10
1 ముద్రలు వేసినవారు వీరు: హకల్యా కొడుకూ అధిపతీ అయిన నెహెమ్యా, సిద్కీయా, 2 శెరయా, అజర్యా, యిర్మీయా, 3 పషూరు, అమరయా, మల్కీయా, 4 హట్టూషు, షెబన్యా, మల్లూకు, 5 హారీం, మెరేమోతు, ఓబద్యా, 6 దానియేలు, గిన్నెతోను, బారూకు, 7 మెషుల్లాం, అబీయా, మీయామీను, 8 మయాజయ, బిల్‌గయి. షెమయా. వారందరూ యాజులు. 9 లేవీగోత్రికులు వీరు: అజనయా కొడుకు యేషూవ, హేనాదాదు వంశంవాడు బిన్నూయి, కద్‌మీయేల్, 10 వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను, 11 మీకా, రెహోబ్, హషబ్యా, 12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా 13 హోదీయా, బానీ, బెనీను.
14 దానికి ముద్రవేసిన ప్రజల నాయకులు వీరు: పరోషు, పహత్ మోయాబు, ఏలాం, జత్తూ, బానీ, 15 బున్నీ, అజ్‌గాదు, బేబయి, 16 అదోనీయా, బిగ్‌వయి, ఆదీను, 17 అటేరు, హిజ్కియా, అజ్జూరు, 18 హోదీయా, హాషుం, బేజయి, 19 హారీపు, అనాతోతు, నెబయి, 20 మగ్‌పీయాషు, మెషుల్లాం, హెజీరు, 21 మెషేజబేల్, సాదోకు, యద్దూవ, 22 పెలటయా, హానాను, అనాయా, 23 హోషేయ, హననయా, హష్షూబ్, 24 హల్లోహేషు, పిల్‌హా, షోబేకు, 25 రెహూం, హషబన్యా, మయశేయా, 26 అహీయా, హానాను, ఆనాను, 27 మల్లూకు, హారీం, బయనా.
28 ప్రజలలో మిగతావారు యాజులు, లేవీగోత్రికులు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు, దేవుని ధర్మశాస్త్రానికి విధేయులయ్యేట్టు, చుట్టూరా ఉన్న జనాలలో నుంచి తమను వేరు చేసుకొన్నవారందరూ, వారి భార్యలూ, కొడుకులూ, కూతుళ్ళూ, గ్రహించడానికి తెలివిగలవారందరూ 29 వారి బంధువులతో, నాయకులతో కలిసి, దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా నియమించిన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించడానికీ, మా దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలనూ, చట్టాలనూ, శాసనాలనూ అన్నిటినీ పాటించి ఆచరిస్తామని వాగ్దానం ఇచ్చి శపథం చేశారు. 30 మా చుట్టూఉన్న జనాలకు మా కూతుళ్ళను ఇవ్వమనీ వాళ్ళ కూతుళ్ళను మా కొడుకులకు పుచ్చుకోమనీ కూడా ప్రమాణం చేశాం. 31 చుట్టూరా ఉన్న జనాలు అమ్మడానికి సరుకులను గానీ భోజన పదార్థాలను గానీ విశ్రాంతి దినాన తెస్తే విశ్రాంతి దినాన గానీ మరే పవిత్ర దినాన గానీ వాటిని కొనమనీ, ప్రతి ఏడో సంవత్సరంలో భూమి సాగు చేయమనీ, ఆ సంవత్సరంలో అన్ని బాకీలను రద్దు చేస్తామనీ కూడా ప్రమాణం చేశాం. 32 మేము ఇంకా ఇలా నిర్ణయించుకొన్నాం: మన దేవుని ఆలయ సేవకోసం ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు తులం వెండిలో మూడోభాగం ఇవ్వాలి. 33 అది బల్లమీద పెట్టవలసిన రొట్టెల కోసం, ఎడతెగని నైవేద్యాలకోసం, ఎడతెగని హోమ బలులకోసం, విశ్రాంతి దినాలలో అమావాస్యలలో నియామకమైన పండుగల్లో నిర్ణయించబడ్డ అర్పణల పవిత్ర వస్తువులకోసం, ఇస్రాయేల్ ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాపాలకోసమైన బలులకోసం, మన దేవుని ఆలయం పని అంతటికోసమూ ఉంది.
34 అంతేగాక ధర్మశాస్త్రంలో వ్రాసిఉన్నట్టు, మన దేవుడు యెహోవా బలిపీఠం మీద కాల్చడానికి కట్టెలు నిర్ణీతకాలాలలో మన దేవుని ఆలయానికి మా కుటుంబాలలో ఒక్కొక్కటి ఎప్పుడు తేవాలో మేము యాజులు, లేవీగోత్రికులు, ప్రజలు చీట్లు వేసి నిర్ణయించుకొన్నాం. 35 మా భూముల ప్రథమ ఫలాలను, ప్రతీ ఫలవృక్షం మొదటి పండ్లను ప్రతీ సంవత్సరం యెహోవా ఆలయానికి తెస్తామని నిర్ణయించుకొన్నాం. 36 ధర్మశాస్త్రంలో వ్రాసిఉన్నట్టు, మా కొడుకులలో మొదట పుట్టినవారిని, పశువులలో తొలిచూలులను మా మందలలో తొలిచూలులను మన దేవుని ఆలయంలో సేవ చేసే యాజులదగ్గరికి మేము తీసుకువస్తామని కూడా నిర్ణయించుకొన్నాం.
37 అంతే గాక, మా పిండిలో మొదటి భాగాన్ని, అర్పణలను, అన్ని రకాల చెట్ల పండ్లను, ద్రాక్షరసాన్ని, నూనెను కూడా మన దేవుని ఆలయంలోని గదులకు, యాజుల దగ్గరికి తెస్తామని నిర్ణయించుకొన్నాం. మా భూమి పంటలలో పదో భాగాన్ని లేవీగోత్రికులదగ్గరికి తేవాలనీ, వారు ప్రతి గ్రామంలోనూ ఆ పదో భాగాలను సేకరించాలనీ కూడా నిర్ణయించుకొన్నాం.
38  లేవీగోత్రికులు ఆ పదో భాగాలను పుచ్చుకొన్నప్పుడు, అహరోను వంశంలోని యాజి ఒకడు వారితో కూడా ఉండాలనీ, పదో భాగాలలో పదో భాగాన్ని లేవీగోత్రికులు మా దేవుని ఆలయంలో ఉన్న ఖజానా గదులలోకి తీసుకురావాలనీ కూడా నిర్ణయించుకొన్నాం. 39 ఇస్రాయేల్ ప్రజలు, లేవీగోత్రికులు, తాము ఇచ్చే ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, నూనెను, పవిత్రపాత్రలు ఉన్న ఆలయం గదులకు తేవాలి. ఆ గదులలో, సేవ చేసే యాజులూ ద్వారపాలకులూ నివాసం చేస్తారు. మన దేవుని ఆలయాన్ని మేము అలక్ష్యం చేయమని నిర్ణయించుకొన్నాం.