5
1 తరువాత ప్రజలలో స్త్రీ పురుషులు తమ సాటి యూదులమీద పెద్ద ఫిర్యాదు చేశారు. 2 కొంతమంది, “మేమూ మా కొడుకులూ కూతుళ్ళూ చాలామందిమి. మేము తిని బతికేలా ధాన్యం కావాలి” అన్నారు.
3 మరికొందరు “ఈ కరవు కాలంలో ధాన్యం తెచ్చుకోవడానికి మా భూములనూ ద్రాక్షతోటలనూ ఇండ్లనూ కుదువ పెట్టవలసి వచ్చింది” అన్నారు.
4 మరి కొంతమంది అన్నారు: “రాజు వేసిన పన్ను చెల్లించడానికి మా భూములమీదా ద్రాక్షతోటలమీదా మేము అప్పు చేశాం. 5 మా సాటి జాతివాళ్ళతో రక్తసంబంధులం గదా. మా పిల్లలు వాళ్ళ పిల్లల్లాంటి వారే గదా. అయినా మా కొడుకులనూ కూతుళ్ళనూ దాసులు కావడానికి అప్పగించవలసివచ్చింది. ఇప్పటికే మా కూతుళ్ళలో కొంతమంది దాస్యంలో ఉన్నారు. అయితే మా భూములు మా ద్రాక్షతోటలూ ఇతరుల వశంలో ఉండడంచేత మేము వాళ్ళను విడిపించలేకపోతున్నాం.”
6 ఈ విషయాలు – వారి ఫిర్యాదులు – విన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. 7 లోలోపల తలపోసిన తరువాత నేను నాయకులనూ అధికారులనూ మందలిస్తూ “మీరు సొంత ప్రజల దగ్గర అక్రమంగా వడ్డీ తీసుకొంటున్నారు” అని చెప్పాను. వాళ్ళను అడ్డగించడానికి నేను గొప్ప సభ సమకూర్చాను. 8 అప్పుడు నేనిలా అన్నాను: “ఇతర ప్రజలకు అమ్ముడుపోయిన మన సాటి యూదులను మా శక్తి కొలది మేము వెల ఇచ్చి విడిపించాం. వారు మాకు మళ్ళీ అమ్మబడేలా మీరు సొంత ప్రజలను అమ్మివేస్తారా?” ఏమీ చెప్పలేక వాళ్ళు ఊరుకొన్నారు.
9 కనుక నేను ఇంకా అన్నాను: “మీరు చేస్తున్నది మంచిది కాదు. మనమీద పగపట్టిన ఇతర ప్రజల నింద రాకుండా మన దేవుని భయంతో మీరు ప్రవర్తించకూడదా? 10 నేను, నా బంధువులు, పనివారు కూడా ప్రజలకు డబ్బును, ధాన్యాన్ని అప్పుగా ఇస్తున్నాం. అయితే దయ చేసి వడ్డీ మాత్రం తీసుకోకుండా ఉండాలి. 11 ఈ రోజే వారి భూములనూ, ద్రాక్షతోటలనూ, ఆలీవ్ తోటలనూ, ఇండ్లనూ వారికి మళ్ళీ ఇచ్చివేయండి. డబ్బు, ధాన్యం, ద్రాక్షరసం, నూనెలో మీరు వడ్డీగా తీసుకొన్న ఆ నూరో భాగాన్ని కూడా వారికి ఇచ్చివేయండి.”
12 అందుకు వారు: “మీరు చెప్పినట్టే చేస్తాం. అవన్నీ వాళ్ళకు ఇచ్చేస్తాం. ఇకనుంచి వాళ్ళదగ్గర ఏమీ కోరము” అని చెప్పారు. అప్పుడు నేను యాజులను పిలిపించి, తమ వాగ్దానం ప్రకారం చేయడానికి నాయకులచేత, అధికారులచేత శపథం చేయించాను.
13 నేను ఒడి దులిపి “ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతివాణ్ణీ తన ఇంట్లో, ఆస్తిలో లేకుండా ఉండేలా దేవుడు దులిపి వేస్తాడు గాక! అలాంటివాణ్ణి ఇలాగే ఏమీ లేనివాడుగా దులిపివేయడం జరుగుతుంది గాక!” అన్నాను. అందుకు సర్వ సమాజం “తథాస్తు” అని చెప్పి యెహోవాను స్తుతించింది. వాగ్దానం ఇచ్చినట్లు ప్రజలు చేశారు కూడా.
14 అర్తహషస్తచక్రవర్తి ఏలుతున్న ఇరవైయో సంవత్సరంలో యూదాదేశంలో ప్రజలకు అధిపతిగా నియమించబడ్డాను. అప్పటినుంచి చక్రవర్తి పరిపాలించిన ముప్ఫయి రెండో సంవత్సరం వరకు – పన్నెండు సంవత్సరాలు – అధిపతికి నిర్ణయించిన భోజన పదార్థాలను నేను గానీ నా బంధువులు గానీ తీసుకోలేదు. 15 నాకు మునుపు ఉన్న అధిపతులు ప్రజలకు భారంగా ఉండి, వారిదగ్గరనుంచి భోజన పదార్థాలనూ ద్రాక్షరసాన్నీ నలభై తులాల వెండినీ తీసుకొనేవాళ్ళు. వాళ్ళ సేవకులు కూడా ప్రజలమీద పెత్తనం చేశారు. నేనైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి అలా ప్రవర్తించలేదు. 16 దానికి బదులుగా గోడమీద కష్టించి పని చేశాను. నా మనుషులంతా కూడా ఆ పని చేస్తూ వచ్చారు. మేము ఏమీ భూమి సంపాదించుకోలేదు. 17 నా బల్లదగ్గర యూదులూ అధికారులూ నూట యాభై మంది భోజనం చేసేవారు. వారు గాక మా చుట్టూరా ఉన్న జనాలలో నుంచి కొంతమంది వచ్చి నా బల్లదగ్గర తినేవారు. 18 నాకోసం ప్రతి రోజూ ఒక ఎద్దునూ ఆరు బలిసిన గొర్రెలనూ, కొన్ని కోళ్ళనూ సిద్ధం చేయడం జరిగేది. పది రోజులకు ఒకసారి అన్ని రకాల ద్రాక్షరసాలు సమృద్ధిగా తేవడం జరిగేది. అయినప్పటికీ, ప్రజలమీద భారం కఠినం కావడంచేత, అధిపతికి నియమించిన భోజన పదార్థాలను నేను కోరలేదు. 19 నా దేవా, నేను ఈ ప్రజలకోసం చేసిన దానంతటిని బట్టీ నన్ను జ్ఞాపకముంచుకొని కటాక్షించు.