4
1 మేము గోడను నిర్మిస్తూ ఉన్న సంగతి విని సన్‌బల్లట్✽ చాలా కోపంతో మండిపడ్డాడు. అతడు యూదులను ఎగతాళి✽ చేస్తూ, 2 షోమ్రోను సైన్యం ఎదుట, తన మిత్రుల ఎదుట ఇలా అన్నాడు: “దుర్బలమైన ఈ యూదులు చేస్తున్నదేమిటి? తమంతట తామే ఆ గోడను కట్టడం ముగించగలరా? బలులు అర్పిస్తారా? ఒక్క రోజులోనే ఆ పని ముగించ గలరా? కాలిపోయిన ఆ చెత్త కుప్పలలో నుంచి రాళ్ళను తీసుకొని కొత్తగా వాడుకోగలరా?” 3 అమ్మోనువాడు టోబీయా అతడి ప్రక్కన ఉండి, “వాళ్ళు కట్టినదానిమీదికి నక్క దూకితే వాళ్ళ రాతిగోడ కూలిపోతుంది” అన్నాడు.4 ✽మా దేవా, విను! మేము తృణీకారానికి గురి అయ్యాం. వాళ్ళ తిట్లు వాళ్ళ నెత్తిమీదికి వచ్చేలా చెయ్యి. వాళ్ళను దోపిడీగా చేసి బందీలుగా దేశాంతరం వెళ్ళేలా చెయ్యి. 5 ✝గోడను కట్టేవారికి వాళ్ళు విసుగు పుట్టించారు, గనుక వాళ్ళ అపరాధాన్ని కప్పివేయవద్దు, నీ దృష్టిలో నుంచి వాళ్ళ పాపాలను తుడిచివేయవద్దు.
6 పని చేసే మనసు ప్రజలకు ఉండడంచేత గోడ సగం ఎత్తు అయ్యేవరకు మేము కట్టాం. 7 అయితే జెరుసలం గోడల మరమ్మత్తు ముందుకు సాగుతూ ఉందనీ బీటలన్నీ మూసివేయబడుతూ ఉన్నాయనీ విని సన్‌బల్లట్, టోబీయా, అరబ్బులు, అమ్మోనువాళ్ళు, అష్డోద్✽ ఊరి వాళ్ళు చాలా కోపగించారు. 8 ✝జెరుసలం మీదికి యుద్ధానికి వచ్చి కలత కలిగించాలని వాళ్ళు ఏకగ్రీవంగా కుట్ర పన్నారు. 9 ✽కాని, మేము మా దేవునికి ప్రార్థన చేసి, వాళ్ళ భయంచేత రాత్రింబగళ్ళు కాపలాదారులను ఉంచాం. 10 ✽ఈ విధంగా జరుగుతూ ఉంటే యూదావారు “బరువులు మోసేవారి బలం తగ్గిపోయింది. శిథిలాలు చాలా ఎక్కువ. గోడ కట్టలేం” అన్నారు.
11 మా శత్రువులు “వాళ్ళకు తెలియకుండా, కనబడకుండా మనం వాళ్ళమధ్యకు చొరబడి, వాళ్ళను చంపి, పని అంతమొందిద్దాం” అన్నారు.
12 మా శత్రువుల దగ్గర కాపురముంటున్న యూదులు వచ్చి, “అన్ని దిక్కులనుంచి వాళ్ళు మనపై బడతారు” అని అనేక సార్లు మమ్మల్ని హెచ్చరించారు. 13 అందుచేత గోడకు పగులు ఉన్న స్థలాలలో తక్కువ ఎత్తు ఉన్న స్థలాలలో గోడవెనుక మనుషులను, వారి వంశాలప్రకారం నేను ఉంచాను. వారి చేతులలో ఈటెలూ కత్తులూ విండ్లూ ఉన్నాయి. 14 నేను తనిఖీ చేసినతరువాత నాయకుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రజల ఎదుట నిలబడి ఇలా అన్నాను: “వాళ్ళకు మీరు భయపడకండి✽. ప్రభువు అత్యంత ప్రభావం గలవాడు, బీకరుడు. ఆయనను మనసులో ఉంచుకొని✽ మీ తోబుట్టువులు, మీ కొడుకులు, కూతుళ్ళు, భార్యలు, ఇండ్లు శత్రువశం కాకుండా పోరాడండి.”
15 వాళ్ళ కుట్ర విషయం మాకు తెలియవచ్చిందనీ దేవుడు దానిని వమ్ము చేశాడనీ✽ మా శత్రువులు వార్తలు విన్నప్పుడు, మేమంతా, ఎవరి పనికి వారు, గోడదగ్గరికి వెళ్ళాం. 16 ✽అయితే ఆ రోజునుంచి నా పనివారిలో సగంమంది పని చేశారు, సగంమంది ఈటెలనూ, డాళ్ళనూ, విండ్లనూ, కవచాలనూ ధరించి నిలబడ్డారు. గోడ కట్టే యూదా ప్రజలందరి వెనుక అధికారులు నిలుచున్నారు.
17 బరువులు మోసేవారు ఒక చేతితో పని చేస్తూ, మరో చేతితో ఆయుధం పట్టుకొన్నారు. 18 గోడ కట్టేవారిలో ఒక్కొక్కరూ తన కత్తి నడుముకు కట్టుకొని పనిచేస్తూ వచ్చారు. బూర ఊదేవాడు నా దగ్గర నిలుచున్నాడు.
19 నేను నాయకులతో, అధికారులతో, మిగిలిన ప్రజలతో ఇలా అన్నాను: “పని గొప్పది, విస్తరించి ఉంది. మనం గోడమీద ఒకరొకరికి చాలా ఎడంగా ఉన్నాం. 20 కనుక ఎక్కడ నుంచి మీకు బూరధ్వని వినబడుతుందో అక్కడికి మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు✽.”
21 ఆ విధంగా మేము పని చేస్తూవచ్చాం. ఉదయంనుంచి నక్షత్రాలు కనిపించేవరకు సగంమంది ఈటెలు చేతపట్టుకొని ఉన్నారు.
22 ఆ కాలంలో నేను ప్రజలతో “ప్రతి ఒక్కరూ తన పనివాడితో కూడా జెరుసలంలోనే ఉండిపోవాలి. అప్పుడు వారు రాత్రివేళ మనకు కాపలాదారులుగా, పగలు పనివారుగా ఉండగలరు” అన్నాను. 23 ✽ఆ కాలంలో నేను గానీ నా బంధువులు గానీ నా పనివారు గానీ నా దగ్గర ఉన్న కాపలాదారులు గానీ బట్టలు తీసివేయలేదు. నీళ్ళకోసం పోతే కూడా మా ఆయుధాలు చేతపట్టుకొని ఉన్నాం.