9
1 ఆ నెల ఇరవై నాలుగో రోజున ఇస్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉండి, గోనెపట్ట కట్టుకొని, తలమీద బుగ్గి పోసుకొని, మళ్ళీ సమకూడారు. 2 ఇస్రాయేల్ వంశాలవారు విదేశీయులందరిలో నుంచి తమను ప్రత్యేకించుకొన్నారు. వారు నిలబడి తమ పాపాలను, తమ పూర్వీకుల అపరాధాలను ఒప్పుకొన్నారు. 3 ఉన్నచోటనే నిలుచుండి తమ దేవుడు యెహోవా ధర్మ శాస్త్రగ్రంథాన్ని ఒక జాము సేపు చదువుతూ ఉన్నారు. మరో జాము సేపు తమ పాపాలను ఒప్పుకొంటూ, తమ దేవుడు యెహోవాను ఆరాధిస్తూ ఉన్నారు. 4 యేషువ, కద్‌మీయేల్, బానీ, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనే లేవీగోత్రికులు మెట్లమీద నిలుచుండి, తమ దేవుడు యెహోవాకు బిగ్గరగా మొర పెట్టారు. 5 యేషువ, కద్‌మీయేల్, బానీ, హషబ్‌నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనే లేవీగోత్రికులు, “నిలుచుండి, శాశ్వతంగా ఉన్న మీ దేవుడు యెహోవాను స్తుతించండి!” అని చెప్పి, ఈ విధంగా ఆయనను కీర్తించారు: “నీ ఘనమైన పేరుకు స్తుతి కలుగుతుంది గాక! నీ పేరు సమస్త కీర్తికీ, స్తుతికీ మించినది. 6 నీవు మాత్రమే యెహోవావు. నీవే ఆకాశాన్ని, మహాకాశాలను, వాటి నక్షత్ర సమూహాలను సృజించావు. భూమిని, దానిమీద ఉండేవాటన్నిటినీ, సముద్రాలను, వాటిలో ఉండేవాటన్నిటినీ కూడా నీవు సృజించావు. అన్ని ప్రాణులకు ప్రాణం ఇచ్చేది నీవే. పరలోక సమూహమంతా నీకే నమస్కారం చేస్తున్నది. 7 యెహోవా! అబ్రామును ఎన్నుకొని, కల్దీయ దేశంలోని ఊర్ నగరం నుంచి తీసుకువచ్చి అతనికి ‘అబ్రాహాము’ అనే పేరు పెట్టిన దేవుడివి నీవే. 8 అతడు నీ ఎదుట యథార్థ హృదయుడని తెలుసుకొని అతని సంతానానికి కనాను, హిత్తి, అమోరీ, పెరిజ్జి, యోబూసి, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానని అతనితో ఒడంబడిక చేశావు. నీవు న్యాయవంతుడివి, గనుక నీ మాటప్రకారం జరిగించావు.
9 “మా పూర్వీకులు ఈజిప్ట్‌లో పడ్డ బాధలను నీవు చూశావు. ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విన్నావు. 10 ఈజిప్ట్ చక్రవర్తి ఫరో, అతడి పరివారమంతా, అతడి దేశప్రజలందరూ వారిపట్ల ఎంత తీవ్ర గర్వంతో ప్రవర్తించారో నీకు తెలుసు, గనుక నీవు వాళ్ళకు వ్యతిరేకంగా సూచకమైన అద్భుతాలు, మహా క్రియలు జరిగించావు. అలా చేసి, ఈ రోజువరకు నిలిచివుండే పేరు ప్రతిష్ఠలను చేకూర్చుకొన్నావు. 11 నీ ప్రజలు సముద్రంమధ్య పొడి నేలను నడిచేలా వారి ఎదుట నీవు సముద్రాన్ని విభాగించావు. అయితే వారిని తరిమేవాళ్ళను, లోతైన నీళ్ళలో రాయి వేసినట్లు, అగాధ జలాలలో నీవు పడవేశావు. 12 పగటివేళ నీవు మేఘస్తంభంలో ఉండి నీ ప్రజలకు వెళ్ళవలసిన దారి చూపావు, రాత్రివేళ వాళ్ళు వెళ్ళవలసిన దారిన వెలుగివ్వడానికి అగ్ని స్తంభంలో ఉండి నడిపించావు.
