3
1 ✽ప్రముఖయాజి అయిన ఎల్‌యాషీబు, అతని సాటి యాజులు పని మొదలు పెట్టి “గొర్రెల” ద్వారాన్ని కట్టారు. దానిని ప్రతిష్ఠించి దాని తలుపులు నిలిపారు. “మేయా” గోపురంవరకూ హననేల్ గోపురంవరకూ వారు గోడ కట్టి ప్రతిష్ఠించారు. 2 వారి ప్రక్కన ఉన్న భాగాన్ని యెరికో✽వారు కట్టారు. వారిదగ్గర ఇమ్రీ కొడుకు జక్కూరు కట్టాడు. 3 హస్సెనాయా వంశంవారు “చేపల” ద్వారాన్ని కట్టారు. వారు దానికి దూలాలను ఎత్తి, తలుపులు నిలిపి, తాళాలనూ అడ్డ గడియలనూ పెట్టారు. 4 వారి ప్రక్కన ఉన్న గోడను హక్కోజు మనుమడూ, ఊరియా కొడుకూ అయిన యెరేమోతు బాగు చేశాడు. వారిదగ్గర యెషేజబేల్ మనుమడూ, బెరెకయా కొడుకూ అయిన యెషుల్లాం, అతని దగ్గర బయానా కొడుకు సాదోకు గోడను బాగు చేశారు. 5 వారి ప్రక్కన ఉన్న గోడను తెకోవ గ్రామం వారు బాగు చేశారు. అయితే వారి నాయకులకు✽ తమ ప్రభువు పని చేయడానికి ఇష్టం లేకపోయింది.6 పాసెయ కొడుకు యెహోయాదా, బెసోదయా కొడుకు మెషుల్లాం, “పాత” ద్వారాన్ని బాగు చేశారు. దానికి దూలాలు ఎత్తి, తలుపులు నిలిపి, తాళాలనూ అడ్డగడియలనూ పెట్టారు. 7 వారి ప్రక్కన ఉన్న గోడను బాగు చేసినది గిబియోనువాడైన మెలటయా, మెరోనోతువాడైన యాదోను, గిబియోను పట్టణంవారు, మిస్పా గ్రామం వారు. యూఫ్రటీసు నది ఇవతల ఉన్న అధిపతి భవనంవరకు వారు గోడను బాగు చేశారు. 8 వారిదగ్గర బంగారం పనివారిలో హర్‌హయా కొడుకు ఉజ్జీయేల్ గోడను బాగు చేశాడు. అతని ప్రక్కన పరిమళ ద్రవ్యాలు చేసేవారిలో ఒకడైన హననయా పని చేశాడు. వారు “వెడల్పు” గోడవరకు జెరుసలంను బాగు చేశారు. 9 వారిదగ్గర హూరు కొడుకు రెపాయా బాగు చేశాడు (అతడు జెరుసలంలో సగం భాగానికి అధికారి). 10 అతని దగ్గర హరూమపు కొడుకు యెదాయా తన ఇంటికి ఎదురుగా ఉన్న గోడను బాగు చేశాడు. అతని దగ్గర హషబ్నెయా కొడుకు హట్టూషు పని జరిగించాడు. 11 హరీం కొడుకు మల్కీయా, పహత్ మోయాబు కొడుకు హష్షూబు ఇంకో భాగాన్ని, “అగ్నిగుండాల” గోపురాన్నీ బాగు చేశారు. 12 వారిదగ్గర హల్లోహెషు కొడుకు షల్లూం బాగు చేశాడు. (అతడు జెరుసలంలో సగం భాగానికి అధికారి.) అతనికి అతని కూతుళ్ళు సహాయం చేశారు.
