నెహెమ్యా
1
1 హకల్యా కొడుకు నెహెమ్యా✽ మాటలు: ఇరవైయో సంవత్సరం✽ కిసలేవ్ నెలలో నేను షూషన్✽ రాజభవనంలో ఉన్నప్పుడు, 2 నా సోదరులలో ఒకడైన హనానీ ఇంకా కొంతమందితో కూడా యూదా దేశం నుంచి వచ్చాడు. చెరనుంచి తప్పించుకొన్న మిగతా యూదులను గురించి, జెరుసలంనుగురించి నేను వారి నడిగాను. 3 ✽ వారు “చెరనుంచి వచ్చిన మిగతావారు యూదా దేశంలో చాలా బాధ, నింద పాలయ్యారు. జెరుసలం గోడ ఇంకా కూలిపోయిన స్థితిలో ఉంది. దాని తలుపులు కాలిపోయి ఉన్నాయి” అని నాతో చెప్పారు. 4 ✽ ఈ మాటలు విని నేను కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసముండి, పరలోక దేవునికి ఇలా ప్రార్థన చేశాను:5 “పరలోక దేవా! యెహోవా! భయభక్తులకు పాత్రుడైన గొప్ప దేవా✽! నిన్ను ప్రేమిస్తూ✽, నీ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించేవారిమీద కృప చూపుతూ, వారితో చేసిన ఒడంబడికను నిలుపుకొనే దేవుడివి. 6 నీ సన్నిధానంలో రాత్రింబగళ్ళు✽ నీ సేవకుడైన నేను నీ సేవకులైన ఇస్రాయేల్ ప్రజలకోసం చేస్తూవున్న ప్రార్థన శ్రద్ధతో విను, కండ్లారా చూడు. ఇస్రాయేల్ ప్రజలమైన మేము నీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను ఒప్పుకొంటున్నాను✽. నేనూ, నా తండ్రి వంశంవారూ పాపాలు చేశాం. 7 నీపట్ల మా ప్రవర్తన చాలా కుటిలమైనది✽. నీ సేవకుడైన మోషేద్వారా నీవు నిర్ణయించిన✽ ఆజ్ఞలను, చట్టాలను, న్యాయనిర్ణయాలను మేము శిరసావహించలేదు. 8 ✝నీ సేవకుడైన మోషేకు నీవు ఆదేశించిన మాట తలచుకో. నీవు అతనితో ఇలా అన్నావు గదా: ‘మీరు ద్రోహం చేస్తే, నేను జనాలలోకి మిమ్మల్ని చెదరగొట్టివేస్తాను. 9 అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలప్రకారం ప్రవర్తిస్తే భూమి కొనలవరకు మీరు చెదరిపోయి ఉన్నా, అక్కడనుంచి కూడా మిమ్ములను సమకూరుస్తాను✽, నా పేరు✽ ఉంచడానికి నేను ఎన్నుకొన్న స్థలానికి మిమ్ములను వచ్చేలా చేస్తాను.’
10 ✽“వారు నీ సేవకులు, నీ ప్రజలు. నీవు నీ మహా ప్రభావంతో, బలిష్ఠమైన హస్తంతో వారిని విడిపించావు. 11 కనుక, యెహోవా, నీ సేవకుడైన నా విన్నపం, నీ పేరుపట్ల భయభక్తులు✽ చూపడానికి ఆనందించే నీ సేవకుల విన్నపం శ్రద్ధతో ఆలకించు. ఈ రోజు నీ సేవకుడైన నా పని సఫలమయ్యేలా చెయ్యి. ఈ మనిషి✽ నామీద దయ చూపేలా చెయ్యి.” నేను చక్రవర్తికి పానపాత్ర అందించేవాణ్ణి.✽