంపువారు కుడి ప్రక్కను ‘పెంట’ ద్వారం వైపుకు గోడమీద నడిచారు. 32 హోషయా, యూదావారి నాయకులలో సగంమంది వారిని వెంబడించారు. 33 వీరు కూడా వారి వెంబడి వెళ్ళారు. అజరయా, ఎజ్రా, మెషుల్లాం, 34 యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా, 35 యాజులలో బూరలను చేతపట్టుకొని ఉన్న కొంతమంది, షెమయా మనుమడూ యోనాతాన్ కొడుకూ అయిన జెకర్యా (షెమయా మత్తనయా కొడుకు, మత్తనయా మీకాయా కొడుకు, మీకాయా జక్కూరు కొడుకు, జక్కూరు ఆసాపు కొడుకు), 36 అతని బంధువులు షెమయా, అజరేల్, మిలలయి, గిలలయి, మయ్యి, నేతనేల్, యూదా, హనానీ. దేవుని మనిషి అయిన దావీదు నియమించిన వాద్యాలను వాయిస్తూ వారు సాగారు. వారి ముందర ఎజ్రా ధర్మశాస్త్రి నడిచాడు. 37 వారు ‘ఊట’ ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు, దావీదు నగరానికి పోయే మెట్ల మీద దావీదు భవనాన్ని దాటి, తూర్పుగా ఉన్న ‘నీళ్ళ’ ద్వారం వరకు గోడ వెంబడి నడిచివెళ్ళారు.
38 స్తుతిపాటలు పాడేవారి రెండో గుంపు ఎడమ వైపు నడచిపోయింది. వారి వెంబడి నేనూ, గోడమీద ఉన్న వారిలో సగంమందీ వెళ్ళాం. మేము అగ్నిగుండాల గోపురాన్ని దాటి వెడల్పు గోడవరకు వెళ్ళాం. 39 ఆ గుంపువారు ‘ఎఫ్రాయిం’ ద్వారం మీదుగా వెళ్ళి, పాత ద్వారాన్ని, ‘చేపల’ ద్వారాన్ని, హనన్యేల్ గోపురాన్ని, శత గోపురాన్ని దాటిపోయి, ‘గొర్రెల’ ద్వారం వరకు వెళ్ళి, ‘కావలి’ ద్వారం దగ్గర ఆగిపోయారు.
40 అప్పుడు, స్తుతిపాటలు పాడేవారి రెండు గుంపులూ, నేనూ, నాతో కూడా అధికారులలో సగంమంది దేవుని ఆలయానికి చేరి నిలిచాం. 41 యాజులు కూడా అక్కడ ఉన్నారు. ఎల్‌యాకీం, మయశేయా, మిన్‌యామీను, మీకాయా, ఎల్‌యోయేనయి, జెకర్యా, హననయా బూరలు చేత పట్టుకొని ఉన్నారు. 42 మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాం, ఏజెరు కూడా అక్కడ ఉన్నారు. ఇజ్రహయా నడిపిస్తూఉంటే గాయకులు పాడారు. 43  ఆ రోజు దేవుడు వారికి మహానందం కలిగించాడు గనుక వారు మహా యజ్ఞాలను సమర్పించి సంతోషించారు. స్త్రీలూ పిల్లలూ కూడా సంతోషించారు. జెరుసలంలో పుట్టిన ఆనంద ధ్వనులు చాలా దూరానికి వినబడ్డాయి.
44 ఆ కాలంలో, ప్రజలు ఇచ్చే పదార్థాలనూ ప్రథమ ఫలాలనూ పదో భాగాలనూ కూడబెట్టిన గిడ్డంగులమీద కొందరిని నియమించడం జరిగింది. ధర్మశాస్త్రం యాజులకోసం, లేవీగోత్రికులకోసం నిర్ణయించిన భాగాలను ఊళ్ళచుట్టు ఉన్న పొలాలనుంచి ఆ గిడ్డంగులకు తేవడానికి వారు నియమితమైన వారు. సేవ చేసే యాజులూ లేవీగోత్రికులూ అంటే యూదావారికి సంతోషమే. 45 దావీదు, అతని కొడుకు సొలొమోను ఆదేశించినట్లు వారు, గాయకులు ద్వారపాలకులతోపాటు, తమ దేవునికి సేవ చేస్తూ, శుద్ధి ఆచారాన్ని పాటిస్తూ ఉండేవారు. 46 చాలాకాలం క్రిందట దావీదు, ఆసాపు రోజుల్లో గాయకులను స్తుతిపాటల విషయం, దైవసంకీర్తనం విషయం నడిపించేవారు ఉన్నారు. 47 జెరుబ్బాబెల్ కాలంలో, నెహెమ్యా కాలంలో, ఇస్రాయేల్ వారందరూ గాయకులకూ ద్వారపాలకులకూ ప్రతిరోజూ ఇవ్వవలసిన భోజన పదార్థాలను ఇస్తూ వచ్చారు. లేవీ గోత్రికులకోసం కూడా ఒక భాగాన్ని ప్రత్యేకించారు. లేవీగోత్రికులు అహరోను వంశంవారికి ఒక భాగాన్ని ప్రత్యేకించారు.