13 హానూను, జానోహ కాపురస్థులు “లోయ” ద్వారాన్ని బాగు చేశారు. దానిని కట్టి దానికి తలుపులనూ తాళాలనూ అడ్డగడియలనూ పెట్టారు. అంతేగాక, “పెంట” ద్వారంవరకు ఉన్న గోడను (వెయ్యి మూరల దూరం) బాగు చేశారు. 14 రేకాబు కొడుకు మల్కీయా “పెంట” ద్వారాన్ని బాగు చేశాడు. (మల్కీయా బేత్ హక్కెరెం ప్రదేశానికి అధికారి.) అతడు దానిని కట్టి, దానికి తలుపులు నిలిపి తాళాలనూ అడ్డగడియలనూ పెట్టాడు. 15 మిస్పా ప్రదేశానికి అధికారి, కోల్‌హోజె కొడుకైన షల్లూం “ఊట” ద్వారాన్ని బాగు చేశాడు. దానిని కట్టి, దానికి పైకప్పు కట్టి, తలుపులు నిలిపి, తాళాలనూ అడ్డగడియలనూ పెట్టాడు. అంతేగాక “దావీదునగరం” నుంచి క్రిందికి వచ్చే మెట్లవరకు రాజు తోటదగ్గర ఉన్న “సిలోయం” మడుగు గోడను కూడా బాగు చేశాడు. 16 అతని అవతల ప్రక్కన, అజ్‌బూకు కొడుకు నెహెమ్యా పని జరిపాడు. (అతడు బేత్‌సూరు ప్రాంతంలో సగం భాగానికి అధికారి). దావీదు సమాధికి ఎదురుగా ఉన్న స్థలం వరకూ, కట్టబడ్డ మడుగువరకూ, “శూరుల ఇల్లు” ఉన్న స్థలంవరకూ బాగు చేశాడు. 17 అతని దగ్గర బానీ కొడుకు రెహూం అధికారం క్రింద లేవీగోత్రికులు బాగు చేశారు. అతని ప్రక్కన హషబయా తన భాగంలో బాగు చేశాడు. అతడు కెయిలా ప్రాంతంలో సగం భాగానికి అధికారి. 18 అతని దగ్గర హేనాదాదు కొడుకు బవ్వయి అధికారం క్రింద వారి తోబుట్టువులు బాగు చేశారు. బవ్వయి కెయిలా ప్రాంతంలో మరో సగం భాగానికి అధికారి. 19 అతని దగ్గర మిస్పాకు అధికారి, యేషూవ కొడుకు ఏజెరు ఇంకో భాగాన్ని బాగు చేశాడు. అది ఆయుధాల కొట్టు త్రోవకు ఎదురుగా ఉన్న స్థలంనుంచి గోడకోణం వరకు ఉన్న భాగం. 20 అతని దగ్గర, ఆ కోణంనుంచి ప్రముఖ యాజి అయిన ఎల్‌యాషీబు ఇంటి గుమ్మం వరకు ఉన్న ఇంకో భాగాన్ని జబ్బయి కొడుకు బారూకు ఆసక్తితో బాగు చేశాడు. 21 అతని దగ్గర హక్కోజ్ మనుమడూ, ఊరియా కొడుకూ అయిన మేరేమోతు ఇంకో భాగాన్ని బాగు చేశాడు. అది ఎల్‌యాషీబు ఇంటి గుమ్మంనుంచి ఆ ఇంటి కొనవరకు ఉండేది.
22 అతని దగ్గర ఉన్న భాగాన్ని బాగు చేసినది పరిసరాలలో కాపురముంటున్న యాజులు. 23 వారి దగ్గరగా బెన్యామీను, హష్షూబు తమ ఇంటికి ఎదురుగా గోడను బాగు చేశారు. వారి దగ్గరలో ఆననయా మనుమడూ, మయశేయా కొడుకూ అయిన అజర్యా తన ఇంటిదగ్గర బాగు చేశాడు. 24 అతని దగ్గరగా, అజర్యా ఇంటిదగ్గరనుంచి గోడ కోణం వరకు, మూలవరకు ఉన్న భాగాన్ని హేనాదాదు కొడుకు బిన్నూయి బాగు చేశాడు. 25 ఆ కోణానికి, కాపలాదారుల ఆవరణం దగ్గర ఉన్న రాజు భవనం మీదనుంచి నిలిచే గోపురానికీ ఎదురుగా ఉన్న భాగాన్ని ఊజయి కొడుకు పాలాల్ బాగు చేశాడు. అతని దగ్గరలో పరోషు కొడుకు పెదాయా పని చేశాడు. 26 ఓపెల్ కొండమీద నివసించే దేవాలయ సేవకులు తూర్పు దిక్కున “నీళ్ళ” ద్వారం వరకు, దానిమీద ఉన్న గోపురం వరకు బాగు చేశారు. 27 ✽వారి ప్రక్కన తెకోవ గ్రామం వారు ఆ గొప్ప గోపురంనుంచి ఓపెల్ గోడవరకు ఉన్న భాగాన్ని బాగు చేశారు.
28 “గుర్రం” ద్వారం అవతల యాజులు తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేశారు. 29 వారి దగ్గరగా ఇమ్మేరు కొడుకు సాదోకు తన ఇంటికి ఎదురుగా బాగు చేశాడు. అతని దగ్గరలో “తూర్పు” ద్వారానికి కాపలాదారుడూ, షెకనయా కొడుకూ అయిన షెమయా బాగు చేశాడు. 30 అతనిదగ్గర షెలెమయా కొడుకు హననయా, జాలాపు ఆరో కొడుకు హానూను మరో భాగాన్ని బాగు చేశారు. వారి ప్రక్కన బెరెకయా కొడుకు మెషుల్లాం తన గదికి ఎదురుగా బాగు చేశాడు. 31 అతని దగ్గరలో బంగారం పనివారిలో ఒకడైన మల్కీయా దేవాలయ సేవకుల కట్టడం వరకూ, “పరిశీలన” ద్వారానికి ఎదురుగా ఉన్న వర్తకుల స్థలం వరకూ, గోడ మూల దగ్గర ఉన్న గది వరకూ బాగు చేశాడు. 32 ఆ మూలదగ్గర ఉన్న గదినుంచి “గొర్రెల” ద్వారం✽వరకు ఉన్న భాగాన్ని బంగారం పనివారూ వర్తకులూ బాగు చేశారు.