4
1 చెరనుంచి వచ్చినవారు ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్న సంగతి విని, యూదా బెన్యామీనుల శత్రువులు✽ 2 జెరుబ్బాబెల్ దగ్గరికి, వంశ నాయకులదగ్గరికి వచ్చారు. “మీలాగే మేము మీ దేవుణ్ణి వెదికి అనుసరిస్తున్నాం. ఇక్కడికి మమ్మల్ని తెచ్చిన అష్షూరు రాజు ఏసర్‌హద్దోను✽ కాలం నుంచి మేము మీ దేవుడికి బలులు అర్పిస్తూ వచ్చాం, కనుక కట్టడానికి మమ్మల్ని సహాయం చెయ్యనివ్వండి” అన్నారు.3 ✽అందుకు జెరుబ్బాబెల్, యేషూవ, మిగతా వంశాల నాయకులు వాళ్ళతో ఇలా అన్నారు: “మా దేవునికి ఆలయాన్ని కట్టడంలో మాతో మీకు భాగం లేదు. మేమే కలిసి ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు ఆలయాన్ని నిర్మిస్తాం. ఈ విధంగా పారసీకదేశం చక్రవర్తి కోరెషు ఆజ్ఞ జారీ చేశాడు కూడా.”
4 ✽ఆ తరువాత, ఆ ప్రాంతంవాళ్ళు యూదావారికి నిరుత్సాహం కలిగించారు. నిర్మిస్తూ ఉన్నవారిని బెదిరించారు. 5 అంతేగాక, పారసీకదేశం చక్రవర్తి కోరెషు కాలమంతట్లో, పారసీకదేశం చక్రవర్తి దర్యావేషు పరిపాలనవరకు యూదావారి ఆశయాన్ని భంగపరచడానికి ఈ శత్రువులు మంత్రులకు లంచాలు ఇస్తూ వచ్చారు.
6 ✽అహష్‌వేరోషు✽ పరిపాలనారంభంలో వాళ్ళు యూదావారి మీద జెరుసలంవాసుల మీద నింద మోపే లేఖ వ్రాసి పంపారు. 7 పారసీకదేశం చక్రవర్తి అర్తహషస్త✽ రోజులలో అతనికి బిష్‌లాం, మిత్రదాతు, టవేల్, వాళ్ళ పక్షం వాళ్ళంతా ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం అరామెయిక్ భాషలో వ్రాశారు. అది అరామెయిక్ భాషనుంచి అనువాదం చేయబడింది. 8 ఆ ప్రాంతీయాధిపతి✽ రెహూం, కార్యదర్శి షిమ్షయి కూడా జెరుసలం ప్రజలమీద నింద మోపే లేఖ అర్తహషస్తకు వ్రాసి పంపారు. వాళ్ళు ఇలా వ్రాశారు:
9 “అధిపతి రెహూం, కార్యదర్శి షిమ్షయి, వాళ్ళ సహోద్యోగులు, న్యాయమూర్తులు, అధికారులు, టర్‌పెలాయేల్, అపార్పా, అరెకు, బబులోను, షూషను (అంటే, ఏలాం) అనే స్థలాలనుంచి వచ్చినవాళ్ళు, 10 మహా ఘనత వహించిన అస్‌నప్పరు✽ పంపివేసి, షోమ్రోన్ నగరంలో, యూఫ్రటీస్‌నది ఇవతల ఉన్న ప్రాంతంలో ఉంచిన తక్కిన జనాలు వ్రాసేది.” 11 (ఇది వాళ్ళు చక్రవర్తికి వ్రాసి పంపించిన లేఖ నకలు.) “యూఫ్రటీసునది ఇవతల ఉన్న మీ దాసులైన మేము చక్రవర్తికి వ్రాసేదేమిటంటే, 12 మీ దగ్గరనుంచి మా దగ్గరికి వచ్చిన యూదులు జెరుసలంకు వచ్చి, తిరుగుబాటు చేసే ఆ చెడు నగరాన్ని మళ్ళీ కడుతున్నారని మేము చక్రవర్తికి తెలియచేస్తున్నాం. వాళ్ళు దాని గోడలను నిలిపి, దాని పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు. 