11
1 ప్రజల నాయకులు జెరుసలంలో నివాసం చేశారు. మిగిలిన ప్రజలు పవిత్ర నగరమైన జెరుసలంలో ప్రతి పదిమందిలో ఒకడు నివాసం చేయాలని తక్కిన తొమ్మిదిమంది వేరు వేరు ఊళ్ళలో ఉండిపోవాలనీ చీట్లు వేశారు. 2 జెరుసలంలో నివసించడానికి మనసారా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు. 3 ఇస్రాయేల్ ప్రజలలో, యాజులలో, లేవీ గోత్రికులలో, దేవాలయ సేవకులలో, సొలొమోను సేవకుల సంతానంలో కొంతమంది యూదా ఊళ్ళలో ఎవరి వాటాలో వారు నివాసం చేశారు. 4 యూదావారిలో, బెన్‌యామీనువారిలో మరికొందరు జెరుసలంలో నివాసం చేశారు. జెరుసలంలో కాపురం ఏర్పరచుకొన్న ప్రాంతీయ నాయకులు వీరు: యూదా వంశంలో జెకర్యా మనుమడూ ఉజ్జీయా కొడుకూ అయిన అతాయా (జెకర్యా తండ్రి అమరయా, అమరయా తండ్రి షెపటయా. షెపటయా తండ్రి మహలలేల్. మహలలేల్ పెరెసు సంతతివారిలో ఒకడు). 5 కొల్‌హోజె మనుమడూ బారుకు కొడుకూ అయిన మయశేయా (కొల్‌హోజె తండ్రి హజాయా. హజాయా తండ్రి అదాయా. అదాయా తండ్రి యోయారీబ్. యోయారీబ్ తండ్రి జెకర్యా. జెకర్యా షెలా సంతతివారిలో ఒకడు.)
6 జెరుసలంలో నివాసం చేసిన పెరెసు వంశం వారందరూ నాలుగు వందల అరవై ఎనిమిదిమంది. వారు పరాక్రమశాలురు. 7 బెన్యామీను వంశంలో వీరు ఉన్నారు: యోవేదు మనుమడూ మెషుల్లాం కొడుకూ అయిన సల్లు (యోవేదు పెదాయూ కొడుకు, పెదాయా కోలాయా కొడుకు, కోలాయా మయశేయా కొడుకు, మయశేయా ఈతీయేల్ కొడుకు, ఈతీయేల్ యెషయా కొడుకు); 8 అతని అనుచరులు గబ్బయి, సల్లయి, ఆ వంశం వారందరూ తొమ్మిదివందల ఇరవై ఎనిమిది మంది. 9 జిక్రీ కొడుకు యోవేల్ వారికి అధికారిగా ఉన్నాడు. హాసెనూయా కొడుకు యూదా నగరం మీద రెండో అధికారిగా ఉన్నాడు.
10 యాజులలో వీరు ఉన్నారు: యోయారీబ్ కొడుకు యెదాయా, యాకీను, 11 దేవాలయానికి అధికారిగా ఉన్న శెరాయా. (శెరాయా మెషుల్లాం కొడుకు, మెషుల్లాం సాదోకు కొడుకు, సాదోకు మెరాయోతు కొడుకు, మెరాయోతు అహీటూబ్ కొడుకు.) 12 వారి బంధువులు ఆలయం పనిచేసినవారు. వారు ఎనిమిది వందల ఇరవై ఇద్దరు; పెలలయా మనుమడూ యెరోహాం కొడుకూ అయిన అదాయా (పెలలయా అమ్జీ కొడుకు, అమ్జీ జెకర్యా కొడుకు, జెకర్యా పషూరు కొడుకు, పషూరు మల్కీయా కొడుకు); 13 కుటుంబ నాయకులుగా ఉన్న అతని బంధువులు రెండు వందల నలభై ఇద్దరు; అహజయి మనుమడూ అజరేల్ కొడుకూ అయిన అమష్షయి (అహజయి మెషిల్లేమోతు కొడుకు, మెషిల్లేమోతు ఇమ్మేరు కొడుకు), 14 అతని బంధువులు నూట ఇరవై ఎనిమిది మంది. వారు బలాఢ్యులైన పరాక్రమశాలురు. వారికి అధికారి హగదోలీం కొడుకు జబ్‌దీయేల్.
