8
1 ✝అర్తహషస్త చక్రవర్తి పరిపాలనలో బబులోనునుంచి నాతోకూడా వచ్చిన కుటుంబ నాయకుల వంశావళి:2 ఫీనెహాసు వంశంలో గెర్‌షోం; ఈతామారు వంశంలో దానియేలు; దావీదు వంశంలో హట్టూషు; 3 పరోషు సంతానంలో ఉన్న షెకన్యా వంశంలో జెకర్యా, అతనితో కూడా వంశావళిలో ఉన్న నూట యాభైమంది పురుషులు; 4 పహత్ మోయాబు వంశంలో జెరహ్యా కొడుకు ఎల్యోయేనై, అతనితో కూడా రెండు వందలమంది పురుషులు; 5 షెకన్యా వంశంలో యహజీయేల్ కొడుకు, అతనితో కూడా మూడు వందలమంది పురుషులు; 6 ఆదీను వంశంలో యోనాతాను కొడుకు ఎబెదు, అతనితో కూడా యాభైమంది పురుషులు; 7 ఏలాం వంశంలో అతల్యా కొడుకు యెషయా, అతనితో కూడా డెబ్భయిమంది పురుషులు; 8 షెపట్య వంశంలో మిఖాయేల్ కొడుకు జెబద్యా, అతనితోకూడా ఎనభైమంది పురుషులు; 9 యోవాబు వంశంలో యెహీయేల్ కొడుకు ఓబద్యా, అతనితోకూడా రెండు వందల పద్ధెనిమిదిమంది పురుషులు; 10 షెలోమీతు వంశంలో యోసిప్యా కొడుకు, అతనితోకూడా నూట అరవైమంది పురుషులు; 11 బేబయి వంశంలో బేబయి కొడుకు జెకర్యా, అతనితోకూడా ఇరవై ఎనిమిదిమంది పురుషులు; 12 అజ్‌గాదు వంశంలో హక్కాటాను కొడుకు యోహానాను, అతనితో కూడా నూట పదిమంది పురుషులు; 13 అదోనీకాం సంతానంలో చిన్న కొడుకులు ఎలీపేలెట్, యెహీయేల్, షెమయా, వారితోకూడా అరవైమంది పురుషులు; 14 బిగ్‌వయి వంశంలో ఊతయి, జబ్బూదు, వారితోకూడా డెబ్భై మంది పురుషులు.
15 నేను వారిని అహవా✽వైపుకు పారే కాలువ దగ్గర సమకూర్చాను. అక్కడ మేము మూడు రోజులు మకాం చేశాం. నేను ప్రజలను, యాజులను చూచినప్పుడు లేవీగోత్రికులెవ్వరూ నాకు కనిపించలేదు. 16 అందుచేత నేను నాయకులుగా ఉన్న ఎలీయెజెరును, అరీయేల్‌ను, షెమయాను, ఎల్‌నాతానును, యారీబ్‌ను, ఎల్‌నాతానును, నాతానును, జెకర్యాను, మెషుల్లాంను, తెలివైనవారు యోయారిబ్‌ను, ఎల్‌నాతానును పిలిచాను. 17 కాసిపియా ఊరిలో ఉన్న నాయకుడైన ఇద్దోదగ్గరికి పంపి, మన దేవుని ఆలయానికి పరిచారకులను మనదగ్గరికి తీసుకువచ్చేలా అక్కడ ఉన్న ఇద్దోతో, అతని బంధువులైన దేవాలయ సేవకులతో చెప్పవలసిన మాటలు వారికి తెలియజేశాను. 18 మన దేవుని కరుణా హస్తం మాకు తోడుగా ఉంది, గనుక వారు షేబేరియాను, అతని కొడుకులను, సోదరులను పద్దెనిమిదిమందిని తీసుకువచ్చారు. ఈ షెబేరియా తెలివైనవాడు. మహలి వంశంవాడు. మహలి ఇస్రాయేల్ కొడుకు లేవీ వంశంవాడు. 19 వారు మెరారీ వంశంలో ఉన్న హషబియాను, యెషయాను, అతని సోదరులను, వారి కొడుకులను – మొత్తం ఇరవైమందిని – తీసుకువచ్చారు. 20 దేవాలయ పరిచారకులను రెండు వందల ఇరవై మందిని కూడా తీసుకువచ్చారు. (లేవీగోత్రికులకు సహాయం చేయడానికి దావీదు, అధిపతులు అలాంటి పరిచారకుల గుంపును నియమించారు.) వారందరి పేర్లు జాబితాలో వ్రాసి ఉన్నాయి.