13 ✽గనుక చక్రవర్తికి తెలియ వలసినదేమిటంటే, ఈ నగరాన్ని కట్టి దాని గోడలను నిలువబెట్టడం ముగిస్తే వాళ్ళు శిస్తు గానీ సుంకం గాని పన్ను గాని ఇవ్వరు. అప్పుడు చక్రవర్తికి చేకూరవలసిన రాబడి నష్టం అవుతుంది. 14 మేము చక్రవర్తి ఉప్పు తినేవాళ్ళం, గనుక చక్రవర్తికి అవమానం రాకుండా మేము చూడాలని ఈ లేఖ పంపి, చక్రవర్తికి ఈ సంగతి తెలియజేస్తున్నాం. 15 మీ పూర్వీకులు వ్రాయించిన దస్తావేజులను చూస్తే, ఈ నగరం తిరుగుబాటుతో నిండిన నగరమని మీకు కనిపిస్తుంది. ఈ నగరం రాజులకు, వేరు వేరు ప్రాంతాలకు హానికరం, చాలా కాలం నుంచి పోరాటాలను రేకెత్తించే నగరం. అందుచేతే ఈ నగరం నాశనానికి గురి అయింది. ఇదంతా ఆ దస్తావేజులలో కనబడుతుంది. 16 కనుక వాళ్ళు ఈ నగరాన్ని కట్టి, దాని గోడలను నిలబెట్టడం ముగిస్తే, యూఫ్రటీసునది ఇవతల ఉన్న ప్రాంతంలో మీకు ఏమీ భాగం మిగలదని మేము చక్రవర్తికి తెలియజేస్తున్నాం.”
17 అందుకు చక్రవర్తి ఈ కబురు పంపించాడు: “అధిపతి అయిన రెహూంకు, కార్యదర్శి షిమ్షయికి, షోమ్రోనులోనూ, నది అవతల ఉన్న ప్రాంతంలోనూ ఉన్న వాళ్ళ సహోద్యోగులందరికీ క్షేమం. 18 ✽మీరు మాకు పంపించిన లేఖ అనువాదం చేయించి చదివించుకొన్నాం. 19 నేను ఆజ్ఞ జారీ చేశాను. సోదా చేయడం జరిగింది. గడిచిన కాలంలో ఆ నగరం రాజద్రోహం చేస్తూ వచ్చిందనీ, అక్కడివాళ్ళు ఎదిరింపు, తిరుగుబాటు జరిగించేవాళ్ళని తేలింది. 20 ✝పూర్వం జెరుసలంలో బలమైన రాజులు పరిపాలన చేశారు. నది అవతల ఉన్న ప్రాంతాలన్నీ వాళ్ళ ప్రభుత్వం క్రింద ఉన్నాయి. వాళ్ళకు శిస్తు, సుంకం, పన్ను చెల్లించడం జరిగింది. 21 కనుక ఇప్పుడు ఆ మనుషులు ఆ పని మాని, మేము అనుమతి ఇచ్చేవరకు ఆ నగరాన్ని మళ్ళీ కట్టడం మొదలు పెట్టకూడదని వాళ్ళకు ఆజ్ఞాపించండి. 22 ✽మీరు జాగ్రత్త వహించి ఇలా తప్పక చేయాలి. రాజ్యానికి ఇంకా హాని, నష్టం కలుగకుండా చూడండి.”
23 చక్రవర్తి అర్తహషస్త పంపించిన ఈ లేఖ నకలు రెహూంకు, లేఖకుడైన షిమ్షయికు వాళ్ళ సహోద్యోగులకు చదివి వినిపించగానే వాళ్ళు త్వరపడి జెరుసలంలో ఉన్న యూదులదగ్గరికి వచ్చి, వారు పని మానేలా✽ బలవంతం చేశారు. 24 ✽ఈ విధంగా జెరుసలంలో ఉన్న దేవుని ఆలయం పని నిలిచిపోయింది. పారసీకదేశం చక్రవర్తి దర్యావేషు పరిపాలించిన రెండో సంవత్సరం వరకు ఆ పని ఆగిపోయింది.