9
1 ఈ సంగతులు ముగిసిన తరువాత, నాయకులు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “ఇస్రాయేల్ ప్రజలు – యాజులూ లేవీగోత్రికులూ కూడా – చేసినది ఏమిటంటే, ఈ ప్రదేశాలలో ఉన్న కనాను జాతి, హిత్తి, పెరిజ్జి, యెబూసి, అమ్మోను, మోయాబు, ఈజిప్ట్, అమోరీ జాతులలో నుంచి తమను ప్రత్యేకించుకోకుండా, వాళ్ళ నీచమైన పనులు తామే చేశారు. 2 అలాంటివాళ్ళ కూతుళ్ళను పెండ్లి చేసుకొన్నారు, తమ కొడుకులకు చేశారు. ఇలా ప్రత్యేకంగా ఉండవలసిన ప్రజ ఈ ప్రదేశాల జనాలతో కలిసిపోయింది. ఈ విధంగా ద్రోహం చేసినవాళ్ళలో నాయకులు, అధికారులే ముఖ్యులు.”
3  ఇది విని నేను నా అంగీని, పై వస్త్రాన్ని చింపుకొని, నా తలనుంచి, గడ్డంనుంచి వెండ్రుకలను పీకివేసి, నిర్ఘాంతపోయి కూర్చున్నాను. 4 అప్పుడు చెరనుంచి వచ్చినవారి ద్రోహం కారణంగా, ఇస్రాయేల్ ప్రజల దేవుని వాక్కంటే భయభక్తులతో వణకే వారందరూ నాదగ్గరికి సమకూడారు. 5 నేను నిర్ఘాంతపడుతూ, యాజులు సందెవేళ బలి అర్పించే సమయంలో నన్ను నేను కుంగిపోయిన స్థితినుంచి తేరుకొని లేచాను. చింపుకొనివున్న అంగీ, పై వస్త్రంతోనే మోకాళ్ళమీద పడి, నా దేవుడు యెహోవా వైపు చేతులెత్తి, ఇలా ప్రార్థన చేశాను:
6 “నా దేవా! నా ముఖం నీవైపు ఎత్తుకొందామంటే నాకు కలవరం, సిగ్గు. దేవా! మా దోషాలు మా తలల కంటే ఎత్తుగా, మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగాయి. 7 మా పూర్వీకుల రోజులనుంచి ఈ రోజువరకు మేము ఘోరమైన అపరాధులం. మా దోషాల కారణంగా మేము, మా రాజులు, మా యాజులు ఇతర దేశాల రాజుల వశమై, ఖడ్గానికీ, చెరకూ, దోపిడీకి, బహిరంగ అవమానానికీ గురి అయ్యాం. ఈ రోజు కూడా అలా జరుగుతూ ఉంది. 8 అయితే కొంత కాలంనుంచి మా దేవుడు యెహోవా మాలో కొంతమందిని తప్పించుకోనిచ్చి, తన పవిత్ర స్థలంలో మమ్మల్ని స్థిరులుగా చేసి, మామీద అనుగ్రహం చూపాడు. ఈ విధంగా మా దేవుడు మా కళ్ళకు వెలుగిచ్చి, మా దాస్యంలో మమ్మల్ని కొంతమట్టుకు బ్రతికించాడు. 9 మేము దాసులం అయినా మా దేవుడు మమ్మల్ని మా దాస్యంలో విడిచిపెట్టలేదు. పారసీకదేశ చక్రవర్తులను మాపట్ల దయ చూపేలా చేశాడు. మా దేవుని ఆలయాన్ని మళ్ళీ కట్టడానికి, దాని పాడైన స్థలాలను తిరిగి బాగు చేయడానికి ఆయన మమ్మల్ని బ్రతికించాడు. యూదాలో, జెరుసలంలో మాకు ఒక ఆశ్రయాన్ని ప్రసాదించాడు. 10 మా దేవా! ఇదంతా జరిగినతరువాత మేమేం చెప్పగలం? నీ సేవకులైన ప్రవక్తలచేత ఇప్పించిన ఆజ్ఞలను పెడచెవిని పెట్టాం. 11 వారు – ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం దాని జనాల అశుద్ధతచేత అశుద్ధమైంది. వాళ్ళు చేసిన నీచ కార్యాలతో, అసహ్యమైనవాటితో ఆ దేశం నలుదిక్కుల నిండిపోయింది. 12 అందుచేత మీరు మీ కూతుళ్ళను వాళ్ళ కొడుకులకు ఇవ్వకండి. వాళ్ళ కూతుళ్ళను మీ కొడుకులకు పెండ్లి చేయకండి, వాళ్ళకు క్షేమం, శ్రేయస్సు కలగాలని ఎప్పుడూ సహాయం చేయకండి. అప్పుడు మీరు బలంగా ఉండి దేశంలోని మంచివాటిని అనుభవిస్తారు. మీ సంతానానికి ఎప్పటికీ ఉండే వారసత్వంగా దానిని అప్పగిస్తారు’ అని చెప్పిన మాటలను పెడచెవిని పెట్టాం.
13 “మా చెడ్డ పనులు, ఘోరమైన అపరాధం కారణంగా ఈ బాధలన్నీ మామీదికి వచ్చాయి. అయినా మా దేవా, నీవు మా దోషాలకు తగినదానికంటే తక్కువ శిక్ష మామీద పెట్టి ఈ విధంగా కొంతమందిని చెరనుంచి తప్పించుకు వచ్చేలా చేశావు. 14 ఇదంతా జరిగిన తరువాత మేము మరో సారి నీ ఆజ్ఞలు మీరి, ఇలాంటి నీచ కార్యాలు జరిగించే జనాలతో సంబంధాలు చేసుకొంటామా? అలాగైతే నీవు మామీద కోపగించి, ఎవ్వరూ తప్పించుకోకుండా మిగిలినవారెవ్వరూ లేకుండా మమ్మల్ని నాశనం చేయవా? 15 యెహోవా! ఇస్రాయేల్ ప్రజల దేవా! నీవు న్యాయవంతుడివి. ఈ రోజున మిగిలిన మేము కొద్దిమందిమి మాత్రమే. ఇదిగో, మేము నీ సన్నిధానంలో అపరాధులం. మా అపరాధం కారణంగా మాలో ఎవ్వరూ నీ ఎదుట నిలబడలేదు.”