6
1 ✝గోడకు ద్వారాల తలుపులను నేను ఇంకా నిలపక పోయినా, బీటలు ఏమీ లేకుండా పూర్తిగా గోడను మళ్ళీ కట్టించానని సన్‌బల్లట్, టోబీయా, అరబ్బువాడు గెషెం, మా శత్రువులలో మిగతావాళ్ళు విన్నారు. 2 వెంటనే సన్‌బల్లట్, గెషెం నాకు హాని చేయదలచి, “ఓనో✽ మైదానంలో ఉన్న కిఫిరీంలో మనం కలుసుకొందాం రండి” అని నాకు కబురంపారు. 3 ✽అందుకు నేను ఇలా చెప్పి పంపాను: “నేను గొప్ప పని చేస్తూ ఉన్నాను. నేను రాలేను. ఈ పని విడిచి, మీ దగ్గరికి రావడానికి నేను దానిని ఎందుకు ఆపాలి?”4 ✽వాళ్ళు నాలుగు సార్లు అదే కబురు పంపారు, ప్రతిసారీ నేను అలాగే జవాబిచ్చాను. 5 అయిదో సారి సన్‌బల్లట్ తన సేవకుడిచేత ముద్ర లేని✽ లేఖ నాదగ్గరికి పంపాడు. 6 అందులో ఇలా రాసి ఉంది: “మీరూ, యూదులూ రాజద్రోహం చేయడానికి దురాలోచన చేస్తున్నారనీ, కనుకనే మీరు గోడ కడుతున్నారనీ ఇతర ప్రజలలో వదంతి పాకుతూ ఉంది. ఇది నిజమని గెషెం చెబుతున్నాడు. 7 ఈ వదంతి ప్రకారం మీరు యూదులరాజు అవుతారట, ‘యూదాలో రాజు ఉన్నాడు’ అని మీ గురించి ప్రకటన చేయడానికి జెరుసలంలో ప్రవక్తలను మీరు నియమించారట. ఈ సంగతులు చక్రవర్తికి వినబడతాయి. కనుక మనం కలిసి దీనిగురించి మాట్లాడుదాం రండి.”
8 అందుకు నేను ఇలా చెప్పి పంపాను: “నీవు చెప్పేవి జరగడం లేదు. నీ మనసులోనే నీవు వాటిని కల్పించావు.” 9 మాకు బలం ఉడిగిపోతుందనీ, అప్పుడు ఈ పని పూర్తి కాదనీ వాళ్ళు అనుకొన్నారు. అందుచేత వాళ్ళు మమ్మల్ని భయపెట్టడానికి✽ ప్రయత్నం చేశారు. దేవా, ఇప్పుడు నా చేతులకు బలం చేకూర్చు!
10 నేను మెహేతబేల్ మనుమడూ, దెలాయ్యా కొడుకూ అయిన షెమయా ఇంటికి వెళ్ళాను. అతడు బయటికి రాకుండేలా కావలిలో ఉంచబడ్డాడు. అతడు “రాత్రివేళ మిమ్మల్ని చంపడానికి✽ మనుషులు వస్తారు, గనుక దేవాలయం✽లో, దాని లోపలి భాగంలో మనం వెళ్ళి తలుపులు వేసుకొందాం రండి” అన్నాడు.
11 అందుకు నేను “నాలాంటి వాడు పారిపోవచ్చా✽? ప్రాణం దక్కించుకొందామని నాలాంటివాడు దేవాలయంలోకి చొరబడవచ్చా? నేను వెళ్ళను!” అని జవాబిచ్చాను. 12 ✽అప్పుడే నేను గ్రహించినది ఏమిటంటే, దేవుడు అతణ్ణి పంపలేదు గాని, టోబీయా, సన్‌బల్లట్ అతడికి లంచమిచ్చినందుచేతే నా విషయం అలా పలికాడని. 13 నేను భయపడి అతడు చెప్పినట్టు చేసి తప్పిదంలో పడాలని వాళ్ళు అతడికి లంచమిచ్చారు. నాకు అపకీర్తి కలిగించి నామీద నింద మోపాలని వాళ్ళ ఆశయం. 14 ✽నా దేవా! వాళ్ళ చర్యలను బట్టి టోబీయానూ సన్‌బల్లట్‌నూ జ్ఞాపకం ఉంచుకో. నన్ను భయపెట్టడానికి చూచిన నోవదయా అనే ప్రవక్త్రినీ ఇతర ప్రవక్తలనూ కూడా జ్ఞాపకం ఉంచుకో.
15 గోడ కట్టడం ఏలూల్ నెల ఇరవై అయిదో రోజున ముగిసింది. దానిని కట్టడానికి యాభై రెండు రోజులు✽ పట్టింది. 16 మా శత్రువులంతా ఈ సంగతి విన్నప్పుడు, మా చుట్టూరా ఉన్న ఇతర ప్రజలంతా ఆ గోడను చూచినప్పుడు చాలా చిన్నబోయారు. ఎందుకంటే ఈ పని మా దేవుని వల్ల✽ జరిగిందని వాళ్ళు అవగాహనం చేసుకొన్నారు. 17 ✽అయినా ఆ రోజుల్లో యూదుల నాయకులు టోబీయా దగ్గరికి అనేక లేఖలు పంపిస్తూ వచ్చారు. అతడూ వారికి జాబులు పంపిస్తూ ఉన్నాడు. 18 అతడు అరహు కొడుకైన షెకనయాకు అల్లుడు, అంతేగాక, అతడి కొడుకు యోహానాను బెరెకయా కొడుకైన మెషుల్లాం కూతురును పెళ్ళి చేసుకొన్నాడు, గనుక యూదులలో చాలామంది శపథంతో అతడికి కట్టుబడి ఉన్నారు. 19 అతడు మంచివాడని వారు నాతో చెపుతూ వచ్చారు, నేను చెప్పిన మాటలు అతడికి తెలియజేస్తూ వచ్చారు. నన్ను భయపెట్టడానికి టోబీయా జాబులు పంపాడు.