13
1 ఆ రోజున వారు మోషే గ్రంథం ప్రజలకు చదివి వినిపించారు. అమ్మోనువాళ్ళలో గానీ మోయాబు వాళ్ళలో✽ గానీ ఎవ్వరూ దేవుని సమాజంలో ఎన్నటికీ ప్రవేశించకూడదని అందులో వ్రాసి ఉన్నట్టు కనబడింది. 2 ఎందుకంటే వాళ్ళు అన్నపానాలతో✽ ఇస్రాయేల్ ప్రజలకు ఎదురురాలేదు గాని, వారిని శపించడానికి బిలామును బాడుగకు తీసుకొన్నారు. (అయినా మన దేవుడు ఆ శాపాన్ని దీవెనగా✽ మార్చాడు.) 3 ✽ఈ ఉపదేశం విన్నప్పుడు ప్రజలు విదేశీయులందరినీ ఇస్రాయేల్ ప్రజలలో నుంచి వెలివేశారు.4 ✽ఇంతకుముందు, మన దేవుని ఆలయానికి చెందిన గిడ్డంగులమీద ఎల్‌యాషీబుయాజిని నియమించడం జరిగింది. అతడికి టోబీయాతో సంబంధం ఉంది. 5 అతడు టోబీయాకు పెద్ద గది ఒకదానిని సిద్ధం చేశాడు. మునుపు ఆ గదిలో నైవేద్యాలను, ధూపద్రవ్యాన్ని, పాత్రలను లేవీగోత్రికులకూ గాయకులకూ ద్వారపాలకులకూ నియమించబడ్డ ధాన్యంలో క్రొత్త ద్రాక్షరసంలో నూనెలో పదో భాగాలను, యాజులకు తెచ్చిన అర్పణలను కూడబెట్టారు. 6 ✝ఆ సమయంలో నేను జెరుసలంలో లేను. బబులోను✽ దేశానికి చక్రవర్తిగా ఉన్న అర్తహషస్త పరిపాలించిన ముప్ఫయి రెండో సంవత్సరంలో నేను అతని దగ్గరికి తిరిగి వెళ్ళాను. కొన్ని రోజుల తరువాత చక్రవర్తి దగ్గర సెలవు తీసుకొని జెరుసలంకు తిరిగి వచ్చాను. 7 ఎల్‌యాషీబు దేవుని ఆలయ ఆవరణంలో టోబీయాకు ఒక గది ఇవ్వడంద్వారా చేసిన కీడు అప్పుడు నాకు తెలియవచ్చింది. 8 ✽అది నాకు చాలా అసహ్యమనిపించింది. నేను ఆ గదిలోనుంచి టోబీయా సామానంతా అవతల పారవేశాను. 9 ✽గదులను శుద్ధి చేయాలని ఆజ్ఞ జారీ చేశాను. వారు అలా చేసిన తరువాత దేవాలయం పాత్రలను, నైవేద్యాలను, ధూపద్రవ్యాన్ని తెప్పించి అక్కడ మళ్ళీ ఉంచాను.
10 ✽లేవీగోత్రికులకు రావలసిన పాళ్ళు వారికి ఇవ్వడం జరగలేదని కూడా నాకు తెలియవచ్చింది. ఆలయం సేవ చేయవలసిన లేవీగోత్రికులూ గాయకులూ తమ పొలాలకు తిరిగి వెళ్ళి ఉన్నారు. 11 కనుక నేను అధిపతులను మందలించి, “దేవుని ఆలయాన్ని అలక్ష్యం చేయడం ఎందుకు జరుగుతూ ఉంది?” అని అడిగాను. అప్పుడు వారిని మళ్ళీ సమకూర్చి వారి స్థలాలలో ఉంచాను. 12 ✽ఆ తరువాత యూదావారంతా ధాన్యం, ద్రాక్షరసం, నూనెలో పదో భాగాన్ని గిడ్డంగులకు తెచ్చారు. 13 నేను గిడ్డంగులమీద షెలెమయాయాజిని, సాదోకు అనే ధర్మశాస్త్రిని, లేవీగోత్రికుడైన పెదాయాను నియమించాను. మత్తనయా మనుమడూ జక్కూరు కొడుకూ అయిన హానానును వారికి సహాయుడుగా నియమించాను. వారు నమ్మకమైనవారని✽ పేరు పొందినవారు. తమ సహోద్యోగులకు భోజన పదార్థాలను పంచి పెట్టడం వారి బాధ్యత. 14 ✝నా దేవా, దీనిని బట్టి నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవుని ఆలయంకోసం, దాని సేవకోసం నేను భక్తితో చేసిన దానిని తుడిచివెయ్యకు.
15 ఆ రోజుల్లో, యూదాలో కొంతమంది విశ్రాంతి దినాన✽ ద్రాక్షగానుగ తొట్లను త్రొక్కడం, ధాన్యాన్ని తెచ్చి గాడిదలమీద మోపడం, ద్రాక్షరసం, ద్రాక్షపండ్లు, అంజూరుపండ్లు, వేరు వేరు బరువులను గాడిదలమీద మోపడం నాకు కనిపించింది. విశ్రాంతి దినాన వారు వాటిని జెరుసలంలోకి తీసుకువచ్చారు. ఆహార వస్తువులను విశ్రాంతి దినాన అలా అమ్మిన వాళ్ళను నేను గద్దించాను. 16 జెరుసలంలో నివసించే తూరు నగరవాసులు చేపలూ అన్ని రకాల సరుకులూ జెరుసలంకు తెచ్చి విశ్రాంతి దినాన యూదావారికి అమ్ముతూ ఉండేవారు.
