5
1 హగ్గయి ప్రవక్త, ఇద్దో మనుమడైన జెకర్యా ప్రవక్త యూదాలో, జెరుసలంలో ఉన్న యూదులకు, వారికి తోడుగా ఉన్న ఇస్రాయేల్ ప్రజల దేవుని పేర పరవశులై ప్రకటించారు. 2 అప్పుడు షయల్‌తీయేల్ కొడుకు జెరుబ్బాబెల్, యోజాదాక్ కొడుకు యేషూవ సిద్ధపడి, జెరుసలంలో ఉన్న దేవుని ఆలయాన్ని మళ్ళీ కట్టించడం మొదలు పెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేస్తూ వచ్చారు. 3  అప్పుడు యూఫ్రటీసునది ఇవతల అధిపతి తత్తెనయి, షెతర్‌బోజనయి, వాళ్ళ సహోద్యోగులు వారిదగ్గరికి వచ్చి ఇలా అడిగారు: “ఈ ఆలయాన్ని కట్టడానికి ఈ గోడ నిలపడానికి ఎవరు మీకు అనుమతి ఇచ్చారు?” 4 కట్టడాన్ని చేయించిన వారి పేర్లు మేము వాళ్ళతో చెప్పాం. 5 యూదుల దేవుడు వారి పెద్దలను చూచి కాపాడాడు, గనుక దర్యావేషు చక్రవర్తికి ఈ సంగతి వ్రాసి, అతడి దగ్గరనుంచి జాబు వచ్చే వరకు అధికారులు యూదులను పని చేయకుండా ఆపలేదు. 6 నది ఇవతల అధిపతి తత్తెనయి షెతర్‌బోజనయి, నది ఇవతల వాళ్ళ సహోద్యోగులైన అధికారులు దర్యావేషు చక్రవర్తికి పంపిన లేఖ నకలు ఇది, 7 వాళ్ళు అతడికి తెలియజేసిన సంగతి ఇది:
“దర్యావేషు చక్రవర్తికి సర్వ క్షేమం ప్రాప్తిస్తుంది గాక! 8 చక్రవర్తికి మేము తెలియజేయవలసినది ఏమంటే, యూదా ప్రదేశానికి, గొప్ప దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళాం. ఆ ఆలయాన్ని వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మిస్తున్నారు, గోడలలో మ్రానులను వేస్తున్నారు. ఆ పని జాగ్రత్తగా జరుగుతూ ఉంది, వాళ్ళ చేతిలో త్వరగా సాగుతూ ఉంది. 9 ‘ఈ ఆలయాన్ని కట్టడానికి, ఈ గోడ నిలపడానికి ఎవరు మీకు అనుమతి ఇచ్చారు?’ అని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగాం. 10 వాళ్ళ పేర్లను కూడా అడిగాం. 11 వాళ్ళు ఇలా జవాబిచ్చారు:
‘మేము భూమ్యాకాశాల దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రిందట ఇస్రాయేల్‌లో గొప్ప రాజు ఒకడు ఈ ఆలయాన్ని కట్టించి ముగించాడు. ఈ ఆలయాన్ని మేము మళ్ళీ కట్టిస్తూవున్నాం. 12 మా పూర్వీకులు పరలోక దేవునికి కోపం రేపినందుచేత ఆయన వారిని కల్దీయవాడూ బబులోనురాజూ అయిన నెబుకద్‌నెజరు చేతికి అప్పగించాడు. నెబుకద్‌నెజరు ఈ ఆలయాన్ని నాశనం చేసి ప్రజలను బబులోనుకు తీసుకుపోయాడు. 13 అయితే బబులోను రాజైన కోరెషు పరిపాలించిన మొదటి సంవత్సరంలో కోరెషురాజు దేవుని ఆలయాన్ని ఇక్కడ తిరిగి కట్టడానికి ఆజ్ఞ జారీ చేశాడు. 14 అంతేగాక, నెబుకద్‌నెజరు జెరుసలంలో ఉన్న దేవాలయంలోనుంచి బబులోనులో ఉన్న గుడికి తీసుకుపోయిన వెండి బంగారు వస్తువులను కోరెషురాజు బబులోను గుడిలోనుంచి తెప్పించాడు, తాను అధిపతిగా నియమించిన షేష్‌బజ్జరుకు అప్పగించి, ఇలా ఆజ్ఞాపించాడు: 15 “నీవు ఈ వస్తువులను తీసుకొని, జెరుసలం నగరంలో ఉన్న దేవాలయంలో ఉంచు. దేవుని ఆలయాన్ని దాని స్థలంలో మళ్ళీ కట్టించు.” 16 అందుచేత ఆ షేష్‌బజ్జరు వచ్చి, జెరుసలంలో దేవుని ఆలయం పునాది వేయించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు దానిని కట్టడం జరుగుతూ ఉంది, గాని పని ఇంకా అయిపోలేదు.
17 “కనుక చక్రవర్తికి ఇష్టమైతే బబులోనులో ఉన్న రాజుల ఖజానాలో సోదా చేయించి, జెరుసలంలో దేవుని ఆలయాన్ని కట్టడానికి కోరెషు రాజు ఆజ్ఞ జారీ చేశాడో లేదో తెలుసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి ఈ సంగతిని గురించి తన నిర్ణయం మాకు తెలియజేయగలరని మనవి చేస్తున్నాం.”