7
1 ఈ సంగతులు✽ జరిగిన తరువాత, పారసీకదేశం చక్రవర్తి అర్తహషస్త పరిపాలన కాలంలో ఎజ్రా✽ బబులోను నుంచి జెరుసలంకు వచ్చాడు. అతని వంశవృక్షం ఇలా ఉంది: 2-5 ప్రముఖయాజి అయిన అహరోను కొడుకు✽ ఎలియాజరు. ఎలియాజరు కొడుకు ఫీనెహాసు. ఫీనెహాసు కొడుకు అబీషూవ. అబీషూవ కొడుకు బుక్కీ. బుక్కీ కొడుకు ఉజ్జీ. ఉజ్జీ కొడుకు జెరహ్యా. జెరహ్యా కొడుకు మెరాయోతు. మెరాయోతు కొడుకు అజర్యా. అజర్యా కొడుకు అమర్యా. అమర్యా కొడుకు అహీటూబ్. అహీటూబ్ కొడుకు సాదోకు. సాదోకు కొడుకు షల్లూం. షల్లూం కొడుకు హిల్కీయా. హిల్కీయా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు శెరాయా. శెరాయా కొడుకు ఎజ్రా. 6 ✽ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ప్రసాదించిన మోషే ధర్మశాస్త్రంలో అతడు ఆరితేరిన✽ ధర్మశాస్త్రి. అతని దేవుడు యెహోవా చెయ్యి అతనికి తోడుగా✽ ఉండడం వల్ల అతడు అడిగిన ప్రతిదానినీ చక్రవర్తి ఇచ్చాడు. 7 అర్తహషస్త చక్రవర్తి పరిపాలించిన ఏడో ఏట మరి కొందరు ఇస్రాయేల్ ప్రజలు, కొంతమంది యాజులు, లేవీ గోత్రికులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు జెరుసలంకు వచ్చారు.8 ఆ చక్రవర్తి పరిపాలనలో ఏడో సంవత్సరం అయిదో నెల ఎజ్రా జెరుసలంకు చేరుకొన్నాడు. 9 ✽అతడు మొదటి నెల మొదటి రోజున బబులోనునుంచి బయలుదేరాడు. తన దేవుని కరుణా హస్తం తనకు తోడుగా ఉండడం వల్ల అయిదో నెల మొదటి రోజున జెరుసలం చేరుకొన్నాడు 10 యెహోవా ప్రసాదించిన ధర్మశాస్త్రాన్ని చదువుకోవడానికి, దాని ప్రకారం ప్రవర్తించడానికి, దాని చట్టాలు, న్యాయ నిర్ణయాలు, ఇస్రాయేల్ ప్రజలకు నేర్పడానికి ఎజ్రా✽ చాలా శ్రద్ధ వహించేవాడు.
11 యెహోవా ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు, చట్టాల విషయాలలో విద్వాంసుడైన ఎజ్రాయాజికి అర్తహషస్తచక్రవర్తి ఇచ్చిన జాబు నకలు ఇది: 12 “పరలోక దేవుని✽ ధర్మశాస్త్రం విషయం విద్వాంసుడైన ఎజ్రాయాజికి క్షేమం. రాజులకు రాజు✽ అర్తహషస్త వ్రాసేదేమిటంటే, 13 నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రం విషయం యూదా, జెరుసలం పరిస్థితులను తనిఖీ చేయడానికి చక్రవర్తి, ఆయన ఏడుగురు మంత్రులు✽ నిన్ను పంపుతున్నారు, గనుక నేను ఇలా నిర్ణయించాను: 14 నా రాజ్యంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలలో, యాజులలో, లేవీగోత్రికులలో ఎవరైనా జెరుసలంకు వెళ్ళడానికి ఇష్టపడితే నీతోకూడా వెళ్ళవచ్చు. 15 అంతేగాక, ఇస్రాయేల్ ప్రజల దేవునికి (ఆయన నివాసం జెరుసలంలో ఉంది గదా) చక్రవర్తి, అతని మంత్రులు ఇష్టపూర్వకంగా అర్పించిన వెండి బంగారాలను నీవు తీసుకువెళ్ళాలి. 16 బబులోను ప్రదేశమంతా నీకు దొరికే వెండి బంగారాలంతా, ప్రజలు, యాజులు జెరుసలంలో ఉన్న తమ దేవుని ఆలయానికి ఇష్టపూర్వకంగా అర్పించేవాటిని కూడా నీవు తీసుకుపోవాలి. 17 జాగ్రత్త వహించి, నీవు ఆ ద్రవ్యంతో ఎద్దులను, పొట్టేళ్ళను, గొర్రెపిల్లలను, వాటికి సంబంధించిన నైవేద్యాలను, పానార్పణలను కొని, జెరుసలంలో ఉన్న మీ దేవుని ఆలయం బలిపీఠం మీద వాటిని అర్పించాలి. 18 మిగతా వెండి బంగారాలతో మీ దేవుని చిత్తానుసారంగా నీకూ నీ సాటి యూదులకూ మంచిదని తోచినట్టు చేయవచ్చు. 19 నీ దేవుని ఆలయ సేవకోసం నీకు ఇచ్చిన పాత్రలను జెరుసలంలో ఉన్న దేవుని సన్నిధానంలో అప్పగించు. 20 ✽నీ దేవుని ఆలయానికి కావలసిన ఏదైనా నీవు ఇవ్వాలనుకొంటే అది రాజ ధనాగారంలో నుంచి నీకివ్వబడుతుంది.