21 అప్పుడు దేవుని సన్నిధానంలో మమ్మల్ని మేమే తగ్గించుకొని మేము, మా సంతానం, మాకు కలిగినదంతా ప్రయాణం క్షేమంగా చేసేందుకు దేవుణ్ణి వేడుకొందామని అహవా కాలువదగ్గర ఉపవాసాన్ని✽ ప్రకటించాను. 22 ✽“ఆయనను వెదికే వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండి మేలు చేకూరుస్తుంది. కానీ ఆయనను విసర్జించినవారందరిమీద ఆయన తీవ్ర కోపం ఉంటుంది” అని అంతకుముందు మేము చక్రవర్తితో చెప్పాం. కనుక దారిన శత్రువుల బారినుంచి మమ్మల్ని కాపాడడానికి కాల్బలాన్ని, రౌతులను మాతోకూడా పంపించమని చక్రవర్తిదగ్గర విన్నపం చేయడం నాకు సిగ్గు అనిపించింది. 23 ✝మేము ఉపవాసముండి ప్రయాణం విషయం మా దేవుణ్ణి ప్రాధేయపడ్డాం. ఆయన మా విన్నపం అంగీకరించాడు.
24 ముఖ్యమైన యాజులను పన్నెండుమందిని, షేరేబియాను, హషబియాను, వాళ్ళ బంధువులలో పదిమందిని ప్రత్యేకించాను. 25 మా దేవుని ఆలయం కోసం చక్రవర్తి, అతని మంత్రులు, అధిపతులు, అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరూ అర్పించిన వెండి బంగారాలను, పాత్రలను తూచి వారికి అప్పగించాను. 26 నేను తూచి వారికప్పగించినది ఏమంటే, ఇరవై రెండు వేల కిలోగ్రాముల వెండి, మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండి పాత్రలు, మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల బంగారం, 27 ఇరవై బంగారు గిన్నెలు (మొత్తం ఏడు వేల తులాల బంగారం), బంగారమంతటి వెలగల మెరుగైన రెండు కంచు పాత్రలు. 28 అప్పుడు నేను వారితో ఇలా అన్నాను: “మీరు యెహోవాకు పవిత్రమైనవారు. పాత్రలూ పవిత్రమైనవి. ఈ వెండి బంగారాలు మీ పూర్వీకుల దేవుడు యెహోవాకు స్వేచ్ఛార్పణలు. 29 జెరుసలంలో యెహోవా ఆలయం ఖజానా గదులలో, ముఖ్యమైన యాజులు, లేవీగోత్రికులు, ఇస్రాయేల్ ప్రజల వంశాల నాయకుల ఎదుట వాటిని తూచి అప్పగించేవరకు మీరు వాటిని భద్రంగా✽ కాపాడండి.” 30 అప్పుడు తూచిన ఆ వెండి బంగారాలను, పాత్రలను జెరుసలంలో ఉన్న మన దేవుని ఆలయానికి వెంటబెట్టుకురావడానికి యాజులూ లేవీ గోత్రికులూ తీసుకొన్నారు.
31 మొదటి నెల పన్నెండో రోజున జెరుసలంకు ప్రయాణం✽ చేయడానికి మేము అహవా కాలువ దగ్గరనుంచి బయలుదేరాం. మా దేవుని హస్తం✽ మాకు తోడుగా ఉంది. ఆయన మమ్మల్ని శత్రువుల బారినుంచి, బందిపోటు దొంగల బారినుంచి కాపాడాడు. 32 కనుక మేము జెరుసలం చేరుకొన్నాం. అక్కడ మేము మూడు రోజులు విశ్రాంతి తీసుకొన్నాం. 33 ✝నాలుగో రోజున మన దేవుని ఆలయంలో వెండి బంగారాలను, పాత్రలను తూచి ఊరియా కొడుకు మెరేమోతుయాజికి అప్పగించాం. అతనితో కూడా ఫీనెహాసు కొడుకు ఎలియాజరు ఉన్నాడు. వారితో లేవీవాడూ యేషూవ కొడుకూ అయిన యోజాబాదు, లేవీవాడూ బిన్నూయి కొడుకూ అయిన నోవదియా కూడా ఉన్నారు. 34 వారు అన్నిటినీ లెక్కపెట్టారు, తూచారు, వాటి బరువు ఎంతో పుస్తకంలో వ్రాశారు.
35 ✽బందీలుగా దేశాంతరానికి వెళ్ళిన వారి సంతానం చెరనుంచి వచ్చిన తరువాత ఇస్రాయేల్ ప్రజల దేవునికి హోమబలులు అర్పించారు. ఇస్రాయేల్ ప్రజలందరికోసం పన్నెండు ఆబోతులను, తొంభై ఆరు పొట్టేళ్ళను, డెబ్భై ఏడు గొర్రెపిల్లలను పాపాలకోసమైన బలిగా పన్నెండు మేకపోతులను హోమబలిగా యెహోవాకు అర్పించారు. 36 ✝చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞలున్న దస్తావేజును యూఫ్రటీసునది ఇవతల ఉన్న రాష్ట్ర పాలకులకూ అధిపతులకూ ఇచ్చివేశారు. అప్పుడు వీరు ఇస్రాయేల్ ప్రజలకు, దేవుని ఆలయం పనికి సహాయం చేశారు.