6
1 అప్పుడు దర్యావేషు చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళు బబులోను ఖజానాలో ఉన్న దస్తావేజుల శాలలో వెదికారు. 2 మాదీయ✽ ప్రాంతంలో ఉన్న ఎక్‌బతానా✽ పట్టణంలో చుట్టిన పత్రం ఒకటి దొరికింది. దానిలో ఇలా వ్రాసి ఉన్నది:3 “కోరెషు చక్రవర్తి పరిపాలించిన మొదటి సంవత్సరంలో ఆయన జెరుసలంలో ఉన్న దేవుని ఆలయాన్ని గురించి ఈ ఆజ్ఞ జారీ చేశాడు: బలులు అర్పించే స్థలంగా ఆలయం పునాదులను వేసి, ఆలయాన్ని కట్టించనివ్వాలి. దాని ఎత్తు అరవై మూరలు, దాని వెడల్పు✽ అరవై మూరలు ఉండాలి. 4 మూడు వరుసలు గొప్ప రాళ్ళతో, ఒక్క వరుస మ్రానులతో ఇది కట్టబడాలి. దానికి ఖర్చులు రాజ ధనాగారంలోనుంచి రావాలి. 5 ✝అంతేగాక, జెరుసలంలో ఉన్న దేవుని ఆలయంలోనుంచి నెబుకద్‌నెజరు బబులోనుకు తీసుకువచ్చిన దాని వెండి బంగారు వస్తువులను మళ్ళీ జెరుసలంలో ఉన్న ఆలయానికి తీసుకుపోవాలి, దేవుని ఆలయంలో వాటి స్థలాలలో ఉంచాలి.”
6 ✝“నది అవతల అధిపతి తత్తెనయీ, షెతర్‌బోజనయీ, మీరూ, నది అవతల మీ సాటి ఉద్యోగులూ ఆ స్థలానికి దూరంగా ఉండాలి. 7 ✽దేవుని ఆలయం పనిని ఆటంకపరచవద్దు. యూదుల అధికారిని, పెద్దలను దేవుని ఆలయాన్ని దాని స్థలంలో కట్టించనియ్యాలి. 8 ✽అంతేగాక, దేవుని ఆలయాన్ని కట్టించేలా యూదుల పెద్దలకు మీరు ఇలా సహాయం చేయాలని నిర్ణయించాను: రాజ ధనాగారంలోకి నది అవతలనుంచి వచ్చిన పన్నులోనుంచి వాళ్ళ ఖర్చులకు కావలసిన దాన్నంతా ఇవ్వాలి. వాళ్ళ పని ఆగకూడదు. 9 వాళ్ళు పరలోక దేవునికి ఇష్టమైన బలులు అర్పించి, చక్రవర్తి, ఆయన కుమారుల శ్రేయస్సుకోసం ప్రార్థన చేసేలా వాళ్ళకు కావలసిన వాటన్నిటినీ ప్రతిరోజూ ఇవ్వాలి. 10 ✽జెరుసలంలో ఉన్న యాజులు అడిగేప్రకారం పరలోక దేవునికి హోమబలులు అర్పించడానికి దూడలను, పొట్టేళ్ళను, గొర్రెపిల్లలను, గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, నూనె వాళ్ళకు తప్పనిసరిగా ఇవ్వాలి. 11 ✽ ఇంకా నేను నిర్ణయించినదేమిటంటే, ఎవడైనా సరే ఈ ఆజ్ఞ శిరసావహించకపోతే, వాడి ఇంటి దూలాల్లో ఒకదానిని తీసి, నిలవబెట్టి, దానిమీద వాణ్ణి ఉరితీయాలి. వాడి తప్పు కారణంగా వాడి ఇల్లు చెత్త కుప్పగా చేయాలి. 12 ఏ రాజైనా సరే, ఈ ఆజ్ఞను భంగం చేయడానికి, జెరుసలం దేవాలయాన్ని నాశనం చేయడానికి చెయ్యి చాపితే, అక్కడ తన పేరు ఉంచుకొన్న దేవుడు ఆ రాజును గానీ ఆ జనాన్ని గానీ నాశనం చేస్తాడు గాక! నేనే – దర్యావేషు – ఈ ఆజ్ఞ జారీ చేశాను. దీని ప్రకారమే అంతా జరగాలి.”
13 అప్పుడు నది ఇవతల అధిపతి తత్తెనయి✽, షెతర్‌బోజనయి, వాళ్ళ సాటి ఉద్యోగులు, దర్యావేషు చక్రవర్తి పంపించిన ఆజ్ఞ ప్రకారమే అంతా జరిగించారు. 14 కనుక యూదుల పెద్దలు ఆలయాన్ని కట్టిస్తూ వచ్చారు. హగ్గయిప్రవక్త, ఇద్దో మనుమడైన జెకర్యా✽ దేవునిమూలంగా పలికిన వాక్కులచేత వారు వర్ధిల్లుతూ ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజల దేవుని ఆజ్ఞ ప్రకారం, పారసీకదేశం చక్రవర్తులు కోరెషు, దర్యావేషు, అర్తహషస్త✽ల ఆజ్ఞప్రకారం వారు ఆలయం పని ముగించారు. 15 దర్యావేషు✽ చక్రవర్తి పరిపాలించిన ఆరో సంవత్సరం ‘ఆదార్’ నెల మూడో రోజున ఆలయాన్ని కట్టడం ముగించారు. 16 అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు, యాజులు, లేవీగోత్రికులు, చెరనుంచి వచ్చిన మిగతావారు దేవుని ఆలయాన్ని ఆనందంతో ప్రతిష్ఠించారు. 17 దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు నూరు ఆబోతులను, రెండు వందల పొట్టేళ్ళను, నాలుగు వందల గొర్రెపిల్లలను అర్పించారు. ఇస్రాయేల్ ప్రజలందరికీ పాపాలకోసమైన బలి✽గా – ఇస్రాయేల్ గోత్రాల లెక్కప్రకారం – పన్నెండు మేకపోతులను కూడా అర్పించారు. 18 అప్పుడు వారు జెరుసలంలో దేవుని సేవకోసం, మోషే గ్రంథంలో వ్రాసినదాని ప్రకారం, యాజులను గుంపులుగా, లేవీగోత్రికులను వరుసలుగా నియమించారు.
19 ✝చెరనుంచి వచ్చినవారు మొదటి నెల పద్నాలుగో రోజున పస్కా పండుగ ఆచరించారు. 20 యాజులు, లేవీగోత్రికులు తమను శుద్ధం చేసుకొన్నారు. వారందరూ శుద్ధంగా ఉన్నారు✽. చెరనుంచి వచ్చినవారందరికోసం, తమ సాటి యాజులకోసం, తమకోసం పస్కాపండుగ గొర్రెపిల్లలను వధించారు. 21 చెరనుంచి తిరిగి వచ్చిన ఇస్రాయేల్ ప్రజలు వాటిని తిన్నారు. ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాను వెదకడానికి దేశంలో ఇతర జనాల అశుద్ధ ప్రవర్తననుంచి తమను వేరు చేసుకొన్న✽ వారందరూ కూడా వాటిని తిన్నారు. 22 ఏడు రోజులు వారు పొంగని రొట్టెల✽ పండుగ కూడా ఆనందంతో ఆచరించారు. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజల దేవుని ఆలయం పని విషయం యెహోవా వారిపట్ల అష్షూరు✽ రాజు మనసును మార్చి వారిని ధైర్యపరచేలా చేసి, వారిని ఆనందభరితులను చేశాడు.