8
1 ఏడో నెలలో, ఇస్రాయేల్ ప్రజలు తమ ఊళ్ళలో కాపురమేర్పరచుకొన్న తరువాత, వారంతా ఏకంగా వచ్చి “నీళ్ళ” ద్వారానికి ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇస్రాయేల్ ప్రజలకు ఆదేశించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని✽ తెమ్మని ధర్మశాస్త్రి అయిన ఎజ్రాతో చెప్పారు. 2 ఏడో నెల మొదటి రోజున ఎజ్రాయాజి ఆ సభ ముందుకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకు వచ్చాడు. ఆ సభలో స్త్రీ పురుషులు, గ్రహింపుతో వినగలవారందరూ ఉన్నారు. 3 “నీళ్ళ” ద్వారానికి ఎదురుగా ఉన్న మైదానం ముందు నిలుచుండి, ఎజ్రా ఉదయంనుంచి మధ్యాహ్నంవరకు ఆ స్త్రీ పురుషులకూ, గ్రహింపుతో వినగలవారందరికీ చదివి వినిపిస్తూ✽ ఉన్నాడు. ఆ ప్రజలంతా ధర్మశాస్త్ర గ్రంథవాక్కులను శ్రద్ధతో విన్నారు. 4 ఆ పనికోసం చెక్కలతో చేసిన ఒక వేదిక మీద ఎజ్రా ధర్మశాస్త్రి✽ నిలబడ్డాడు. అతని కుడిప్రక్కన మత్తితయా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా నిలుచున్నారు; అతని ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేల్, మల్కీయా, హాషుం, హష్‌బద్దానా, జెకర్యా, మెషుల్లాం నిలుచున్నారు.5 ఎజ్రా ఆ గ్రంథాన్ని విప్పాడు. అతడు అందరికంటే పైగా నిలబడి ఉండడం చేత ప్రజలు అతణ్ణి చూడగలిగారు. అతడు గ్రంథాన్ని విప్పగానే వారంతా నిలబడ్డారు. 6 ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించాడు✽, ప్రజలందరూ చేతులెత్తి, “తథాస్తు! తథాస్తు!” అని చెప్పి యెహోవాకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. 7 ప్రజలు ఆ స్థలంలో నిలిచి ఉండగా లేవీగోత్రికులైన యేషూవ, బానీ, షేరేబయా, యామీను, అక్కూబ్, షబ్బెతయి, హోదీయా, మయశేయా, కెలీటా, అజరయా, హానాను, యోజాబాదు, పెలాయా ధర్మశాస్త్రోపదేశాలను వారికి వివరించి చెప్పారు. 8 వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి, ప్రజలు గ్రహించేలా✽ దాని అర్థం తెలియచెప్పారు.
9 ధర్మశాస్త్ర వాక్కులను విని ప్రజలందరూ ఏడ్వసాగారు✽. అప్పుడు అధిపతి అయిన నెహెమ్యా, యాజీ ధర్మశాస్త్రీ అయిన ఎజ్రా, ప్రజలకు ఉపదేశిస్తున్న లేవీగోత్రికులు అందరితో ఇలా అన్నారు: “మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు. ఈ దినం మీ దేవుడు యెహోవాకు పవిత్ర దినం.” 10 అప్పుడతడు “పదండి, క్రొవ్విన మాంసం తినండి, తియ్యనిదానిని తాగండి. తమకోసం ఏమీ సిద్ధం చేసుకోనివారికి✽ వంతులు పంపండి. ఈ రోజు మన ప్రభువుకు పవిత్రమైనది. మీరు దుఃఖపడకండి. యెహోవా యందు ఆనందం✽ మీకు బలం” అని చెప్పాడు.
11 లేవీగోత్రికులు కూడా ప్రజలందరినీ నెమ్మదిపరచి “ఊరుకోండి, దుఃఖపడవద్దండి. ఇది పవిత్ర దినం” అన్నారు. 12 అప్పుడు ప్రజలందరూ అన్నపానాలు పుచ్చుకోవడానికీ, లేనివారికి వంతులు పంపడానికీ మహానందంతో ఉత్సవం చేయడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే, తమకు తెలియజేసిన వాక్కులు వారు గ్రహించారు✽.
13 రెండో రోజున ప్రజలలో అన్ని వంశాల నాయకులు, యాజులు, లేవీగోత్రికులు ధర్మశాస్త్ర వాక్కులను వినడానికి ఎజ్రా ధర్మశాస్త్రి దగ్గర సమకూడారు. 14 ✽ఏడో నెలలో జరిగే పండుగ సమయం ఇస్రాయేల్ ప్రజలు పర్ణశాలల్లో గడపాలని యెహోవా మోషేద్వారా ఆదేశించిన ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్నట్టు వారు చూశారు. 15 అందుచేత వారు ప్రకటన చేసి తమ ఊళ్ళన్నిటిలో, జెరుసలంలో ఇలా చాటించారు. “మీరు కొండలకు వెళ్ళి ఆలీవ్‌చెట్ల కొమ్మలను, అడవి ఆలీవ్‌చెట్ల కొమ్మలను, గొంజిచెట్ల కొమ్మలను, ఈతచెట్ల కొమ్మలను, గుబురు గల వేరువేరు చెట్లకొమ్మలను తెచ్చి, లేఖనం ప్రకారం పర్ణశాలలు కట్టాలి.”
16 అలాగే ప్రజలు వెళ్ళి కొమ్మలను తెచ్చి, ఒక్కొక్కరు తమ ఇండ్ల పైకప్పులమీద, తమ ఆవరణాలలో✽, దేవాలయం ఆవరణంలో, “నీళ్ళ” ద్వారం దగ్గర ఉన్న మైదానంలో, “ఎఫ్రాయిం” ద్వారం దగ్గర మైదానంలో పర్ణశాలలు కట్టారు. 17 చెరనుంచి తిరిగి వచ్చిన వారంతా పర్ణశాలలు కట్టి, వాటిలో ఉండిపోయారు. నూను కొడుకు యెహోషువ రోజులనుంచి ఆ రోజువరకు ఇస్రాయేల్ ప్రజలు ఆవిధంగా✽ చేయలేదు. ఇప్పుడు వారి సంతోషం చాలా గొప్పది. 18 ✽ ఆ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ ఎజ్రా, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. వారు ఆ పండుగ ఏడు రోజులు ఆచరించారు. న్యాయనిర్ణయాల ప్రకారం ఎనిమిదో రోజున పవిత్ర సభ జరిగింది.