13 “నీవు సీనాయి పర్వతంమీదికి దిగివచ్చావు. ఆకాశంనుంచి వారితో మాట్లాడావు. వారికి న్యాయమైన నిర్ణయాలనూ, సత్యమైన ఉపదేశాలనూ, మంచి చట్టాలనూ ఆజ్ఞలనూ ప్రసాదించావు. 14 వారికి నీ పవిత్ర విశ్రాంతి దినం విషయం తెలియజేశావు. నీ సేవకుడైన మోషేద్వారా ఆజ్ఞలనూ చట్టాలనూ ఉపదేశాలనూ నియమించావు. 15 వారి ఆకలి తీర్చడానికి ఆకాశంనుంచి ఆహారాన్ని, వారి దాహం తీర్చడానికి బండలోనుంచి నీళ్ళను తెప్పించావు. ఇస్తానని నీవు మాట ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి అంటూ వారితో చెప్పావు.
16 “కాని, మా పూర్వీకులు విర్రవీగి తలబిరుసుగా ప్రవర్తించారు, నీ ఆజ్ఞలను పెడచెవి పెట్టారు. 17 నీ మాట వినడం అనేది వారు నిరాకరించారు. తమ మధ్య నీవు చేసిన అద్భుతాలను మరచిపోయారు వారు తలబిరుసుగా తిరుగుబాటు చేస్తూ, ఈజిప్ట్‌లో ఉన్న దాస్యంలోకి తిరిగి వెళ్ళడానికి ఒక నాయకుణ్ణి కోరుకొన్నారు. అయితే నీవు క్షమించే దేవుడివి., దయగలవాడివి, కరుణామయుడివి, చాలా కృపగలవాడివి. త్వరగా కోపగించేవాడివి కావు. కనుక నీవు వారిని విసర్జించలేదు. 18 వారు దూడ ఆకారాన్ని పోతపోసి ‘ఈజిప్ట్ నుంచి మనల్ని తీసుకువచ్చిన దేవుడు ఇదే’ అని చెప్పి ఘోరమైన దేవదూషణ చేసినా నీవు వారిని విడిచిపెట్టలేదు. 19 నీ కరుణ గొప్పది, గనుక నీవు ఎడారిలో వారిని విసర్జించ లేదు. పగటివేళ ఆ మేఘస్తంభం వారికి దారి చూపడం, రాత్రివేళ అగ్ని స్తంభం వారు వెళ్ళవలసిన దారిన వెలుగివ్వడం మానలేదు. 20 వారికి ఉపదేశించడానికి దయగల నీ ఆత్మ ను ప్రసాదించావు నీ ‘మన్నా’ను నీవు వారికి ఇయ్యక మానలేదు. వారి దాహానికి నీళ్ళిచ్చావు. 21 నిజంగా నలభై సంవత్సరాలు ఎడారిలో వారిని పోషించావు. వారికి ఏమీ కొదువ కాలేదు. వారి బట్టలు పాతగిలలేదు, వారి కాళ్ళకు వాపు కలగలేదు.
22 “తరువాత నీవు వారికి రాజ్యాలను, జనాలను అప్పగించి, వేరువేరు ప్రదేశాలను ఇచ్చావు. వారు హెష్‌బోను రాజైన సీహోను దేశాన్నీ భాషాను రాజైన ఓగు దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 23 వారి సంతానాన్ని లెక్కకు ఆకాశ నక్షత్రాలంతగా చేసి ‘ప్రవేశించి స్వాధీనం చేసుకోండి’ అని వారి తండ్రులతో నీవు చెప్పిన దేశంలోకి వారిని తీసుకువచ్చావు. 24 ఆ సంతతివారు దేశంలోకి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దేశంలో కాపురమున్న కనానుజాతివాళ్ళను వారి ఎదుట ఓడించావు. తమకు మనసు వచ్చినట్లు చేయడానికి వాళ్ళనూ వాళ్ళ రాజులనూ దేశంలో ఇతర జనాలనూ వారి చేతికి అప్పగించావు. 25 వారు కోటలూ గోడలూ గల పట్టణాలనూ, ఫలవంతమైన భూమినీ స్వాధీనం చేసుకొన్నారు. అన్ని రకాల మంచి వస్తువులతో నిండివున్న ఇండ్లనూ త్రవ్విన బావులనూ ద్రాక్షతోటలనూ ఆలీవ్‌చెట్ల తోటలనూ విస్తారంగా ఉన్న ఫలవృక్షాలనూ వశం చేసుకొన్నారు. వారు తిని తృప్తిపడి బలిశారు, నీ మహా దయను బట్టి సుఖంగా బ్రతికారు.