15 లేవీగోత్రికులలో వీరు ఉన్నారు: అజ్రీకాం మనుమడూ హష్షూబ్ కొడుకూ అయిన షెమయా (అజ్రీకాం హషబయా కొడుకు, హషబయా బున్నీ కొడుకు); 16 లేవీగోత్రికులలో ఇద్దరు నాయకులు షబ్బెతయి, యోజాబాదు (వారు దేవాలయం బయటి పనులను పై విచారణ చేసే అధికారులు); 17 ఆసాపుకు పుట్టిన జబ్ది మనుమడూ, మీకా కొడుకూ అయిన మత్తనయా (ప్రార్థన, స్తుతి సభలలో నాయకుడుగా ఉండేవాడు); తన బంధువులలో రెండోవాడు బక్‌బుకయా; యెదూతూనుకు పుట్టిన గాలాల్ మనుమడూ షమ్మూయ కొడుకూ అయిన అబ్దా. 18 పవిత్ర నగరంలో ఉన్న లేవీగోత్రికులందరూ రెండు వందల ఎనభై నలుగురు.
19 వీరు ద్వారపాలకులు: అక్కూబ్, టల్‌మోను, వారి సాటివారు నూట డెబ్భయి ఇద్దరు. వారు ద్వారాల దగ్గర కాపలాదారులు.
20 ఇస్రాయేల్ ప్రజలలో, యాజులలో లేవీగోత్రికులలో మిగతా వారు యూదా ఊళ్ళలో ఎవరి వాటాలో వారు నివాసం చేశారు. 21 దేవాలయ సేవకులు ఓపెల్ కొండమీద నివసించారు. వారికి జీహా, గిష్పా నాయకులు. 22 జెరుసలంలో ఉన్న లేవీగోత్రికులకు హషబ్యా మనుమడూ బానీ కొడుకూ అయిన ఉజ్జీ అధికారిగా ఉన్నాడు (హషబ్యా మత్తనయా కొడుకు, మత్తనయా మీకా కొడుకు). దేవుని ఆలయం సేవకోసం బాధ్యత వహించిన ఆసాపు సంతతివారిలో ఉజ్జీ ఒకడు. ఆసాపు సంతతి వారు గాయకులు. 23 గాయకులు ప్రతిరోజూ వంతుల ప్రకారం స్థిరంగా కార్యక్రమం జరపాలని మునుపు రాజు ఆదేశించాడు. 24 యూదా కొడుకు జెరహు వంశంవాడైన మెషెజబేల్ కొడుకైన పెతహాయా ప్రజలను గురించిన అన్ని విషయాలలో చక్రవర్తికి సలహాదారుడు.
25 గ్రామాలు, వాటి పొలాల సంగతి చూస్తే, యూదా వారిలో కొంతమంది కిర్యత్ అర్బాలో దాని పల్లెటూళ్ళలో, దీబోనులో దాని పల్లెటూళ్ళలో, యెకబ్‌సేల్‌లో దాని పల్లెటూళ్ళలో, 26 యేషూవలో, మొలాదాలో, బేత్ పెలెతులో, 27 హజర్‌షవల్‌లో, బేర్‌షెబాలో దాని పల్లెటూళ్ళలో, 28 సిక్లగులో, మెకోనా దాని పల్లెటూళ్ళలో, 29 ఎన్‌రిమ్మోనులో, జొరయాలో, యర్మూతులో, 30 జానోహాలో, అదుల్లాంలో, వాటి పల్లెటూళ్ళలో, లాకీషులో దాని మైదానాలలో, అజేర్‌షెబా నుంచి హిన్నోంలోయ వరకు ఉన్న ప్రాంతంలో నివసించారన్న మాట. 31 గెబకు చెందిన బెన్‌యామీనువారి సంతతివారు మిక్‌మషులో, ఆయాలో, బేతేల్‌లో దాని పల్లెటూళ్ళలో, 32 అనాతోతులో, నోబులో, అననయాలో, 33 హాసోరులో, రమాలో, గిత్తైలో, 34 హాదీదు, జెబోయింలో, నెబల్లాట్‌లో, 35 లోదులో, ఓనోలో, ‘లోహకారుల’ లోయలో నివాసం చేశారు. 36 లేవీగోత్రికులలో కొన్ని గుంపులు యూదా ప్రదేశానికి చెందిన బెన్‌యామీనులో కాపురం ఏర్పరచుకొన్నాయి.