21 “నేను – అర్తహషస్త చక్రవర్తిని – నది అవతల ఉన్న ఖజానాదారులకు ఇలా ఆజ్ఞ జారీ చేస్తున్నాను: పరలోక దేవుని ధర్మశాస్త్ర విషయంలో విద్వాంసుడైన ఎజ్రాయాజి మిమ్మల్ని ఏదైనా అడిగితే ఆలస్యం చేయకుండా మీరు దానిని ఇవ్వాలి. 22 మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండి వరకు, వెయ్యి తూముల గోధుమలవరకు, రెండు వేల రెండు వందల లీటర్ల ద్రాక్షరసం వరకు, రెండు వేల రెండు వందల లీటర్ల నూనె వరకు, కొలత లేకుండా ఉప్పు అతనికి ఇవ్వాలి. 23 ✽ పరలోక దేవుడు ఏది నిర్ణయించాడో అది పరలోక దేవుని ఆలయంకోసం జాగ్రత్తగా చేయాలి. లేకపోతే చక్రవర్తికి, ఆయన కుమారులకు చెందిన రాజ్యంమీదికి దేవుని కోపం వస్తుందేమో. 24 నేను చేసిన మరో నిర్ణయమేమంటే, యాజులలో, లేవీగోత్రికులలో, గాయకులలో, ద్వారపాలకులలో, దేవాలయ సేవకులలో ఆలయంలో పని చేసేవాళ్ళలో ఎవరికైనా శిస్తు గానీ, సుంకం గానీ, పన్ను గానీ వేయడానికి మీకు అధికారం లేదు.
25 ✽“ఎజ్రా, నది అవతల ఉన్న ప్రజలకు న్యాయం తీర్చడానికి నీ దేవుడు నీకు ప్రసాదించిన జ్ఞానం ప్రకారం నీవు అధికారులనూ న్యాయాధిపతులనూ నియమించాలి. వారందరూ నీ దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న చట్టాలు తెలుసుకొన్నవారుగా ఉండాలి. ఆ చట్టాలు తెలియనివారికి నీవు నేర్పించాలి. 26 నీ దేవుడు ఇచ్చిన చట్టాలకు గానీ చక్రవర్తి ఇచ్చిన చట్టాలకు గానీ ఎవడైనా లోబడకపోతే, ఖచ్చితంగా వాడు తీర్పుకు గురి కావాలి. వాడికి మరణశిక్ష గానీ దేశ భ్రష్టత గానీ ఆస్తి జప్తు గానీ ఖైదు గానీ విధించాలి.”
27 జెరుసలంలో ఉన్న యెహోవా దేవాలయానికి ఘనత చేకూర్చడానికి చక్రవర్తి మనసులో ఇలాంటి ఆలోచన పుట్టించినందుచేత మన పూర్వీకుల దేవుడు యెహోవాకు స్తుతి✽ కలుగుతుంది గాక! 28 చక్రవర్తి, అతని మంత్రులు, పలుకుబడి గల అతని అధిపతులు అందరూ నా మీద✽ దయ చూపేలా ఆయన చేశాడు. నా దేవుడు యెహోవా హస్తం✽ నాకు తోడుగా ఉండడంవల్ల నేను ధైర్యం వహించి, నాతో కూడా రావడానికి ఇస్రాయేల్ ప్రజల నాయకులను కొంతమందిని సమకూర్చాను.