7
1 గోడ పూర్తి అయింది. నేను ద్వారాల తలుపులు నిలిపిన తరువాత ద్వారపాలకులనూ గాయకులనూ లేవీ గోత్రికులనూ నియమించాను. 2 అప్పుడు నా తోబుట్టువు హనానీకీ, కోటకు అధిపతి హనన్యాకూ జెరుసలంమీద అధికారం ఇచ్చాను. హనన్యా నిజాయితీపరుడు, దేవునిపట్ల అనేకులకంటే ఎక్కువ భయభక్తులు గలవాడు. 3 నేను వారికి ఆదేశించాను: “పొద్దు బాగా ఎక్కేవరకు జెరుసలం ద్వారాల తలుపులు తీయకూడదు. ద్వారపాలకులు వెళ్ళకముందు తలుపులు మూసి అడ్డగడియలు వేయాలి. అంతేగాక, జెరుసలం కాపురస్థులలో కొంతమందిని కాపలాదారులుగా నియమించి కావలి స్థలాలలో గానీ తమ ఇండ్లకు ఎదురుగా గానీ ఉంచండి.”
4 జెరుసలం నగరం విశాలంగా, పెద్దగా ఉంది గాని దానిలో ఉన్నవారు కొద్దిమందే. ఇండ్లను ఇంకా కట్టడం జరగలేదు కూడా. 5 అప్పుడు నాయకులనూ అధికారులనూ ప్రజలందరినీ సమకూర్చి, వంశాలప్రకారం జనాభా లెక్క వ్రాయాలని దేవుడు నా మనసులో తలంపు పుట్టించాడు. మొట్టమొదట తిరిగి వచ్చినవారి గురించిన వంశావళి గ్రంథం నేను కనుగొన్నాను. అందులో ఇలా వ్రాసి ఉంది.
6 బబులోను రాజైన నెబుకద్‌నెజరు బందీలుగా తీసుకుపోయినవారి సంతానం అనేకులు బబులోనులో చెరనుంచి జెరుసలంకు, యూదాకు, ఎవరి ఊరికి వారు తిరిగి వచ్చారు. 7 వారిలో జెరుబ్బాబెల్, యేషూవ, నెహెమ్యా, అజరయా, రయమయా, నహమానీ, మొర్‌దకయి, బిల్‌షాను, మిస్పెరేతు, బిగ్‌వయి, నెహూం, బయనా ఉన్నారు.
బబులోను నుంచి వచ్చిన ఇస్రాయేల్ ప్రజల లెక్క ఇది: 8 పరోషు వంశంవారు రెండు వేల నూట డెబ్భై ఇద్దరు; 9 షెపట్య వంశం వారు మూడు వందల డెబ్భయి ఇద్దరు; 10 అరహు వంశం వారు ఆరు వందల యాభై ఇద్దరు; 11 యేషూవ, యోవాబుల వంశాలలో పహత్ మోయాబు కుటుంబంవారు రెండు వేల ఎనిమిది వందల పద్ధెనిమిది మంది; 12 ఏలాం వంశం వారు వెయ్యి రెండు వందల యాభై నలుగురు; 13 జత్తూవంశం వారు ఎనిమిది వందల నలభై అయిదు మంది; 14 జక్కయి వంశం వారు ఏడు వందల అరవైమంది; 15 బిన్నూయి వంశం వారు ఆరు వందల నలభై ఎనిమిదిమంది; 16 బేబయి వంశం వారు ఆరువందల ఇరవై ఎనిమిదిమంది; 17 అజ్‌గాదు వంశంవారు రెండు వేల మూడు వందల ఇరవై ఇద్దరు; 18 అదోనీకాం వంశం వారు ఆరు వందల అరవై ఏడుమంది; 19 బిగ్‌వయి వంశంవారు రెండువేల అరవై ఏడుమంది; 20 అదీను వంశం వారు ఆరువందల యాభై అయిదు మంది; 21 హిజ్కియా వంశంవారిలో అటేరు కుటుంబంవారు తొంభై ఎనిమిదిమంది; 22 హాషూం వంశంవారు మూడు వందల ఇరవై ఎనిమిది మంది; 23 బేజయి వంశంవారు మూడు వందల ఇరవై నలుగురు; 24 హారీపు వంశంవారు నూట పన్నెండుమంది; 25 గిబియోను వంశంవారు తొంభై అయిదుమంది; 26 బేత్‌లెహేంకు చెందిన వంశాలవారు, నెటోపా గ్రామం వారు నూట ఎనభై ఎనిమిది మంది; 27 అనాతోతు గ్రామం వారు నూట ఇరవై ఎనిమిదిమంది; 28 బేత్ అజ్‌మావెతు గ్రామం వారు నలభై ఇద్దరు; 29 కిర్యత్ యారీం, కెఫీరా, బేరోతు అనే గ్రామాల వారు ఏడు వందల నలభై ముగ్గురు; 30 రమా, గెబ అనే గ్రామాల వారు ఆరువందల ఇరవై ఒక్కరు; 31 మిక్‌మషు గ్రామం వారు నూట ఇరవై ఇద్దరు; 32 బేతేల్, హయీ అనే గ్రామాల వారు నూట ఇరవై ముగ్గురు; 33 ఇంకొక నెబో గ్రామం వారు యాభై ఇద్దరు; 34 ఇంకొక ఏలాం గ్రామం వారు వెయ్యి రెండు వందల యాభై నలుగురు; 35 హారీం గ్రామం వారు మూడువందల ఇరవైమంది; 36 యెరికో పట్టణం వారు మూడు వందల నలభై అయిదుమంది; 37 లోదు, హదీదు, ఓనో అనే గ్రామాల వారు ఏడు వందల ఇరవై ఒకరు; 38 సెనాయా గ్రామం వారు మూడు వేల తొమ్మిది వందల ముప్ఫయిమంది.