17 యూదావారి నాయకులను నేను మందలించి✽ ఇలా అన్నాను: “విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి మీరెందుకు ఈ చెడుగు చేస్తున్నారు? 18 మీ పూర్వీకులు ఇలా చేసి, మనమీదికీ ఈ నగరంమీదికీ మన దేవుడు విపత్తును రప్పించేలా చేయలేదా? మీరు కూడా విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి, ఇంకా ఎక్కువ కోపానికి✽ ఇస్రాయేల్ ప్రజలను గురి చేస్తున్నారు.”
19 విశ్రాంతి దినానికి ముందు చీకటి పడుతూ✽ ఉన్నప్పుడు జెరుసలం ద్వారం తలుపులు మూసివేయాలనీ, విశ్రాంతి దినం గడిచేదాకా వాటిని తెరవకూడదని నేను ఆజ్ఞ జారీ చేశాను✽. అంతేగాక, విశ్రాంతి దినాన ఏ బరువూ లోపలికి రాకుండా ద్వారాలదగ్గర నా మనుషులలో కొంతమందిని కావలి ఉంచాను. 20 ఒకటి రెండు సారులు, వర్తకులూ వేరు వేరు రకాల సరుకులను అమ్మేవాళ్ళూ జెరుసలం బయట రాత్రి గడిపారు. 21 నేను వాళ్ళను హెచ్చరించి “మీరు గోడదగ్గర ఎందుకు రాత్రి గడిపారు? మీరు ఇంకోసారి ఇలా చేశారా, మిమ్మల్ని పట్టుకొంటాను” అని చెప్పాను. విశ్రాంతి దినాన వాళ్ళు మళ్ళీ రాలేదు. 22 అప్పుడు, తమను శుద్ధి చేసుకొని✽, విశ్రాంతి దినాన్ని పవిత్ర దినంగా ఆచరించేలా వచ్చి, ద్వారాలను చూచుకోవాలని లేవీగోత్రికులకు నేను అజ్ఞ జారీ చేశాను. నా దేవా, దీన్నిబట్టి కూడా నన్ను జ్ఞాపకముంచుకొని✽ నీ మహా కృప ప్రకారం నా మీద జాలి చూపు.
23 ✝ఆ రోజుల్లో నాకు కనిపించినదేమిటంటే, యూదావారు కొంతమంది అష్డోదు పట్టణం నుంచీ, అమ్మోను, మోయాబులనుంచి వచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకొని ఉన్నారు. 24 ✽వారి సంతానంలో సగంమంది అష్డోదువాళ్ళ భాష గానీ ఇతర జనాల భాషలు గానీ మాట్లాడేవారు. యూదా ప్రజల భాష మాత్రం వారికి వచ్చేది కాదు. 25 ✽ నేను వారితో వాదించి, వారిని నిందించి, కొంతమందిని కొట్టి, వారి తలవెంట్రుకలను పీకివేసి, వారి చేత దేవుని పేర ప్రమాణం చేయించి, ఇలా అన్నాను:
“మీరు మీ కూతుళ్లను వాళ్ళ కొడుకులకు ఇయ్యకూడదు. మీ కొడుకులకు గానీ మీకు గానీ వాళ్ళ కూతుళ్ళను తీసుకోకూడదు. 26 ✝ఈ విషయంలో ఇస్రాయేల్ ప్రజల రాజు సొలొమోను పాపం చేయలేదా? అనేక జనాలు ఉన్నా, వారందరిలోనూ అతనిలాంటి రాజు లేడు. అతడు తన దేవుని ప్రేమ చూరగొనేవాడు. దేవుడు అతణ్ణి ఇస్రాయేల్ ప్రజలందరిమీదా రాజుగా చేశాడు. అయినా పరాయి స్త్రీలు అతనిచేత కూడా పాపం చేయించారు గదా. 27 ✽మీరు పరాయి స్త్రీలను పెండ్లాడి ఇంత ఘోర పాపం చేసి, మన దేవునికి ద్రోహం చేస్తూ ఉన్నట్టు మేము వినాలా, ఏమిటి!”
28 ✽ప్రముఖ యాజి అయిన ఏల్‌యాషీబు కొడుకు యోయాదా కొడుకులలో ఒకడు హోరోను నివాసి సన్‌బల్లట్‌కు అల్లుడయ్యాడు. కనుక నేను అతణ్ణి నా దగ్గరనుంచి వెళ్ళగొట్టాను. 29 ✽నా దేవా, వాళ్ళు యాజి పదవిని, యాజుల, లేవీగోత్రికుల ఒడంబడికను అపవిత్రం చేశారు, గనుక వాళ్ళను జ్ఞాపకముంచుకో.