2
1 అర్తహషస్త చక్రవర్తి పరిపాలించిన ఇరవైయో సంవత్సరం నీసాన్ నెలలో ఒక సారి చక్రవర్తి ద్రాక్షరసం త్రాగుదామని ఉండగా నేను ద్రాక్షరసం తీసుకొని అతనికి అందించాను. అంతకుముందు నేనెన్నడూ అతని ఎదుట దుఃఖంగా ఉన్నట్టు కనబడలేదు.2 కనుక చక్రవర్తి నన్ను చూచి “నీ ముఖం ఎందుకు దుఃఖంగా ఉంది? నీవు ఆరోగ్యంగా ఉన్నావు గదా. ఇది మనోవేదనే గాని వేరొకటి కాదు” అని నాతో అన్నాడు. నాకు చాలా భయం✽ వేసింది.
3 అయితే నేను “చక్రవర్తి చిరంజీవి అవుతాడు గాక! నా పూర్వీకుల సమాధులున్న నగరం✽ పాడైపోయిన స్థితిలో ఉందే. దాని ద్వారాల తలుపులు కాలిపోయివున్నాయి. అలాంటప్పుడు నా ముఖం దుఃఖంగా ఉండదా?” అని చక్రవర్తితో అన్నాను. 4 “ఏం కావాలని కోరుతున్నావు”? అని చక్రవర్తి నన్నడిగాడు. అప్పుడు పరలోక దేవునికి ప్రార్థన✽ చేసి, నేను చక్రవర్తితో ఇలా చెప్పాను:
5 “చక్రవర్తికి ఇష్టమైతే, మీరు మీ సేవకుడైన నన్ను దయ చూస్తూ ఉంటే, నా పూర్వీకుల సమాధులున్న నగరాన్ని తిరిగి కట్టించేలా✽ నన్ను యూదాకు పంపండి అని నా మనవి.”
6 అందుకు చక్రవర్తి (అతని ప్రక్కన రాణి కూర్చుని ఉంది) “నీది ఎన్ని రోజుల ప్రయాణం? ఎప్పుడు తిరిగి వస్తావు?” అని నన్ను అడిగాడు. నన్ను పంపడం చక్రవర్తికి అంగీకారంగా ఉంది, గనుక ఎంత కాలం పడుతుందో అది తెలియజేశాను.
7 ✽నేను చక్రవర్తితో ఇంకా ఇలా మనవి చేశాను: “చక్రవర్తికి ఇష్టమైతే, నేను వారి ప్రదేశాలద్వారా ప్రయాణం చేసి యూదాకు చేరేలా నది అవతల✽ ఉన్న అధిపతులకు తాకీదులు రాయించి నాకు ఇప్పించండి. 8 నగర ప్రాకారానికి, దేవాలయం దగ్గర ఉన్న కోటకూ, నేను నివాసం చేయబొయ్యే ఇంటికీ దూలాలు కావాలి కూడా. వాటికోసం మ్రానులు ఇచ్చేందుకు చక్రవర్తి అడవులపై ఉద్యోగియైన అసాపుకు కూడా తాకీదు ఇప్పించండి.”
నా దేవుని కరుణా హస్తం✽ నాకు తోడుగా ఉండడంచేత చక్రవర్తి✽ నా మనవులు అంగీకరించాడు. 9 ✽ తరువాత నేను నది అవతల ఉన్న అధిపతులదగ్గరికి వెళ్ళి, చక్రవర్తి తాకీదులు వారికి అందజేశాను. చక్రవర్తి నాతోకూడా సైన్యంలో ఉన్న ఉద్యోగులను కొంతమందిని, గుర్రపు రౌతులను పంపాడు.
10 హోరోను నివాసి సన్‌బల్లట్✽, అమ్మోను దేశం వాడైన టోబీయా అనే ఉద్యోగి నా గురించి విని ఖిన్నులయ్యారు. ఇస్రాయేల్ ప్రజలకు క్షేమం వృద్ధి చేయడానికి ఒక వ్యక్తి రావడం అంటే వాళ్ళకు ఏమీ నచ్చలేదు.
11 నేను జెరుసలంకు చేరి మూడు రోజులు అక్కడ గడిపిన తరువాత 12 ✽రాత్రిలో ఇంకా కొంతమందితో కూడా బయలుదేరాను. జెరుసలంకోసం ఏమి చేయాలనుకొన్నానో – దేవుడు నా మనసులో ఉంచిన ఆ తలంపులను – నేను ఎవరితోనూ చెప్పలేదు. ఆ రాత్రి నేను ఎక్కిన గుర్రం తప్ప మరేదీ నా దగ్గర లేదు. 13 రాత్రివేళ నేను “లోయ” ద్వారం గుండా “పాము” బావి వైపుకు, “పెంట” ద్వారం దగ్గరికి వెళ్తూ కూలిపోయిన జెరుసలం గోడలనూ కాలిపోయిన ద్వారాల తలుపులనూ తనిఖీ చేశాను. 14 అక్కడనుంచి “ఊట” ద్వారం దగ్గరికి “రాజు” మడుగుదగ్గరికి వెళ్ళాను గాని నేను ఎక్కిన గుర్రం ఇంకా ముందుకు పోవడానికి స్థలం లేదు, 15 గనుక ఆ రాత్రి నేను లోయగుండా వెళ్తూ, గోడలను తనిఖీ చేశాను. తరువాత వెనక్కు తిరిగి “లోయ” ద్వారంగుండా మళ్ళీ వచ్చాను. 16 యూదులకు గానీ యాజులకు గానీ యజమానులకు గానీ అధికారులకు గానీ ఆ పని చేయించే మరెవరికీ గానీ నేనేమి చెప్పలేదు, గనుక నేను ఎక్కడికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులు తెలుసుకోలేదు.
17 తరువాత నేను వారితో ఇలా అన్నాను: “మన దురవస్థ మీకు తెలుసు. జెరుసలం పాడైపోయిన✽ స్థితిలో ఉంది. దాని ద్వారాల తలుపులు కాలిపోయివున్నాయి. మనం ఇంకా నిందపాలు కాకుండా జెరుసలం గోడలను తిరిగి నిలుపుదాం రండి.”
18 ✽నాకు తోడుగా ఉన్న దేవుని కరుణా హస్తాన్ని గురించి చక్రవర్తి నాతో చెప్పిన మాటలను కూడా నేను వారికి తెలియజేశాను. అప్పుడు వారు “మనం నిర్మించడం ఆరంభిద్దాం రండి” అని చెప్పి, ఆ మంచి పని చేయడానికి బలంతో మొదలుపెట్టారు.
19 హోరోనువాడైన సన్‌బల్లట్, అమ్మోను వాడైన టోబీయా అనే ఉద్యోగస్థుడు, అరబీయ వాడైన గెషెం✽ దీని గురించి విన్నప్పుడు మమ్మల్ని హేళన✽ చేశారు, తృణీకారంతో “మీరు చేసేదేమిటి? చక్రవర్తి మీద తిరుగుబాటు చేస్తారా?” అని అడిగారు.
20 నేను వాళ్ళకు ఇలా జవాబిచ్చాను: “పరలోక దేవుడు తానే మా కృషి సఫలం✽ చేస్తాడు. మేము ఆయన సేవకులం. తిరిగి కట్టడానికి ఆరంభిస్తాం. మీకైతే జెరుసలంలో భాగం గానీ హక్కు✽ గానీ స్మృతిచిహ్నం గానీ లేదు.”