39 యాజుల లెక్క: యెదాయా వంశంలో యేషూవ కుటుంబం వారు తొమ్మిది వందల డెబ్భై ముగ్గురు; 40 ఇమ్మేరు వంశం వారు వెయ్యి యాభై ఇద్దరు; 41 పషూరు వంశం వారు వెయ్యి రెండు వందల నలభై ఏడుమంది; 42 హారీం వంశంవారు వెయ్యి పదిహేడు మంది. 43 లేవీగోత్రికుల లెక్క: హోదవ్యా వంశంలో యేషూవ, కద్‌మీయేల్ అనే వారి కుటుంబాలవారు డెబ్భయి నలుగురు. 44 గాయకుల లెక్క: ఆసాపు వంశం వారు నూట నలభై ఎనిమిది మంది. 45 ద్వారపాలకుల లెక్క: షల్లూం, అటేరు, టల్మోను, అక్కూబ్, హటీటా, షోబయి, అనే వారి వంశీయులు నూట ముప్ఫయి ఎనిమిదిమంది.
46 దేవాలయ సేవకులెవరంటే, జీహా, హశూపా, టబ్బాయోతు, 47 కేరోసు, సీయహా, పాదోను, 48 లెబానా, హగాబా, షల్మయి, 49 హానాను, గిద్దేల్, గహారు, 50 రెవాయ, రెజీను, నెకోదా, 51 గజ్జాం, ఉజ్జా, పాసెయ, 52 లెసాయి, మెహూనీం, నెపూషేసీం, 53 బక్‌బూకు, హకూపా, హర్‌హర్, 54 బజ్‌లీతు, మెహీదా, హర్షా, 55 బర్కోసు, సీసెరా, తెమహు, 56 నెజీయహు, హటీపా అనేవారి వంశాలవారు.
57 సొలొమోను సేవకుల వంశాలవారెవరంటే, సొటయి, సొపెరెతు, పెరూదా, 58 యెహలా, దర్కోను, గిద్దేల్, 59 షెఫట్యా, హట్టీల్, పొకెరెత్ హజెబాయీం, ఆమోను అనేవారి వంశీయులు. 60 దేవాలయ సేవకులూ సొలొమోను సేవకుల వంశంవారూ అందరూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు.
61 తేల్‌మెలహు, తేల్‌షర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అనే స్థలాలకు చెందినవారు కొంతమంది వచ్చారు. కాని, వారు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నాయో లేవో నిదర్శనాలు ఇవ్వలేకపోయారు. 62 వారెవరంటే, దెలాయ్యా, టోబీయా, నెకోదా అనే వారి వంశంవారు. వారు ఆరు వందల నలభై ఇద్దరు. 63 అలాంటి వారు యాజులలో కూడా కొంతమంది ఉన్నారు. వారు హబాయ్యా, హాక్కోజు, బర్‌జిల్లయి అనే వారి వంశీయులు. (బర్‌జిల్లయి గిలాదువాడైన బర్‌జిల్లయి కూతుళ్ళలో ఒకతెను పెండ్లి చేసుకొన్నాడు, గనుక ఆ పేరు అతనికి వచ్చింది.) 64 వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లను వెదికారు గాని, అవి కనబడలేదు. అందుచేత వారు అపవిత్రులుగా ఎంచబడి యాజులలో చేరలేకపోయారు. 65 “ఊరీం”, “తుమ్మీం” ధరించగల యాజి నియమించబడేవరకు దేవునికి ప్రతిష్ఠితమైన భోజన పదార్థాలను వారు తినకూడదని ప్రజల అధికారి ఆదేశించాడు.
66 సమకూడిన ఆ ప్రజల లెక్క మొత్తం నలభై రెండు వేల మూడు వందల అరవైమంది. 67 వారు గాక వారి పరిచారకులు, పరిచారికలు ఏడు వేల మూడు వందల ముప్ఫయి ఏడుమంది. రెండు వందల నలభై అయిదుమంది గాయనీగాయకులు కూడా ఉన్నారు. 68 ప్రజల గుర్రాలు ఏడు వందల ముప్ఫయి ఆరు, కంచరగాడిదలు రెండు వందల నలభై అయిదు, 69 ఒంటెలు నాలుగు వందల ముప్ఫయి అయిదు, గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై.
70 వంశాల నాయకులలో కొంతమంది పనికి ఆర్థిక సహాయం చేశారు. అధిపతి, ఖజానాలోకి నూట ఇరవై తులాల బంగారం, యాభై పళ్ళేలు, యాజుల కోసం అయిదు వందల ముప్ఫయి వస్త్రాలు ఇచ్చాడు. 71 వంశాల నాయకులలో మరి కొంతమంది పనికోసం ఖజానాలోకి రెండు వేల నాలుగు వందల తులాల బంగారం, పద్నాలుగు లక్షల తులాల వెండి ఇచ్చారు. 72 మిగతావారు ఇచ్చినది మొత్తం రెండు వేల నాలుగు వందల తులాల బంగారం, పన్నెండు లక్షల డెబ్భయి రెండు వేల ఏడు వందల ఇరవై తులాల వెండి, యాజులకోసం అరవై ఏడు వస్త్రాలు. 73 తరువాత యాజులు, లేవీగోత్రికులు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు, ప్రజలలో కొంతమంది, ఇస్రాయేల్ ప్రజలంతా తమ ఊళ్ళలో కాపురం చేశారు.