26 “కాని వారు అవిధేయులై నీమీద తిరుగుబాటు చేశారు. నీ ధర్మశాస్త్రాన్ని తమ వెనక్కు త్రోసివేశారు. నీవైపుకు వారిని మళ్ళించడానికి హెచ్చరించిన నీ ప్రవక్తలను చంపారు. ఘోరమైన దేవదూషణ చేశారు. 27 అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించావు, ఆ శత్రువులు వారిని బాధించారు. వారి బాధకాలంలో వారు నీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుంచి వారిని విడిపించడానికి నీ మహా కరుణ ప్రకారం వారికి రక్షకులను ప్రసాదించావు. 28 అయితే వారికి పరిస్థితులు నిమ్మళించిన తరువాత నీ దృష్టిలో మళ్ళీ చెడుగు చేయసాగారు. అప్పుడు నీవు వారిని తిరిగి శత్రువుల వశం చేశావు. వాళ్ళు వారిమీద ప్రభుత్వం చేశారు. వారు నీకు మళ్ళీ మొరపెట్టినప్పుడు పరలోకంలో నీవు విని నీ కరుణ ప్రకారం వారిని విడిపించావు. ఈ విధంగా అనేక సార్లు జరిగింది.
29 “నీ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ అనుసరించి నడవాలని నీవు వారిని హెచ్చరించినా వారు విర్రవీగి నీ ఆజ్ఞలకు అవిధేయులయ్యారు. నీ న్యాయనిర్ణయాలను ఎవరైనా ఆచరిస్తే వాటివల్ల బ్రతుకుతారు గాని, వారు వాటిని మీరి పాపాలు చేశారు. నీకు వీపు చూపి తలబిరుసుగా అయిపోయి నీ మాట వినడానికి నిరాకరించారు. 30 చాలా సంవత్సరాలు నీవు వారిపట్ల ఓర్పు చూపించావు, నీ ప్రవక్తలద్వారా నీ ఆత్మచేత వారిని హెచ్చరించావు, అయినా వారు నీ మాటలు చెవిని బెట్టలేదు, గనుక నీవు వేరువేరు దేశాలవాళ్ళ చేతికి వారిని అప్పగించావు. 31 అయితే వారిని పూర్తిగా నాశనం చేయలేదు, విసర్జించలేదు. దీనికి కారణం నీ మహా కరుణ నిజంగా నీవు దయాదాక్షిణ్యం గల దేవుడివి.
32 “మా దేవా! గొప్ప దేవా! బలాఢ్యుడా! భయభక్తులకు పాత్రుడా! నీ ఒడంబడిక నిలుపుతూ అనుగ్రహం చూపుతూ ఉన్నవాడివి. మా కష్టమంతా స్వల్పమని పరిగణించవద్దు. అష్షూరు రాజుల రోజులనుంచి ఈ రోజువరకు మామీదికి, మా రాజుల మీదికి, నాయకుల మీదికి, మా యాజుల మీదికి, ప్రవక్తల మీదికి, మా పూర్వీకుల మీదికి, నీ ప్రజలందరిమీదికి కడగండ్లు వస్తూవున్నాయి. 33 అయితే మామీదికి వచ్చిన దానంతట్లోనూ నీవు న్యాయం జరిగించావు. విశ్వసనీయతతో వ్యవహరించావు. మేము చెడుగు చేసేవాళ్ళం. 34 మా రాజులు, నాయకులు, యాజులు, పూర్వీకులు నీ ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించలేదు. నీ ఆజ్ఞలను గానీ నీవు వారితో పలికిన హెచ్చరికలను గానీ వారు చెవిని బెట్టలేదు. 35 తమ రాజ్యపరిపాలన కాలంలో కూడా, నీవు వారికి ఇచ్చిన ఫలవంతమయిన విశాల దేశంలో నీవు చూపిన మహా దయ ను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా, వారు నీకు సేవ చేయలేదు, తమ చెడు ప్రవర్తననుంచి నీవైపు తిరగలేదు.
36 “ఇదిగో! ఈ రోజు మేము దాస్యంలో ఉన్నాం. ఈ దేశం ఫలసాయాన్ని, దాని సమృద్ధిని అనుభవించేలా నీవు దానిని మా పూర్వీకులకు ప్రసాదించావు. అయితే ఈ దేశంలో మేము దాసులం. 37 మా అపరాధాల కారణంగా, నీవు మా మీద నియమించిన రాజులకు దాని సమృద్ధి అయిన పంటలు లభ్యం అవుతాయి. వారు తమకు ఇష్టం వచ్చినట్టు మా శరీరాలమీద మా పశువులమీద ప్రభుత్వం చేస్తున్నారు. మేము గొప్ప బాధలో ఉన్నాం.” 38 దీని ఫలితంగా మేము స్థిరమైన ఒడంబడిక చేసి దానిని వ్రాయించాం. మా నాయకులు, మా లేవీగోత్రికులు, మా యాజులు దానికి ముద్రలు వేశారు.